దండకారణ్యంలో బలగాల మోహరింపు
దుమ్ముగూడెం, న్యూస్‌లైన్ : ఆంధ్రకు సరిహద్దున ఉన్న చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోని కిష్టారం-గొల్లపల్లి అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలను భారీగా మోహరించారు. సుమారు 300 మంది జవాన్లు రెండు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గొల్లపల్లి- కిష్టారం పోలీస్స్టేషన్ల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టు మిలీషియా సభ్యులపై పోలీసు బలగాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో మిలీషియా సభ్యులు తప్పించుకోగా, వారికి సంబంధించిన చెక్క తుపాకీ దొరికినట్లు సమాచారం.
కాగా, దండకారణ్యంలోని సాకిలేరు, యాంపురం అటవీ ప్రాంతాలలో మూడు రోజుల క్రితం మావోయిస్టులు సమావేశం నిర్వహించారని, త్వరలో జరగనున్న పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహంపై చర్చించారని సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇది పసిగట్టిన పోలీసులు సోమవారం తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్‌లోని మారాయిగూడెం మీదుగా సీఆర్పీఎఫ్ బలగాలను దండకారణ్యంలోకి తరలించారు. వారు రెండు రోజులుగా కూంబింగ్ చేస్తూ దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. అయితే పోలీసులు దండకారణ్యంలోకి వెళ్లడంతో కొందరు మావోయిస్టులు సరిహద్దున ఉన్న దుమ్ముగూడెం మండలం జిన్నెలగూడెం అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం సంచరించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమైనట్లు తెలిసింది.