Kidnapped children
-
చిన్నపిల్లల కిడ్నాపర్ల ముఠా అరెస్టు
సాక్షి, గుంటూరు : చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ఓ ముఠాను గుంటూరు రూరల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు వివరాలు వెల్లడించారు. గత నెల 28వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు నక్క శామ్యూల్, సరస్వతి దంపతులకు చెందిన ఆరేళ్ల కుమారుడిని గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ఇంటూరు గ్రామం లాకుల సెంటర్లో గుర్తు తెలియని పురుషుడు, మహిళ కిడ్నాప్ చేశారు. తల్లితండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన అమృతలూరు పోలీసులు కూచిపూడి గ్రామం ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా మోటర్ సైకిల్‌పై వెళ్తున్న జంటను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా పురుషుడు బైక్‌ను వదిలి పారిపోయాడు. పట్టుబడిన మహిళ ముత్యాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా తూర్పు గోదావరి జిల్లా నాగుల్లంక గ్రామానికి చెందిన లక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా మార్టూరు గ్రామానికి చెందిన కొండమ్మ, తూర్పుగోదావరి జిల్లా ఆడూరు గ్రామానికి చెందిన సంత అనే ముగ్గురు మహిళలు, పశ్చిమ గోదావరి జిల్లా మంచిలి గ్రామానికి చెందిన ఏడుకొండలు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ చెప్పారు. ముఠా ప్రధాన సభ్యుడు తూర్పుగోదావరి జిల్లా ఆడూరు గ్రామానికి చెందిన దానయ్య పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితుల నుంచి ఆరు సంవత్సరాల వయసు గల ముగ్గురు మగపిల్లలు, 5 సంవత్సరాల పాపను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. కిడ్నాపర్ల ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న చిన్న పిల్లల శరీరాలపై తీవ్రంగా కొట్టి, వాతలు పెట్టిన గాయాలున్నాయని ఎస్పీ తెలిపారు. నిందితులంతా పాత ముద్దాయిలే... కిడ్నాప్ కేసులో పట్టుబడ్డ ముఠా సభ్యులంతా గతంలో అనేక దొంగతనాలు, హత్య కేసుల్లో జైలుశిక్ష అనుభవించిన వారేనని ఎస్పీ వెల్లడించారు. వీరు అమృతలూరు, బాపట్ల, తెనాలి, చెరుకుపల్లి, వేమూరు మండల పరిధిలో ఆరు దొంగతనాలు చేశారని, దొంగతనాలకు సంబంధించి రూ.5.50 లక్షల విలువ గల 196 గ్రాముల బంగారు ఆభరణాలు, కిడ్నాప్‌కు ఉపయోగించిన ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారి చేత బలవంతంగా బిక్షాటన చేయించేవారని చెప్పారు. కిడ్నాపర్ల ముఠా సభ్యులంతా ఉభయగోదావరి జిల్లాలకు చెందిన దగ్గరి బంధువులేనని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ముగ్గురు మగపిల్లల్లో ఒకరిని శామ్యూల్, సరస్వతి దంపతుల కుమారునిగా గుర్తించామని, మిగిలిన ముగ్గురు పిల్లలను గుర్తించడంలో భాగంగా డీఎన్ఏ శాంపిల్స్ సేకరిస్తున్నామని ఎస్పీ చెప్పారు. -
పిల్లల కిడ్నాప్‌పై పుకార్లు షికార్లు
సంగారెడ్డి క్రైం : సంగారెడ్డి డివిజన్ పరిధిలో కొన్ని రోజులుగా పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారంటూ వదంతులు జోరుగా సాగుతున్నాయి. దీంతో పిల్లల తల్లిదండ్రులు తీ వ్ర ఆందోళనకు గురవుతున్నారు. పట్టణమంతా ఈ కిడ్నాప్ వదంతులు వ్యాపించాయి. ఏ నోటా విన్నా పిల్లలను పట్టుకెళ్లే వారు తిరుగుతున్నారట.. అంటూ చ ర్చించుకోవడమే కనిపిస్తోంది. దీంతో పిల్లల తల్లిదండ్రులంతా తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. స్కూళ్లకు, బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి తిరిగొచ్చే వరకు పిల్లల తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఏ ఒక్కరు కూడా అపరిచితులు కనిపిస్తే వారిపై ప్రజలు ఓ కన్నేసి ఉంచుతున్నా రు. ఇక రాత్రి సమయాల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కాలనీల్లోకి వస్తే చాలు వారు పిల్లలను కిడ్నాప్ చేసే వారంటూ చితకబాదుతున్నారు. తర్వాత పోలీసులకు అప్పగిస్తున్నారు. పోలీసులు ఆ అపరిచిత వ్యక్తుల గురించి ఆరా తీయగా వారు ఏదో పనిపై వస్తున్నారని తేలుతోంది. చిన్నారుల కిడ్నాప్ జరుగుతుందని వదంతులు వ్యాపిస్తున్నాయే తప్ప ఎక్కడా కూడా పిల్లలను సంగారెడ్డి డివిజన్, పట్టణంలో నుంచి కిడ్నాప్ చేసిన సంఘటనలు లేవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పలు గ్రామాల్లో డప్పు చాటింపులు సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ఖాన్ పేట పరిధిలోని గౌడిచెర్లలో పిల్లల కిడ్నాప్‌పై అప్రమత్తంగా ఉండాలంటూ సర్పంచ్ ఆధ్వర్యంలో డప్పు చప్పుడు చాటింపు సైతం వేయించారు. కొండాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ కిడ్నాప్ వదంతులు ఇంకా జోరందుకున్నాయి. దాదాపు అన్ని గ్రామాల్లో పిల్లల అప్రమత్తతపై డప్పుతో చాటింపులు చేశారు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో చెత్త కాగితాలు ఏరుకునే వారు కొందరు కాలనీలో తిరుగుతుండగా గ్రామస్తులు వారిని అనుమానించి చితకబాదారు. తర్వాత సంగారెడ్డి రూరల్ పోలీసులకు అప్పగించారు. చైల్డ్ లైన్‌కు చెందిన సభ్యులు కొందరు నారాయణరెడ్డికాలనీకి మంగళవారం రాత్రి వచ్చి పంద్రాగస్టు రోజున జెండా ఎగురవేస్తామని, ఇక్కడ పిల్లలు ఉన్నారా? అని అడగడంతో కాలనీవాసులంతా వారిని పట్టుకున్నారు. పిల్లలు కిడ్నాప్ చేసేవారు మీరేనా? అంటూ వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పిల్లలను కిడ్నాప్ చేసి రంగారెడ్డి జిల్లాలోని శివారు గ్రామాల్లో గుప్త నిధుల వెలికి తీసేందుకు నర బలి ఇస్తున్నారని, అందుకే పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదిలా ఉంటే పిల్లల కిడ్నాప్‌పై పాఠశాలల యాజమాన్యాలు సైతం అప్రమత్తమయ్యాయి. తమ పిల్లలకు తాము బాధ్యులం కాదని, పిల్లలను స్వయంగా పాఠశాలలకు వచ్చి, స్కూల్ బస్సుల వద్దకు వచ్చి తీసుకెళ్లాలని ఎస్ఎంఎస్ల ద్వారా పిల్లల తల్లిదండ్రులకు సమాచారం సైతం అందించాయి. ఏ ఒక్క పిల్లవాడిని సైతం బయటకు రాకుండా సెక్యూరిటీ గార్డులతో పాఠశాల పరిసరాల్లో నిఘా కట్టుదిట్టం చేశాయి. పిల్లల తల్లిదండ్రులు తప్ప ఏ ఇతర వ్యక్తులను పాఠశాలలోకి యాజమాన్యం అనుమతినివ్వడం లేదు.