మూత్రంలో రక్తం.. తరచూ జ్వరం, కడుపునొప్పిగా అనిపిస్తుందా?
మన శరీరంలో మూత్రపిండాలను కీలకమైన అవయవాలుగా చెప్పుకోవచ్చు. శరీరంలోని విష పదార్థాలను వడపోసి, మూత్రం ద్వారా బయటకు పంపిచే ఇవి హార్మోన్లను, ఎంజైములను కూడా విడుదల చేస్తుంటాయి. రక్తపోటును నియంత్రించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంటాయి. అందుకే బీపీ ఎక్కువగా ఉంటే కిడ్నీ పరీక్షలనూ చేయించుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడేవారిలో కిడ్నీ వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్‌లు చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి.
మూత్రపిండాలకు సంబంధించి నాలుగు రకాల సమస్యలు తలెత్తుతుంటాయి.
1. కిడ్నీ ఇన్ఫెక్షన్స్
2. కిడ్నీ స్టోన్స్
3. కిడ్నీ ఫెయిల్యూర్
4. కిడ్నీ ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్
మహిళల్లో ఎక్కువగా కనిపించే బ్యాక్టీరియల్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కిడ్నీల వరకు పాకి ఇన్ఫెక్షన్స్కు గురిచేస్తుంటాయి. యాంటీబయాటిక్ కోర్సులతో ఈ సమస్య తొలగిపోతుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్య పురుషులలో ఎక్కువ. ఇవి ఇసుక రేణువు పరిమాణం నుంచి గోల్ఫ్‌బాల్ సైజు వరకు ఉంటాయి. అంత ప్రమాదకరం కాకపోయినా, తీవ్రమైన నొప్పి, బాధ కలిగించే ఈ స్టోన్స్‌కు సైజును బట్టి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
అధిక బరువు, పొగతాగడం, మద్యం తీసుకోవడం, రక్తపోటు, షుగర్ లెవల్స్ అదుపులో లేకపోవడం వల్ల కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదం ఉంది. అయితే పూర్తిగా ఫెయిలైనప్పుడే లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక సైలెంట్ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌కు డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స పద్ధతులు తప్పనిసరి.
పుట్టుకతో వచ్చే కిడ్నీలో కణుతుల సమస్య... పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా డాక్టర్ చెకప్‌కు వెళ్లినప్పుడు బయటపడుతుంది. కణితి పరిమాణం బట్టి మూత్రంలో రక్తం, కడుపునొప్పి, జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, అజీర్ణం, హైబీపీ వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెఫ్రోబ్లాస్టోమా లేదా విల్మ్స్ ట్యూమర్‌గా చెప్పుకునే కిడ్నీృకణుతులు పిల్లల్లో 4, 5 ఏళ్ల వయసులో బయటపడుతూ ఉంటాయి. ఈ కణుతులను పూర్తిగా నయం చేయడం సాధ్యమే.
రీనల్ సెల్ కార్సినోమా (ఆర్సీసీ): ఈ రకం కణితి పెద్ద వయసులో కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులకు, ఇతర భాగాలకు వ్యాపించే గుణం ఈ క్యాన్సర్‌కు ఎక్కువ. ఒక్కోసారి ఇలా వ్యాప్తి అయిన భాగాల ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను గుర్తిస్తారు. ఒక్కొక్కసారి రెండు కిడ్నీల్లోనూ కణుతులు ఉండవచ్చు. అనేక సబ్టైపుల్లో ఉండే ఈ క్యాన్సర్‌ను ఒక్కోసారి ఇతర కిడ్నీ పరీక్షలలో, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలలో కనుగొంటుంటారు. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ పెరిగే అవకాశం ఎక్కువ. అయితే స్మోకింగ్ చేసే చిన్నవయసు వారిలోనూ ఇది కనిపిస్తున్నట్టు సర్వేలు తెలియజేస్తున్నాయి. స్మోకింగ్, ఆల్కహాల్, అధికబరువు వంటి వాటితో పాటు జీన్మ్యూటేషన్స్ ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు.
లక్షణాలు కనిపించనప్పుడు ఫిజికల్ ఎగ్జామ్, బ్లడ్ టెస్ట్‌లు, యూరిన్ టెస్ట్‌లు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ, ఎమ్మారై, క్యాల్షియమ్ లెవల్స్ తెలిపే పరీక్షలు చేయించాలి. ఒక్కోసారి ఈ క్యాన్సర్ బయటపడేసరికే ఊపిరితిత్తులకు, ఎముకలకు పాకి ఉండవచ్చు. కాబట్టి చెస్ట్ ఎక్స్‌రే, బోన్‌స్కాన్ కూడా చేయిస్తూ ఉంటారు. కిడ్నీ మొత్తంగా తీసివేసే సర్జరీతో పాటు క్యాన్సర్ రకాన్ని బట్టి కీమో, రేడియోథెరపీలను ఇవ్వాలి. ఈరోజుల్లో కిడ్నీలను లాపరోస్కోపిక్ పద్ధతుల్లో కూడా తొలగించడం సాధ్యమే. క్యాన్సర్ కాని కణుతులకు కూడా సైజుని బట్టి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణుతులు ఎక్కువగా ఉన్నా, లేదా చాలా పెద్దగా ఉన్న సందర్భాల్లోనూ కిడ్నీలను తొలగించడం జరుగుతుంది. ట్యూమర్ స్టేజ్ మీద ఆధారపడి, సర్జరీని మూడురకాలుగా చేస్తుంటారు.
రాడికల్ నెఫ్రెక్టమీ : ఈ సర్జరీలో కిడ్నీతో పాటు అడ్రినల్ గ్లాండ్స్, లింఫ్ నాళాలను, కణజాలాన్ని మొత్తంగా తీసివేస్తారు. కణితి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సర్జరీ చేస్తారు.
సింపుల్ నెఫ్రెక్టమీ: స్టేజ్1 కిడ్నీ క్యాన్సర్‌కు ఒక్క కిడ్నీని మాత్రమే తీసివేస్తారు.
పార్షియల్ నెఫ్రెక్టమీ: పుట్టుకతో ఒకే ఒక్క కిడ్నీ ఉండి, దానిలో కణితి కనిపించినప్పుడు, కణితి ఉన్నంతవరకు మాత్రమే తీసివేస్తారు. ఒక్కొక్కసారి రెండు కిడ్నీల్లోనూ కణుతులు ఏర్పడినప్పుడు కణుతుల వరకు మాత్రమే తొలగిస్తారు.
తొలిదశలోనే గుర్తించి, ఒక కిడ్నీని మాత్రమే తీసివేసినప్పుడు సర్జరీ అయిన కొద్దిరోజుల్లోనే వారు సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు. రెండింటినీ తీసివేసినా, లేదా ఒక్కటి తీసేశాక రెండోది పనిచేయకపోయినా డయాలసిస్ చేయించుకుంటూ వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడం మంచిది.
చికిత్స పూర్తయ్యాక కూడా ఫాలోఅప్ కేర్ తప్పనిసరి. సీటీ స్కాన్, చెస్ట్ ఎక్స్‌రే వంటి టెస్ట్‌లు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. మూత్రంలో రక్తం కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా ఉండటంతోపాటు, స్మోకింగ్, ఆల్కహాల్ విషతుల్యమైన పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల మూత్రపిండాలను కొంతవరకైనా కాపాడుకోగలిగిన వారమవుతాము.
Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421