‘మేం ట్విన్ టవర్స్‌ను అందుకే కూల్చాం’
న్యూయార్క్: సాధారణంగా.. 2001, సెప్టెంబర్ 11 అని చెప్పగానే అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడి గుర్తొస్తుంది. అల్ కాయిదా చేసిన ఈ దాడి పేరు చెబితే ప్రపంచం గురించేమోగానీ ప్రతి అమెరికన్ మాత్రం ఉలిక్కిపడతాడు. అయితే, వాడి దాడి చేయడానికి కారణాలు పెద్దగా ప్రపంచానికి తెలియదు. ప్రతి సమస్యను పరిష్కరించుకునేందుకు మాట్లాడుకునే వెసులుబాటు ఉండగా విధ్వంసాన్ని సృష్టించిన కారణాలు ఎంతపెద్దవైనా వాటికి విలువ ఉండదు.. అయితే వాటిని తెలుసుకోవడం కొంతవరకు మంచిదే.
ఈ నేపథ్యంలోనే అమెరికాపై తాము ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో వివరిస్తూ సరిగ్గా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవి నుంచి దిగిపోయే కొద్ది రోజులకు ముందు ఖలీద్ షేక్ మహ్మద్ అనే వ్యక్తి ఓ లేఖను పంపించాడు. నాటి దాడుల వెనుక ఒసామా బిన్ లాడెన్ ఉన్నప్పటికీ కీలక సూత్రదారి మాత్రం ఇతనే అని చెప్తారు. విధ్వంసకర విధానాలకు ప్రతీకారంగానే తాము నాడు దాడి చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
ఖలీద్ షేక్ చెప్పిన విషయాలేమిటంటే..
విదేశాంగ విధానం
‘ అమెరికా విదేశాంగ విధానం మాకు నచ్చలేదు. అమెరికన్ ఇండియన్స్‌పై దాడుల, వియత్నాం, కొరియా, టోక్యో, హిరోషిమా, నాగాసాకి, డ్రెస్డెన్, లాటిన్లాంటి దేశాల్లో మీ దేశ నేరాలు కోకొల్లలు. చైనా, మెక్సికో, శాంతా అన్నా దేశాల నియంతలకు మీరిచ్చే మద్దతు నచ్చలేదు. మీకు నచ్చిన దేశాల్లో మీ ఆర్మీ పెట్టుకుంటే మేం పట్టించుకోం.. కానీ మా ముస్లిం దేశాల్లో కూడా సైన్యాన్ని నిలిపారు అందుకు మేం ఒప్పుకోం’
పాలస్తీనా విషయంలో..
‘గత 60 ఏళ్లుగా పాలస్తీనాలో మీరు మారణకాండను సృష్టిస్తున్నారు. 4మిలియన్లమందిని అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేశారు. వారి ఇళ్లను ధ్వంసం చేశారు. ఇజ్రాయెల్ సేనతో చేతులు కలిపి ఐక్యరాజ్యసమితి వారి నేరాలు బయటకు రాకుండా చూశారు. 60 ఏళ్లపాటు ఈ వ్యవహారం చూసి తట్టుకోలేక దాడి చేశాం’
మీడియా.. అబ్రహం లింకన్..
మీరు మీ దేశం మీడియా నిపుణులు కలిసి నిజాలు తొక్కిపెడతారు.. మీ దేశాన్ని ప్రపంచానికి గొప్పగా చూపించేందుకు నిజాలను సమాధి చేస్తారు. అబ్రహం లింకన్ చెప్పినట్లు.. ‘మీరు అందర్నీ కొన్నిసార్లు వెదవల్ని చేయొచ్చు..కొంతమంది ప్రజలు మాత్రం అన్నిసార్లు చేస్తారు.. అయితే, అందర్నీ అందరూ అన్నిసార్లు మాత్రం వెదవల్ని చేయలేరు. మీకు వ్యతిరేకంగా తొలుత యుద్ధం మొదలుపెట్టింది మేం కాదు.. మీరే మా భూమిలో అడుగుపెట్టి యుద్ధం చేసే పరిస్థితి తెచ్చారు.
ఇరాక్‌ను ఉద్దేశిస్తూ
ఇరాక్‌ను ఒక రక్తపు తివాచీలా మార్చారు. ఇరాక్‌లో మీరెప్పుడైనా భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాలు చూశారా? కానీ, ప్రపంచంలోనే అతిపెద్ద రాయభార కార్యాలయం కోసం మంచి చోటు మాత్రం చూసుకున్నారు. దాని ద్వారా ఆయిల్ వ్యాపారంలో అడుగుపెట్టి మీ చెప్పుచేతల్లో ఉన్నవారి సహాయంతో గుత్తాధిపత్యం కోసం ఇదంతా సృష్టించారు.. అందుకే దాడి చేశాం.
ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై..
బిన్ లాడెన్‌ను అల్లా కృప ఉంటుంది. న్యూయార్క్‌పై దాడి చేసి మీ ఆర్థిక వ్యవస్థ దెబ్బకొట్టాలన్న కల నెరవేర్చుకున్నాడు. ఒక్క వాణిజ్యసముదాయంపైనే దాడి చేశాడే తప్ప స్కూళ్లు, ఆస్పత్రులు, శరణాలయాలు, నివాసాలు, చర్చిలపై దాడి చేయలేదు.. అయితే, కొందరి ప్రాణాలు పోయాయి.. మా అసలు లక్ష్యం మీ ఆర్థిక వ్యవస్థను కూల్చడమే. కానీ, మీరు మీ సైన్యం చేసిన ప్రతి దాడిలో మా చిన్నారులతో సహా ప్రాణాలుపోయాయి’
లాడెన్‌ను చంపడంపై..
మీ విలువలేమిటో ప్రపంచానికి తెలిసింది. కనీసం దర్యాప్తు చేయకుండా ప్రాథమిక విచారణ జరపకుండా లాడెన్‌ను హతమార్చారు. అతడి దేహాన్ని సముద్రంలో పడేయాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ తంతు మొత్తాన్ని అధ్యక్షుడు చూశాడు’ అంటూ ఓ భారీ లేఖను విడుదల చేశాడు.