తరుముకొస్తున్న ఖరీఫ్ లక్ష్యం!
* జూన్ నాటికి ప్రాజెక్టుల కింద కొత్త ఆయకట్టు
* లక్ష్యం 6.26 లక్షల ఎకరాలు
* క్షేత్ర స్థాయి ఇబ్బందులతో అధికారుల ఉక్కిరిబిక్కిరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కింద పెట్టుకున్న కొత్త ఆయకట్టు లక్ష్యానికి ఓవైపు గడువు ముంచుకొస్తుంటే మరోవైపు ముందుకు కదలని పనులు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ప్రాజెక్టుల పనులపై సమీక్షలు నిర్వహిస్తున్న నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పనుల వేగిరానికి చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో భూసేకరణ, రైల్వే, రహదారుల క్రాసింగ్, సహాయ పునరావాస సమస్యలు ఈ ఏడాది జూన్ నాటికి నిర్ధారించుకున్న 6 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యానికి అడ్డుగా నిలుస్తున్నాయి.
ఖర్చు ఘనం.. ఆయకట్టు గగనం..
ప్రాజెక్టుల పనులు చివరి దశలో ఉన్న ఏడు ప్రాజెక్టులను పూర్తిచేయడంతోపాటు మరో ఎనిమిది ప్రాజెక్టుల కింద పాక్షికంగానైనా సాగునీటిని ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల జాబితాలో కోయిల్‌సాగర్, గొల్లవాగు, రాలివాగు, నీల్వాయి వంటి మధ్యతరహా ప్రాజెక్టులకు రూ. వెయ్యి కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ణయించగా ఇందులో ఇప్పటికే రూ. 900 కోట్ల మేర ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుల కింద 85 వేల ఎకరాల మేర ఆయకట్టును జూన్ నాటికి ఇవ్వాల్సి ఉంది. ఇక పాక్షికంగానైనా నీటిని ఇవ్వాల్సిన వాటిలో మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, నల్లగొండలోని ఏఎమ్మార్పీ, వరంగల్‌లోని దేవాదుల, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండలకు సాగునీటిని ఇచ్చే ఎస్సారెస్పీ-2, వరద కాలువ, కరీంనగర్‌లోని ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టులున్నాయి.
వీటి కింద మొత్తంగా 30 లక్షల ఎకరాల ఆయకట్టును తేవాల్సి ఉండగా ఇంతవరకు రూ. 27 వేల కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇప్పటివరకు 5.88 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వగా ఈ ఏడాది మరో 5.41 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని సంకల్పించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రాజెక్టుల కింద నీటిని ఇవ్వడానికి అవకాశం ఉన్నా ప్రస్తుతం అక్కడ ప్రాజెక్టుల నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి.
సమస్యలు అధిగమిస్తేనే ఫలితం
వర్షాకాలం మొదలవడానికి కేవలం మరో 20 రోజుల గడువే ఉంది. ఈలోగా ప్రధాన పనులను పూర్తి చేస్తేనే జూలై, ఆగస్టు నాటికైనా ఖరీఫ్‌కు సాగునీటినిచ్చే అవకాశం ఉంది. లక్ష్యం గడువు సమీపిస్తున్న తరుణంలో అప్రమత్తమైన నీటిపారుదలశాఖ... ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న భూసేకరణ సమస్యలు, ఆర్అండ్ఆర్ సమస్యలు, రైల్వే, రహదారుల క్రాసింగ్‌లపై దృష్టి పెట్టింది. వీటిపై నిత్యం అధికారులతో సమీక్షిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఈ సమస్యను అధిగమించడం అంత సులువేం కాదు. దీనికితోడు ఎస్కలేషన్ చార్జీలను పెంచాలన్న కాంట్రాక్టర్ల డిమాండ్‌పై ప్రభుత్వం త్వరగా తేలిస్తేనే వారు పనులను వేగిరం చేసే అవకాశాలున్నాయి. అయితే అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు నాటికైనా కనీసం 3 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరిస్తామని చెబుతున్నారు.