ప్రపంచ రికార్డుతో మొదలు...
♦ ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్లో కిమ్ వూజిన్ వరల్డ్ రికార్డు
♦ ఐదో ర్యాంక్‌లో అతాను దాస్
రియో డి జనీరో : విశ్వ క్రీడా సంరంభం రియో ఒలింపిక్స్ అధికారిక ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు ఆర్చరీలో అద్భుతం జరిగింది. పురుషుల రికర్వ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ కిమ్ వూజిన్ (దక్షిణ కొరియా) ప్రపంచ, ఒలింపిక్ రికార్డు నెలకొల్పాడు. ‘డ్రా’ను ఖరారు చేసేందుకు నిర్వహించే ర్యాంకింగ్ రౌండ్లో ఒక్కో ఆర్చర్‌కు 72 బాణాలు సంధించే అవకాశం ఇస్తారు. అందుబాటులో ఉన్న 720 పాయింట్లకు కిమ్ వూజిన్ 700 పాయింట్లు స్కోరు సాధించి కొత్త ప్రపంచ, ఒలింపిక్ రికార్డును సృష్టించాడు.
కిమ్ వూజిన్ కచ్చితమైన గురికి... 2012 లండన్ ఒలింపిక్స్‌లో 699 పాయింట్లతో ఇమ్ డాంగ్ హున్ (కొరియా) నెలకొల్పిన ప్రపంచ రికార్డు బద్దలైంది. భారత్‌కు చెందిన అతాను దాస్ ర్యాంకింగ్ రౌండ్లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అతాను దాస్ మొత్తం 683 పాయింట్లు స్కోరు చేసి ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. తొలి రౌండ్లో జీత్‌బహదూర్ ముక్తాన్ (నేపాల్)తో అతాను దాస్ తలపడతాడు. ‘డ్రా’ ప్రకారమైతే ఈ బెంగాల్ ఆర్చర్‌కు క్వార్టర్ ఫైనల్ వరకు కఠిన ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశం లేదు.