వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ వెంకటప్పల నాయుడు, పక్కన ఏఎస్పీ, డీఎస్పీ, వెనుక నిందితులు
సాక్షి, గుంటూరు : చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ఓ ముఠాను గుంటూరు రూరల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు వివరాలు వెల్లడించారు. గత నెల 28వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు నక్క శామ్యూల్, సరస్వతి దంపతులకు చెందిన ఆరేళ్ల కుమారుడిని గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ఇంటూరు గ్రామం లాకుల సెంటర్‌లో గుర్తు తెలియని పురుషుడు, మహిళ కిడ్నాప్ చేశారు.
తల్లితండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన అమృతలూరు పోలీసులు కూచిపూడి గ్రామం ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా మోటర్ సైకిల్‌పై వెళ్తున్న జంటను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా పురుషుడు బైక్‌ను వదిలి పారిపోయాడు. పట్టుబడిన మహిళ ముత్యాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా తూర్పు గోదావరి జిల్లా నాగుల్లంక గ్రామానికి చెందిన లక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా మార్టూరు గ్రామానికి చెందిన కొండమ్మ, తూర్పుగోదావరి జిల్లా ఆడూరు గ్రామానికి చెందిన సంత అనే ముగ్గురు మహిళలు, పశ్చిమ గోదావరి జిల్లా మంచిలి గ్రామానికి చెందిన ఏడుకొండలు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ చెప్పారు.
ముఠా ప్రధాన సభ్యుడు తూర్పుగోదావరి జిల్లా ఆడూరు గ్రామానికి చెందిన దానయ్య పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితుల నుంచి ఆరు సంవత్సరాల వయసు గల ముగ్గురు మగపిల్లలు, 5 సంవత్సరాల పాపను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. కిడ్నాపర్ల ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న చిన్న పిల్లల శరీరాలపై తీవ్రంగా కొట్టి, వాతలు పెట్టిన గాయాలున్నాయని ఎస్పీ తెలిపారు.
నిందితులంతా పాత ముద్దాయిలే...
కిడ్నాప్ కేసులో పట్టుబడ్డ ముఠా సభ్యులంతా గతంలో అనేక దొంగతనాలు, హత్య కేసుల్లో జైలుశిక్ష అనుభవించిన వారేనని ఎస్పీ వెల్లడించారు. వీరు అమృతలూరు, బాపట్ల, తెనాలి, చెరుకుపల్లి, వేమూరు మండల పరిధిలో ఆరు దొంగతనాలు చేశారని, దొంగతనాలకు సంబంధించి రూ.5.50 లక్షల విలువ గల 196 గ్రాముల బంగారు ఆభరణాలు, కిడ్నాప్‌కు ఉపయోగించిన ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారి చేత బలవంతంగా బిక్షాటన చేయించేవారని చెప్పారు. కిడ్నాపర్ల ముఠా సభ్యులంతా ఉభయగోదావరి జిల్లాలకు చెందిన దగ్గరి బంధువులేనని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ముగ్గురు మగపిల్లల్లో ఒకరిని శామ్యూల్, సరస్వతి దంపతుల కుమారునిగా గుర్తించామని, మిగిలిన ముగ్గురు పిల్లలను గుర్తించడంలో భాగంగా డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరిస్తున్నామని ఎస్పీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment