khadrishudu
-
ఐరావతంపై ఊరేగిన లక్ష్మీనారసింహుడు
కదిరి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు ఐరావతం(గజవాహనం)పై భక్తులకు దర్శన భాగ్యం కల్గించారు. జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక రాష్ట్రం నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు నృసింహుని దర్శనం కోసం తరలివచ్చారు. హిరణ్యకస్యపుడిని సంహరించిన నారసింహుడి ఉగ్ర రూపాన్ని చూడలేని దేవతాగణం మరోసారి యథారూపంలో ప్రసన్నం కావాలని కోరతారు. దీంతో స్వామి వారు అనుగ్రహించి వారి కోరిక మేరకు ఐరావతంపై దర్శనమిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు పార్థసార«థి ఆచార్యులు, నరసింహాచార్యులు వివరించారు. ఆలయ ప్రాంగణంతో పాటు ప్రధాన వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శనివారం బ్రహ్మ రథోత్సవాన్ని తిలకించేందుకు ఒకరోజు ముందే భక్తులు పట్టణం చేరుకున్నారు. ఆలయ అర్చకులు, పండితులు తొలుత యాగశాలలో నిత్య హోమాలు నిర్వహించి రథ కలశం గావించిన తర్వాత రథంపై ప్రతిష్టించారు. శ్రీవారికి నిత్య కైంకర్య సేవలు నిర్వహించిన పిదప బ్రహ్మరథం వద్ద శుద్ధి పుణ్యాహవచనం, వాస్తుహోమాలు, రథాంగ హోమాలు, రథ సంప్రోక్షణ గావించారు. ఐరావతంపై ఊరేగిన అనంతరం తిరిగి ఆలయ ప్రవేశం గావించారు. పూజలనంతరం తెల్లవారుజామున స్వామి వారు రథంపైకి ప్రవేశిస్తారు. ఐరావత ఉత్సవం ఉభయదారులుగా నర్సేపల్లి మురళీధర్, వనజ కుమారి కుటుంబీకులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, చైర్మన్ నరేంద్రబాబు తెలిపారు. డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు నేతృత్వంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
హనుమంత వాహనంపై ఖాద్రీశుడు
కదిరి : బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి హనుమంత వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నరసింహావతారంలో హిరణ్యకశ్యపుడి సంహారం అనంతరం మహావిష్ణువును సాక్షాత్తు హనుమంతుడే దిగివచ్చి తన భుజస్కందాలపై మోస్తాడని భక్తుల నమ్మకం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విల్లంబులు ధరించి హనుమంతుని భుజాలపై కొలువుదీరిన శ్రీవారిని చూడడానికి రెండు కల్లు చాలవు. . త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుని వాహనంగా చేసుకొని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. హనుమంతుని భక్తి తత్పరతను ఈ కాలం వారికి వివరిస్తూ రాముడు, కృష్ణుడు, నారసింహుడు అన్నీ తానేనని స్వామివారు తెలియజేస్తారని అర్చకులు వివరించారు. తిరువీధుల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి ఆలయానికి రాలేని వృద్ధులు, వ్యాధిగ్రస్తులకు దర్శన మిచ్చేందుకు శ్రీవారే తన భక్తుల చెంతకు విచ్చేస్తారని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఉభయ దారులుగా మాజీ శాసనసభ్యుడు జొన్నా రామయ్య కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు, ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. -
నేడు హనుమంత వాహనంపై ఊరేగనున్న ఖాద్రీశుడు
కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రçహ్మోత్సవాల్లో భాగంగా శనివారం హనుమంత వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన రామావతారంలో రాక్షస సంహారం అనంతరం రామలక్ష్మణులను హనుమంతుడు తన భుజస్కందాలపై ఎత్తుకొని భక్తిని చాటుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. నరసింహావతారంలోనూ హిరణ్యకశ్యపుడి సంహారం అనంతరం శ్రీ మహావిష్ణువును హనుమంతుడే సాక్షాత్తూ దిగి వచ్చి తన భుజస్కందాలపై మోస్తాడని భక్తుల నమ్మకం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విల్లంబులు ధరించి హనుమంతుడి భుజాలపై కొలువుదీరిన శ్రీవారిని చూడడానికి రెండు కళ్లూ చాలవు. లక్ష్మీ నారసింహుడిని దర్శించుకోవడానికి ఆలయానికి రాలేకపోతున్న ముసలి, ముతక, వ్యాధిగ్రస్తులకు దర్శనం ఇవ్వడానికి భక్తుల చెంతకే శ్రీవారు విచ్చేస్తారని అర్చకులు చెబుతున్నారు. అందుకే రోజూ బ్రహ్మోత్సవాల సమయంలో తిరువీధుల గుండా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారంటున్నారు. ఉభయదారులుగా జొన్నా వీరయ్య, జొన్నా వీర శేషయ్య కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, చైర్మన్ పచ్చి పులుసు నరేంద్రబాబు పేర్కొన్నారు.