సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారత్ రాష్ట్ర సమితిని విస్తరించేందుకు, పార్టీ ఎజెండాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల్లో ‘కిసాన్ సంఘర్‡్ష యాత్ర’లు నిర్వహించాలని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యోచిస్తున్నట్టు తెలిసింది. ‘అబ్‌కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో ముందుకెళ్లాలన్న నిర్ణయానికి అనుగుణంగా వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారని.. కిసాన్ యాత్రలతో రైతులను సంఘటితం చేయాలని భావిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలోని విదర్భ నుంచి ఈ యాత్రలు మొదలుపెట్టాలనే ప్రతిపాదన వచ్చిందని.. తర్వాత ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఇతర రాష్ట్రాల్లో విడతల వారీగా నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారని వెల్లడించాయి.
రైతు సంఘాల నేతలతో మంతనాలు
ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ శుక్రవారం వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన రైతు సంఘం నేతలు విజయ్ జావండియా, గుణ్వంత్ పాటిల్, రాజీవ్‌శెట్టి, ఒడిశా రైతు నేత అక్షయ్‌కుమార్, ఉత్తరప్రదేశ్ రైతు నేత హిమాన్షు తదితరులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టదలచిన కిసాన్ యాత్రల స్వరూపంపై వారితో చర్చించినట్టు తెలిసింది. రైతుల పంటలకు మద్దతుధరతోపాటు వారికి తగిన గౌరవం, పింఛన్లు (ప్రైస్, ప్రెస్టేజ్, పెన్షన్) అంశాలకు ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని భేటీల్లో అభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం దేశంలో కార్పోరేట్ వ్యవస్థ అధికార వ్యవస్థను శాసిస్తోందని, ఈ కారణంగానే వ్యవసాయం, రైతు సంక్షేమం సంక్షోభంలో పడ్డాయని.. దీన్ని అడ్డుకుని కార్పోరేట్లు, మార్కెట్లను నియంత్రణలో పెట్టేందుకు రైతు ఉద్యమాలే కీలకమని రైతు నేతలు అభిప్రాయపడినట్టు తెలిసింది.
దేశంలో 80శాతానికి పైగా వ్యవసాయంపైనే బతుకుతున్నారని.. కేంద్ర బడ్జెట్‌లో ఈ రంగానికి కేటాయింపులు 15–20 శాతం దాటడం లేదని, దీన్ని యాభై శాతానికి పెంచేలా పోరాటం చేయాలని కొందరు రైతు నేతలు సూచించారని సమాచారం. ఈ క్రమంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు చేయూతనివ్వడం ద్వారానే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, దేశ ఆర్ధిక ప్రగతి సాధ్యమవుతుందని.. ఆ దిశగా బీఆర్‌ఎస్ పనిచేస్తుందని కేసీఆర్ భరోసా కల్పించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రైతులను సంఘటితం చేసేందుకు దశలవారీగా కిసాన్ సంఘర్‡్ష యాత్రలను చేపట్టాలని ప్రతిపాదన వచ్చిందని.. దీనికి మహారాష్ట్ర రైతు నేతలు అంగీకరించారని పేర్కొన్నాయి. ఎప్పటినుంచి యాత్రలు మొదలుపెట్టాలి, ఎక్కడెక్కడ చేపట్టాలి, ఎవరెవరిని కలుపుకొనిపోవాలన్న దానిపై త్వరలో మరోసారి నిర్వహించే భేటీలో నిర్ణయం తీసుకుందామని తీర్మానానికి వచ్చినట్టు వివరించాయి.
జాతీయ కార్యాలయానికి వెళ్లి..
మూడు రోజుల క్రితం ప్రారంభించిన బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయానికి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం మరోసారి వెళ్లారు. ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్ నేత, రాములు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్లమెంట్ సాగుతున్న తీరుపై ఎంపీలతో మాట్లాడారు. తర్వాత పలు రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలతో చర్చించారు. తనను కలిసేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులను పలకరించి, వారితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా వారు జై భారత్, జై కేíసీఆర్, జై బీఆర్‌ఎస్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు.
Comments
Please login to add a commentAdd a comment