వ్యవసాయూనికి 9 గంటల విద్యుత్ వచ్చే ఖరీఫ్ నుంచి పగటి పూటే సరఫరా
గ్రామాల రూపురేఖలు మార్చేందుకే గ్రామజ్యోతి
ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ 2 వేల పడకల ఆస్పత్రిగా ఎంజీఎం
వచ్చే సంవ త్సరం నుంచి కేజీ టు పీజీ విద్య
స్వాతంత్య్ర వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
హన్మకొండ అర్బన్ : పుష్కరాల స్ఫూర్తితో మేడారం జాతర నిర్వహిస్తామని, మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు, గ్రామ సీమల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామజ్యోతి కార్యక్రమం ప్రారంభిస్తోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ చేశారు. అనంతరం పోలీస్ వందనం స్వీకరించి స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాం..
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలు వివరించారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలముందుంచారు. గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి.. అందుకోసం రూ.600 కోట్లతో ఏర్పాట్లు చేసి అన్ని చర్యలు తీసుకుందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న ఫిబ్రవరిలో మేడారం జాతర ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. జిల్లాలో రామన్నగూడెం, ముల్లకట్ట, మంగపట ప్రాంతాల్లో రూ.35 కోట్లతో పుష్కర ఘాట్లు నిర్మించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామన్నారు. ఈసారి 25 లక్షల మంది భక్తులు పుణ్యస్నాలు చేసినట్లు తెలిపారు.
17న గ్రామజ్యోతి ప్రారంభం
ఈనెల 17న గీసుకొండ మండలం గంగిదేవిపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి కడియం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోందని అన్నారు. 180 మంది అమరుల కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు అందజేసిందన్నారు.
ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ
మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 5,839 చెరువులకు గాను మొదటి దశలో రూ.409 కోట్లతో 1,173 చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు మంత్రి కడియం తెలిపారు. అసంపూర్తిగా ఉన్న దేవాదుల ఫేస్-2, వరద కాలువలు, కంతనపల్లి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసి జిల్లాలోని ప్రతీ నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చే స్తోందన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా రానున్న నాలుగేళ్లలో ప్రతీ నియోజకవర్గంలో ఏడాదికి 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కోసం ఆసరా పింఛన్ పథకం ప్రారంభించి వికలాంగులకు నెలకు రూ.1500, మిగతా వారికి రూ.1000 ఇస్తూ ఆదుకుంటోందని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేస్తున్నామని తెలిపారు.
పగటిపూట విద్యుత్
రానున్న ఖరీఫ్‌లో రైతులకు పగటి పూట 9 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు కావల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. అక్టోబర్ నాటికి జిల్లాలో కేటీపీపీ వద్ద మరో 600 మెగావాట్ల విద్యత్ అందుబాటులోలోకి వస్తుందన్నారు. జిల్లాలో రూ.50 కోట్లతో 17 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. 50 యూనిట్ల లోపు విద్యత్ వాడుకున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వమే కరంట్ చార్జీలు చెల్లిస్తోందని.. అందుకోసం రూ.19 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. వాటర్ గ్రిడ్‌ను జిల్లాను 5 జోన్లుగా విభజించి రూ.4 వేల కోట్ల ప్రణాళికలతో పనులు చేపట్టేందుకు సిద్ధంగా ప్రభుత్వం ఉందని శ్రీహరి వివరించారు.
నగర అభివృద్ధి
వరంగల్ నగరంలో రానున్న 50 ఏళ్ల అవసరాలు గుర్తించి రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. 183 మురికివాడల అభివృద్ధికి రూ.26.45 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.80 కోట్లతో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అదేవిదంగా కాళోజి కళాక్షేత్రం నిర్మాణానికి రూ. 15 కోట్లు, రూ.4 కోట్లతో మల్టీపర్పస్ కల్చరల్ కాంప్లెక్స్ ని ర్మించేందకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. నగరం లో 4 వేల ఇళ్ల నిర్మాణానికి రూ.400 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, అంబేద్కర్‌నగర్, ఎస్సార్‌నగర్‌లలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. 1000 పడకల ఆస్పత్రిగా ఉన్న ఎంజీఎం 2 వేల పడకల ఆస్పత్రిగా ఉన్నతీకరించుటకు పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 12 నూతన పీహెచ్‌సీ భవనాలు, రూ.1.80 కోట్లతో 20 సబ్‌సెంటర్ భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
మహిళా సాధికారత
మహిళా సాధికారతలో భాగంగా జిల్లాలోని 7,834 మహిళా గ్రూపులకు రూ.162.59 కోట్లతో బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 73 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.50.95 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఐసీడీఎస్ ద్వారా అమలవుతున్న ధనలక్ష్మి పథకం ద్వారా 8,170 మంది లబ్ధిదారులు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. జిల్లాలో రహదారులు భవనాల శాఖ ద్వారా రూ.964.38 కోట్లతో 116 పనుల ద్వారా 877 కిలోమీటర్ల రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
మంగళవారి పేట నుంచి మల్లంపల్లికిరూ.158.85 కోట్లతో, పస్రా నుంచి ఏటూరునాగారం వరకు రూ.49.68 కోట్లతో రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. రానున్న విద్యా సంవత్సరంలో కేజీ టు పీజీ విద్యను అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కడియం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వాకాటి కరుణ, డీఐజీ మల్లారెడ్డి, సీపీ సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా, జేసీ ప్రశాంత్ పాటిల్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, వంకర్‌నాయక్, ఇతర ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
అభివృద్ధికి పునరంకి తమవుదాం
హన్మకొండ అర్బన్ : జిల్లాలో ప్రజాప్రతినిధులు అధికారులు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హన్మకొండలోని ఇన్‌డోర్ స్టేడియంలో సాయంత్రం ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. ఉత్సహబరిత వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో కడియం పాటలు, ఆటలతో సందడి చేశారు. అంత్యాక్షరి, ఆటలు, ప్రసంగాలతో కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందాలంటే అధికారులు, ప్రజాప్రతనిధులు అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో డీఐజీ మల్లారెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి, కలెక్టర్ వాకాటి కరుణ, సీపీ సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్‌కిషోర్, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, అధికారులు, పురజాప్రతినిధులు పాల్గొన్నారు.
పుష్కరాల స్ఫూర్తితో ‘మేడారం’
Published Sun, Aug 16 2015 3:39 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM
Advertisement
Advertisement