కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా
మయూరిసెంటర్ (ఖమ్మం): పాఠశాలలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం మంగళవారం ఉదయం ఖమ్మం నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. ఫీజుల విషయంలో ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు మండిపడ్డారు. ఏటా 40 శాతం వరకూ ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయన్నారు.
ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే, పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు అవుతున్నప్పటికీ టీచర్ల కొరత సమస్య తీరలేదన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా సమస్యలు అలానే ఉన్నాయని, వీటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.