ఓంపురి మృతిపై షాకింగ్ నిజాలు!
ముంబై: విలక్షణ నటుడు ఓం పురి(66) మరణం వెనక కొన్ని అనుమానాలు లేకపోలేదు. ఆయనది సహజ మరణంలా కనిపిస్తున్నా.. ఈ కోణంలో పూర్తిస్థాయిగా నమ్మకం లేదని పోలీసులు అంటున్నారు. ఓంపురికి మిత్రుడు, డ్రైవర్ అయిన ఖాలిద్ కిద్వావ్ పోలీసులకు తెలిపిన వివరాలతో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ముంబైలోని తన నివాసంలో గత శుక్రవారం(జనవరి 6న) ఉదయం గుండెపోటుకు గురై ఓంపురి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే వంటగదిలో నేలపై కుప్పకూలిపోయిన ఆయనకు గాయం కావడం.. ఓంపురి మిత్రుడు చెప్పిన వివరాలకు కాస్త లింక్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఓం పురి చనిపోయిన ముందురోజు(గురువారం) ఏం జరిగిందంటే.. తన కుమారుడు ఇషాన్‌ను కలిసుకునేందుకు త్రిశూల్ బిల్డింగ్‌కు ఆయన వెళ్లారు. తన మాజీ భార్య నందితతో కలిసి కుమారుడు ఇషాన్ ఓ పార్టీకి వెళ్లినట్లు కొద్దిసేపటి తర్వాత ఓంపురికి తెలిసింది. భార్య నందితకు ఫోన్ చేసి కుమారుడితో సహా త్వరగా వచ్చేయమని చెప్పాడు. ఈ క్రమంలో వీరిమధ్య ఫోన్లో కాస్త వాగ్వివాదం జరిగిందని ఓంపురి మిత్రుడు కిద్వాయ్ తెలిపాడు. దాదాపు గంటసేపు వేచిచూసినా వారు రాలేదు. ఆ తర్వాత కారులో కూర్చుని కొద్దిసేపు మద్యం సేవించి ఓంపురితో సహా తాను వెళ్లిపోయానని చెప్పాడు. ఆ అర్ధరాత్రి ఏం జరిగిందో తెలియదు.. కానీ తెల్లవారేసరికి మిత్రుడి మరణవార్త వినాల్సి వచ్చిందని నటుడి డ్రైవర్ కమ్ ఫ్రెండ్ ఖాలిద్ కిద్వావ్ వివరించారు. కాగా, ప్రమాదం వల్ల ఓం పురి మరణించినట్లు(ఏడీఆర్) పోలీసులు శనివారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.