'కేజీ టు పీజీ ఆంగ్లవిద్య అమలు ఏమైంది?'
నల్లగొండ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా విద్యారంగానికి సంబంధించి ఇచ్చిన హామీలను ఆచరణలోకి తీసుకరాకపోవడం పట్ల ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ దిశగా ఎలాంటి కార్యచరణ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఆంగ్ల మాధ్యమం అమలవుతున్న మోడల్ స్కూల్స్ భవనాలకు సంబంధించి నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారని అన్నారు.
కేజీబీవీ స్కూ ల్స్‌లో ప్రహరీగోడలు నిర్మించినా.. వాటికి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో 11 యూనివర్సిటీలకు పాలకమండళ్లు నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. ఇదే విషయమై ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసినప్పుడు ప్రశ్నించానని చెప్పారు. మోడల్ స్కూల్స్ కు నిధులు విడుదల చేయాలని అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి, ప్రస్తుత మంత్రి కడియం శ్రీహరికి లేఖ రాసినట్లు తెలిపారు.