విశాఖ కిడ్నాప్ ఎపిసోడ్: రియల్ ఎస్టేట్ గొడవలు కాదు.. సినీఫక్కీలో నిందితుల ఛేజ్
సాక్షి, విశాఖపట్నం: కలకలం రేపిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులతోపాటు ప్రముఖ ఆడిటర్.. వైఎస్సార్సీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరావు కిడ్నాప్ వ్యవహారంపై విశాఖపట్నం పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ స్పందించారు. కిడ్నాపర్లు బుధవారమే ఎంపీ ఇంట్లోకి ప్రవేశించారని.. తొలుత శరత్‌ను, ఆపై ఎంపీ భార్యను, అటుపై జీవీని తమ అదుపులోకి తీసుకున్నారని సీపీ వివరించారు. ఎంపీ కిడ్నాప్‌నకు సైతం యత్నించిన కిడ్నాపర్లు.. అది కుదరదని అర్థమై డబ్బు డిమాండ్ చేసి ఈ క్రమంలోనే పట్టుబడ్డారని వివరించారాయన.
ఎంపీ ఎంవీవీ తన తనయుడు శరత్ చంద్రాకు, అలాగే ఆడిటర్ జీవీ(గన్నమనేని వెంకటేశ్వరావు)కి ఎంతసేపు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆయనకు అనుమానం వచ్చింది. ఉదయం 8గంటలకు ఎంపీ ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసు బృందాలు అప్రమత్తం అయ్యాయి. ఆడిటర్ జీవీకి ఫోన్ చేస్తే ఆయన లైన్ లోకి వచ్చారు... నాకేమీ కాలేదు, శ్రీకాకుళం నుంచి వస్తున్నాను అని చెప్పారు. కానీ మా వద్ద ఉన్న టెక్నికల్ ఎవిడెన్సులు చూస్తే, ఆడిటర్ జీవీ ఏదో పొంతన లేకుండా మాట్లాడినట్టు అర్థమైంది. సెల్ ఫోన్ సిగ్నల్ రుషికొండ ఏరియాను చూపిస్తోంది.
అప్పుడే వాళ్లు కిడ్నాప్‌నకు గురైనట్లు అర్థమైంది. మా దగ్గర ఉన్న ఆధారాలతో అధికారులందరం ఈ కిడ్నాప్ వ్యవహారం మీద ఫోకస్ పెట్టాం. ఋషికొండ ఏరియాలో కిడ్నాపర్ల సిగ్నల్స్ ట్రేస్ అయ్యాయి. పద్మనాభాపురం ఏరియాలో కిడ్నాపర్లు వెళ్తున్న కారును గుర్తించాం. ఛేజింగ్ లో కిడ్నాపర్లు తమ వాహనంతో.. మా పోలీస్ వాహనాన్ని ఢీకొట్టారు కూడా. కారు సీఐ వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న తుప్పల్లోకి వెళ్లిపోయింది. దాంతో హేమంత్, రాజేశ్ అనే ఇద్దరు వ్యక్తులు కారు దిగి పరిగెత్తారు. వాళ్లిద్దరినీ పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.
కిడ్నాపర్లలో ఒకరు గతంలో ఎంపీకి చెందిన కంపెనీలో సబ్ కాంట్రాక్టరుగా పనిచేశారు. ఎంపీ వద్ద బాగా డబ్బు ఉంటుందని భావించి ఈ కిడ్నాప్ కు ప్రయత్నించారు. డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లలో హేమంత్ అనే వ్యక్తిపై హత్య, పలు కిడ్నాప్ లు సహా 12 కేసులు ఉన్నాయి. హేమంత్ స్వస్థలం భీమిలి" అని సీపీ తివిక్రమ వర్మ వివరించారు.
ఎంపీ ఎంవీవీ ఇంటికి సీసీ కెమెరాలు లేవు. కిడ్నాపర్ల నిన్ననే ఎంపీ ఇంట్లోకి ప్రవేశించారు. మొదట ఎంపీ తనయుడు శరత్‌ని కిడ్నాప్ చేశారు. ఎంపీ భార్యను ఆపై జీవీని కిడ్నాప్ చేశారు. ఎంపీని కిడ్నాప్ చేయడం వీలుకాదని గుర్తించి.. చెరలో ఉన్నవాళ్ల నుంచి డబ్బు డిమాండ్ చేశారు. ఎంపీ తనయుడు, జీవీ కలిసి తమకు తెలిసిన వాళ్ల నుంచి డబ్బు రప్పించారు. ఇద్దరూ కలిసి రూ. 1.75 కోట్లు కిడ్నాపర్లకు ఇచ్చారు. ఈ ఉదయం మరో పాతిక లక్షలు కావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పట్టుబడ్డారని సీపీ వివరించారు.17 బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొని కిడ్నాపర్లను పట్టుకున్నాయని వివరించారాయన.
నిందితుడు హేమంత్ మీద 12 కేసులు ఉన్నాయి. అతను ఉండేది భీమిలిలో. గతంలో కూడా ఒక హత్య కేసులు, పలు కిడ్నాప్ కేసులు నిందితుడు పై ఉన్నాయి. ఈ కిడ్నాప్ కేసులో మొత్తం ఏడుగురు నిందితుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. హేమంత్, రాజేష్‌లను పట్టుకున్నాం. మిగతా వాళ్ల కోసం గాలింపు చేపట్టాం అని సీపీ వెల్లడించారు.
రౌడీషీటర్ హేమంత్
కేవలం డబ్బు కోసమే..
ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో తన కుటుంబం, జీవీ కిడ్నాప్‌నకు గురైనట్లు తనకు అనుమానం వచ్చిందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. తన కొడుకుని కిడ్నాప్ చేసింది హేమంత్ అనే రౌడీ షీటర్ అని తెలిసిందని ఎంవీవీ తెలిపారు. గతంలో కూడా రౌడీషీటర్ హేమంత్ కిడ్నాప్ కేసులో ముద్దాయిగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అసలు ఈ కిడ్నాప్ కేవలం డబ్బు కోసమే జరిగిందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వెల్లడించారు. డబ్బు కోసమే తన కొడుకుని, భార్యని కిడ్నాప్ చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ కమిషనర్, డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు.
నాకు ఎటువంటి రియల్ ఎస్టేట్ గొడవలు లేవు. కేవలం డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేశారు. మా అబ్బాయిని కిడ్నాప్ చేసే సమయంలో మా కోడలు ఇంట్లో లేదు. పీకపై కత్తి పెట్టి కిడ్నాపర్లు ముగ్గుర్నీ బెదిరించారు. మొదట మా అబ్బాయిని మొన్న కిడ్నాప్ చేశారు. నిన్న మా భార్యను మా అబ్బాయితో ఫోన్ చేయించి రప్పించారు. తరువాత మా అబ్బాయి నా భార్యతో ఫోన్ చేయించి జీవీని రప్పించారు. కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ చేశారు. నన్ను కూడా రప్పించాలని ప్రయత్నించారు. నాకు సెక్యూరిటీ ఎక్కువగా ఉండడంతో మా వాళ్ళని డబ్బు డిమాండ్ చేశారు. నిన్న(బుధవారం) ఉదయం నేను హైదరాబాద్ వెళ్ళాను. జీవీతో నాకు తప్పుడు సమాచారం ఇప్పించారు. సెక్యూరిటీ వాళ్లు లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడ్డారు అని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియాకు తెలిపారు.
ఛేజ్ చేసి మరీ..
శరత్ కిడ్నాప్‌కు గురయ్యాడనే విషయం బయటకు తెలియకుండా కిడ్నాపర్లు జాగ్రత్తలు పడ్డారు. తనకు నీరసంగా ఉందంటూ శరత్ చేత ఎంపీ భార్య జ్యోతికి ఫోన్ చేయించారు. దీంతో ఆమె రుషికొండలోని ఇంటికి చేరుకోగా.. ఆమెనూ తమ చెరలోకి తీసుకున్నారు. ఆపై జీవీని సైతం కిడ్నాప్ చేశారు. ఈ ఉదయం రుషికొండ ఇంటి నుంచి శరత్ ఆడి కార్లోనే ముగ్గురినీ దుండుగులు తీసుకెళ్లారు. పద్మనాభం సమీపంలో ఆడి కార్ పంక్చర్ కావడంతో వాళ్ళను వదిలి పారిపోయిన కిడ్నాపర్లు. అప్పటికే ప్రాధమిక సమాచారం తో వారిని అనుసరించిన పోలీసులు.. ఆపై కిడ్నాపర్లను వెంటాడి పట్టుకున్నారు.