khelo India championship
-
ఇకపై యోగా కూడా ‘క్రీడ’
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రాచీన చరిత్ర ఉన్న యోగాసనాలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా గుర్తింపునిచ్చింది. ఇక నుంచి యోగాసనాలను అధికారికంగా పోటీ క్రీడగా పరిగణించనున్నట్లు గురువారం తెలిపింది. జాతీయ స్థాయి టోర్నీ ఖేలో ఇండియా క్రీడల్లోనూ యోగాసనాలను భాగం చేస్తామని క్రీడా మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘జాతీయ వ్యక్తిగత యోగాసన క్రీడా పోటీల’ను పైలట్ చాంపియన్‌షిప్‌గా నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సంప్రదాయక, ఆర్టిస్టిక్, రిథమిక్, వ్యక్తిగత ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్, టీమ్ చాంపియన్‌షిప్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు. భారత జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య (ఎన్‌వైఎస్‌ఎఫ్‌ఐ)కు ఆర్థికంగా దన్నుగా నిలుస్తామని స్పష్టం చేశారు. -
ఆంధ్ర యూనివర్సిటీ జట్టుకు స్వర్ణం
కటక్: ఖేలో ఇండియా అఖిల భారత విశ్వవిద్యాలయాల క్రీడల్లో భాగంగా పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో ఆంధ్ర యూనివర్సిటీ జట్టు చాంపియన్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్, గారగ కృష్ణప్రసాద్, ప్రణయ్ రెడ్డి, కలగ జగదీశ్, ఆకాశ్ చంద్రన్, ఆదిత్య గోపరాజు బాపినీడు, గూడె సుదీశ్ వెంకట్‌లతో కూడిన ఆంధ్ర యూనివర్సిటీ జట్టు 3–1తో పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్) జట్టుపై గెలిచింది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ రెడ్డి (ఆంధ్ర) 6–21, 7–21తో కార్తీక్ జిందాల్ చేతిలో ఓడిపోయాడు. అయితే రెండో మ్యాచ్‌లో జగదీశ్ 21–16, 21–19తో అభిషేక్ సైనిపై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో శ్రీకృష్ణ సాయికుమార్–కృష్ణప్రసాద్ జంట 12–21, 21–18, 21–15తో కార్తీక్ జిందాల్–హార్దిక్ జోడీపై గెలవడంతో ఆంధ్ర యూనివర్సిటీ ఆధిక్యం 2–1కి చేరింది. నాలుగో మ్యాచ్‌లో ఆదిత్య 21–14, 21–17తో హార్దిక్ మక్కర్‌ను ఓడించడంతో ఆంధ్ర యూనివర్సిటీ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. -
తెలంగాణకు మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఖేలో ఇండియా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గచ్చిబౌలిలో జరుగుతోన్న ఈ పోటీల్లో అండర్–14 బాలబాలికల విభాగాల్లో గెలుపొందిన తెలంగాణ... అండర్–17 విభాగాల్లో ఓటమి పాలైంది. మంగళవారం జరిగిన అండర్–14 బాలుర మ్యాచ్‌లో తెలంగాణ 86– 33తో కర్ణాటక జట్టుపై గెలుపొందగా... బాలికల విభాగంలో 28–4తో జమ్ము, కశ్మీర్ జట్టును ఓడించింది. అండర్–17 విభాగంలో జరిగిన బాలికల మ్యాచ్‌లో తెలంగాణ 7–40తో కేరళ చేతిలో, బాలుర విభాగంలో 31–66తో రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. జిమ్నాస్టిక్స్‌లో రాణించిన నిఖిత ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా జిమ్నాస్టిక్స్ ఈవెంట్లో రాష్ట్రానికి చెందిన నిఖితా గౌడ్ అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంది. టేబుల్ వాల్ట్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ విభాగాల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించింది. టేబుల్ వాల్ట్ ఈవెంట్లో 9.07 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచిన నిఖిత... ఫ్లోర్ ఎక్సర్సైజ్ విభాగంలో 11.60 స్కోరుతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఫ్లోర్ ఎక్సర్సైజ్ విభాగంలో రాష్ట్రానికే చెందిన జి. స్వాతి కూడా 11.34 పాయింట్లు స్కోరు చేసి ఐదోస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. జాహ్నవి, భార్గవిల ముందంజ బ్యాడ్మింటన్ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు జాహ్నవి, భార్గవి, సాహస్, రాజ్ ముందంజ వేశారు. అండర్–14 బాలుర సింగిల్స్ విభాగంలో రాజ్ (తెలంగాణ) 15–12, 15–9తో దేవహిత్ శర్మపై గెలుపొందగా... మరో సాహస్ కుమర్‌కు వాకోవర్ లభించింది. ఆంధ్రకు చెందిన సంజీవ రావు 15–11, 15–6తొ హర్షిక్ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించాడు. బాలికల విభాగంలో కె. భార్గవి (తెలంగాణ) 21–16, 21–8తో సరోజ్‌ఖాన్ (తిరుపతి)పై, ఎన్. జాహ్నవి (ఏపీ) 21–16, 11–21, 21–8తో సాహు (గుజరాత్)పై గెలుపొందారు.