మంత్రి పదవా.. కేబినెట్ హోదానా?
టీఆర్‌ఎస్‌లో గుత్తాకు పదవిపై తర్జనభర్జనలు
- ఎంపీ పదవికి రాజీనామా చేసి వస్తానన్న గుత్తా
- తొలుత అవసరం లేదన్నా.. ఆ తర్వాత తలూపిన సీఎం!
- 2018లో రాజ్యసభ స్థానం, కేబినెట్ హోదాతో ఏదైనా పదవి, ఎమ్మెల్సీగా ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకోవడంపై చర్చ?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ సీనియర్‌నేత, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారం, పది రోజుల్లోపే టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన అధికార పార్టీ గూటికి చేరతారన్న వార్త బయటికి వచ్చేలోపే.. అందుకు సంబంధించిన ‘వ్యవహారం’ అంతా అయిపోయిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గుత్తా టీఆర్‌ఎస్‌లో చేరే విషయంలో కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ కీలకపాత్ర పోషించారని సమాచారం. ఆయన చొరవతోనే తొలుత మంత్రి హరీశ్‌రావుతో చర్చలు జరిగాయని, ఆ తర్వాత గురువారం సీఎం కేసీఆర్‌తో క్యాంపు కార్యాలయంలో మూడు గంటలపాటు భేటీ జరిగిందని తెలుస్తోంది. ఈ చర్చల్లో సీఎం కేసీఆర్, నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆయన అనుంగు అనుచరుడు, డీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పాశం రాంరెడ్డి పాల్గొన్నారు. అక్కడే గుత్తా టీఆర్‌ఎస్‌లో చేరే అంశం ఖరారైపోయింది.
రాజీనామా చేయాలా.. వద్దా..?
ఎంపీ గుత్తా టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఎలా సర్దుబాటు చేయాలన్నదే సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగిన చర్చల్లో ప్రధాన ఎజెండా అని తెలుస్తోంది. ఎంపీ పదవికి రాజీనామా చేశాకే టీఆర్‌ఎస్‌లోనికి వస్తానని గుత్తా చెప్పినట్లు సమాచారం. అయితే, సీఎం తొలుత సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. ‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనమే గెలుస్తాం. మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాల్సి ఉంది. మళ్లీ ఎన్నికలంటే సమయం వృథా అవుతుంది కదా?’ అని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. కానీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ తరఫున గెలిచి పార్టీ మారితే డిస్‌క్వాలిఫై చేసే అవ కాశాలున్నాయన్న చర్చను లేవనెత్తడంతో రాజీనామా చేశాకే పార్టీలోకి రావచ్చని కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది.
రాజీనామా చేసి పార్టీ మారడం ద్వారా నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారన్న గౌరవం కూడా దక్కుతుందనే ఆలోచనలో గుత్తా ఉన్నట్టు తెలుస్తోంది. గుత్తాను టీఆర్‌ఎస్‌లో ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై టీఆర్‌ఎస్ అధినాయకత్వం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. 2018లో జరిగే రాజ్యసభ ఎన్నికల వరకు వెయిటింగ్‌లో ఉం చాలా... అప్పటిదాకా కేబినెట్ హోదాతో ఏదైనా పదవి ఇవ్వాలా.. లేదంటే ఎమ్మెల్సీగా చేసి కేబినెట్‌లోకి తీసుకోవాలా.. అనే మూడు అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఖరారవుతుందని టీఆర్‌ఎస్ వర్గాలు, ఎంపీ గుత్తా శిబిరం చెబుతున్నాయి.
గుత్తా స్థానంలో ఎంపీ అభ్యర్థిగా పల్లా..!
గుత్తా రాజీనామా చేస్తే నల్లగొండ ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బరిలో దించాలనే చర్చ కూడా జరిగిందని సమాచారం.