కసరత్తు షురూ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసన సభ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ముసాయిదా ఓటరు జాబితా విడుదలకు కసరత్తు చేస్తూనే.. మరోవైపు జిల్లాలోని ఈవీఎం పరిశీలనతోపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది. ఈ క్రమంలో వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన విధుల్లో నిమగ్నమయ్యారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, ఓటరు జాబితా ముసాయిదా ప్రకటన కోసం అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతుండగా.. రాష్ట్ర శాసన సభ రద్దు కావడం.. ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుండటంతో ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.
శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసి సిద్ధంగా ఉండేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల పనుల తీరుపై ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. వారికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన సాగుతోంది. ఇది వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగుతుంది. అదేరోజు ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించనున్నారు. అనంతరం 8వ తేదీన పూర్తిస్థాయి ఓటరు జాబితా ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి విచారణ చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఇతర పనులను కూడా అధికారులు ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారు.
రాజకీయ పార్టీలతో ఎఫ్ఎల్సీ..
త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లాకు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు చేరాయి. వీటిని కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాం లో భద్రపరిచారు. ఇక్కడ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. గత నాలుగు రోజుల క్రితం జిల్లాకు చేరిన ఈవీ ఎంలు, వీవీ ప్యాట్లను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించారు. శుక్రవారం వివిధ రాజకీయ పార్టీలతో కలిసి కలెక్టర్ ఈవీఎంలను ఫస్ట్ లెవల్ చెకింగ్(ఎఫ్ఎల్సీ) చేశారు. ఈ సందర్భంగా పార్టీల నాయకులకు ఈవీఎంల పనితీరుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరు గురించి వివరించారు. అలాగే తమ ఓటు ఎవరికి వేశామనే విషయా న్ని తెలుసుకునేందుకు వీవీ ప్యాట్లు కూడా ఉంటాయ ని పార్టీల నాయకులకు వివరించారు. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ స్వయంగా గోదాం వద్దకు వచ్చి ఈవీఎంలను పరిశీలించారు. అలాగే జాయింట్ కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా అక్కడే ఉండి.. ఈవీఎంలు, వీవీ ప్యాట్ వద్ద అధికారులు చేస్తున్న పనిని పరిశీలిస్తున్నారు.
అమలులోకి నియమావళి..
జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. దీనిని తూచ తప్పకుండా అధికారులు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ పార్టీల నాయకులు ప్రచారం కోసం ఏర్పాటు చేసిన బోర్డులు, ఫ్లెక్సీలను అధికార యంత్రాంగం తొలగిస్తోంది. తాజాగా ఖమ్మం నగరం, కొణిజర్ల, వైరా, ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులను తొలగించారు. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇప్పటికే హెచ్చరించారు
సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అమలులోకి వచ్చే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఇప్పటి నుంచే అమలు చేసేందుకు జిల్లా అధికారులు దృష్టి సారించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం ముఠాపురం, ముజ్జుగూడెం గ్రామాల్లో శుక్రవారం పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో మంత్రి పర్యటన రద్దయినట్లు సమాచారం.
దీంతో ఆయా అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పుడు ప్రారంభిస్తారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఇదే రీతిన జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని.. నియమావళికి అనుగుణంగా వ్యవహరించని వారికి సంబంధించి తక్షణమే సమాచారం అందించాలని నియోజకవర్గ, మండలస్థాయి అధికారులకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.