kisan yatra
-
తగ్గేదేలే అంటున్న సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ‘కిసాన్ యాత్ర’!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారత్ రాష్ట్ర సమితిని విస్తరించేందుకు, పార్టీ ఎజెండాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల్లో ‘కిసాన్ సంఘర్‡్ష యాత్ర’లు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యోచిస్తున్నట్టు తెలిసింది. ‘అబ్కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో ముందుకెళ్లాలన్న నిర్ణయానికి అనుగుణంగా వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారని.. కిసాన్ యాత్రలతో రైతులను సంఘటితం చేయాలని భావిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలోని విదర్భ నుంచి ఈ యాత్రలు మొదలుపెట్టాలనే ప్రతిపాదన వచ్చిందని.. తర్వాత ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఇతర రాష్ట్రాల్లో విడతల వారీగా నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారని వెల్లడించాయి. రైతు సంఘాల నేతలతో మంతనాలు ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ శుక్రవారం వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన రైతు సంఘం నేతలు విజయ్ జావండియా, గుణ్వంత్ పాటిల్, రాజీవ్‌శెట్టి, ఒడిశా రైతు నేత అక్షయ్‌కుమార్, ఉత్తరప్రదేశ్ రైతు నేత హిమాన్షు తదితరులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టదలచిన కిసాన్ యాత్రల స్వరూపంపై వారితో చర్చించినట్టు తెలిసింది. రైతుల పంటలకు మద్దతుధరతోపాటు వారికి తగిన గౌరవం, పింఛన్లు (ప్రైస్, ప్రెస్టేజ్, పెన్షన్) అంశాలకు ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని భేటీల్లో అభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం దేశంలో కార్పోరేట్ వ్యవస్థ అధికార వ్యవస్థను శాసిస్తోందని, ఈ కారణంగానే వ్యవసాయం, రైతు సంక్షేమం సంక్షోభంలో పడ్డాయని.. దీన్ని అడ్డుకుని కార్పోరేట్లు, మార్కెట్లను నియంత్రణలో పెట్టేందుకు రైతు ఉద్యమాలే కీలకమని రైతు నేతలు అభిప్రాయపడినట్టు తెలిసింది. దేశంలో 80శాతానికి పైగా వ్యవసాయంపైనే బతుకుతున్నారని.. కేంద్ర బడ్జెట్లో ఈ రంగానికి కేటాయింపులు 15–20 శాతం దాటడం లేదని, దీన్ని యాభై శాతానికి పెంచేలా పోరాటం చేయాలని కొందరు రైతు నేతలు సూచించారని సమాచారం. ఈ క్రమంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు చేయూతనివ్వడం ద్వారానే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, దేశ ఆర్ధిక ప్రగతి సాధ్యమవుతుందని.. ఆ దిశగా బీఆర్ఎస్ పనిచేస్తుందని కేసీఆర్ భరోసా కల్పించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రైతులను సంఘటితం చేసేందుకు దశలవారీగా కిసాన్ సంఘర్‡్ష యాత్రలను చేపట్టాలని ప్రతిపాదన వచ్చిందని.. దీనికి మహారాష్ట్ర రైతు నేతలు అంగీకరించారని పేర్కొన్నాయి. ఎప్పటినుంచి యాత్రలు మొదలుపెట్టాలి, ఎక్కడెక్కడ చేపట్టాలి, ఎవరెవరిని కలుపుకొనిపోవాలన్న దానిపై త్వరలో మరోసారి నిర్వహించే భేటీలో నిర్ణయం తీసుకుందామని తీర్మానానికి వచ్చినట్టు వివరించాయి. జాతీయ కార్యాలయానికి వెళ్లి.. మూడు రోజుల క్రితం ప్రారంభించిన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయానికి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం మరోసారి వెళ్లారు. ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్రావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్ నేత, రాములు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్లమెంట్ సాగుతున్న తీరుపై ఎంపీలతో మాట్లాడారు. తర్వాత పలు రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలతో చర్చించారు. తనను కలిసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులను పలకరించి, వారితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా వారు జై భారత్, జై కేíసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు. -
రూ. లక్ష కోట్లతో వ్యవసాయ నిధి!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద దేశంలోని సుమారు 8.5 కోట్ల మంది రైతులకు రూ.17 వేల కోట్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కిసాన్ నిధులతోపాటు రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని కూడా ప్రారంభించనున్నట్లు శనివారం ఓ అధికారిక ప్రకటన తెలిపింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖల మంత్రి నరేంద్ర తోమర్‌తోపాటు లక్షలాది మంది రైతుల ఆన్లైన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుందని పేర్కొంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పంట దిగుబడులను కాపాడుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. సామాజిక స్థాయిలో శీతలీకరణ గిడ్డంగులు, ఆహార శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారని ఆ ప్రకటనలో వివరించారు. ఈ సదుపాయాల ఏర్పాటుతో రైతుల ఉత్పత్తులకు మెరుగైన విలువ లభిస్తుందని, వృథా తగ్గుతుందని అంచనా. ఈ రూ.లక్ష కోట్ల నిధిని రైతులకు చేర్చేందుకు ఇప్పటికే దేశంలోని 11 ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పథకంలో భాగంగా అందించే రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకూ క్రెడిట్ గ్యారంటీ లభించనుంది. 2018 డిసెంబర్ ఒకటవ తేదీన ప్రారంభమైన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు నేరుగా నగదు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఇప్పటివరకూ 9.9 కోట్ల మంది రైతులకు సుమారు రూ.75 వేల కోట్లు పంపిణీ చేశామని పేర్కొంది. కోవిడ్–19 కష్ట కాలంలోనూ రైతులను ఆదుకునేందుకు రూ.22 వేల కోట్లు విడుదల చేశామని తెలిపింది. -
ముగిసిన కిసాన్ యాత్ర
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్ నుంచి దేశరాజధాని ఢిల్లీ వరకూ తమ సమస్యల పరిష్కారానికి రైతులు చేపట్టిన ‘కిసాన్ క్రాంతి యాత్ర’ బుధవారం ముగిసింది. ఈ యాత్రను యూపీ–ఢిల్లీ సరిహద్దులో పోలీసులు మంగళవారం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు బారికేడ్లను ధ్వంసం చేసి ట్రాక్టర్లతో ముందుకు వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు వాటర్ కేనన్లు, భాష్పవాయువును ప్రయోగించారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున 12.30 గంటలకు రైతులను ఢిల్లీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో దాదాపు 70 వేల మంది రైతన్నలు తమ ట్రాక్టర్లతో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ స్మృతివనమైన ‘కిసాన్ ఘాట్’కు చేరుకున్నారు. అక్కడ చరణ్ సింగ్‌కు నివాళులు అర్పించిన అనంతరం తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. -
రోడ్ షోలో ఉత్సాహంగా రాహుల్ గాంధీ
లక్నో: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిసాన్ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. డియోరియా టూ ఢిల్లీ కిసాన్ యాత్రలో భాగంగా గురువారం లక్నో ప్రాంతంలో పర్యటించిన ఆయన అభిమానులు అందించిన పాన్‌ను ఆస్వాదించారు. ఉన్నావ్‌లో నిర్వహించిన రాహుల్ రోడ్ షోలో స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు యువకులు రాహుల్ భయ్యా జిందాబాద్ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో అటువైపుగా చూసిన రాహుల్‌కు.. ఆ యువకులు స్పెషల్ 'మీఠా పాన్'ను ఆఫర్ చేశారు. అభిమానులు ఇచ్చిన పాన్‌ను రాహుల్ సంతోషంగా స్వీకరించారు. రోడ్ షోలో పాల్గొంటున్న రాహుల్ ప్రజలతో బాగా మమేకం అవుతున్నారని స్థానిక నాయకులు కితాబిస్తున్నారు. యాత్ర సందర్భంగా రాహుల్ సెల్ఫీలకు సైతం అవకాశం కల్పిస్తూ కార్యకర్తలు, పార్టీ అభిమానులను సంతోషపరుస్తున్నారు. -
కిసాన్ యాత్ర ప్రారంభించిన రాహుల్
డియోరియా: కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ రాజ్ బబ్బర్ తదితరులు విస్తృతంగా ప్రచారం చేస్తుండగా ఇప్పుడు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచార నిమిత్తం ఆయన మంగళవారం డియోరియా నియోజకవర్గం చేరుకున్నారు. పాంచ్‌లారి క్రిత్‌ఫురి గ్రామం నుంచి రాహల్ కిసాన్ యాత్రను ప్రారంభించారు. కిసాన్ యాత్ర పేరుతో సుమారు 2500 కిలోమీటర్ల మేర యాత్ర జరగనుంది. యాత్రా మార్గంలో పేదలు, రైతులు, కార్మికులను కలుసుకొని వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఈ కార్యక్రమంలో రాహుల్ ఇంటి ఇంటి ప్రచారంలో పాల్గొంటారు. ఖాట్ (మంచం) సభల్లోనూ రాహుల్ పాల్గోనున్నారు. రైతులతో వాళ్ల వాళ్ల గ్రామాల్లోనే మంచాలపై కూర్చుని ముచ్చటించనున్నారు. ఇందుకోసం 2వేల ఖాట్ లను సిద్ధం చేశారు. రాహుల్ తన పర్యటనలో భాగంగా 223 నియోజకవర్గాల్లో పర్యటన చేయనున్నారు. ఈ కిసాన్ యాత్ర డియోరియా నుంచి ఢిల్లీ వరకు సాగుతుంది. కాగా దాదాపు 27 ఏళ్లుగా యూపీలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. Kisan Maang Patras being signed in Rudrapur pic.twitter.com/8A12r7k1ZI — Office of RG (@OfficeOfRG) 6 September 2016 Door to door campaign begins from vill Pachladi. Met farmers, &collected Kisan Maang Patras outlining their demands pic.twitter.com/sdNoZOB11R — Office of RG (@OfficeOfRG) 6 September 2016