kismathpura
-
పూర్ కోసం ప్యూర్...
ఆమె వయసు ఏడు పదులు.. మనసుకు మాత్రం రెండు పదులే.. అందుకే కాబోలు ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా.. నేనున్నానంటూ చకచక పరుగులు తీస్తారు.. ప్యూర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. ప్రపంచవ్యాప్తంగా ఐదు దేశాలలో 350 మంది కార్యకర్తలతో వేలాదిమందికి సేవలు అందిస్తున్నారు. నిరాడంబర జీవితం.. నిరంతర సేవానిరతి... అన్నీ కలిపితే... హైదరాబాద్ కిస్మత్పూర్లో పచ్చని చెట్ల మధ్య ఫలవృక్షంలా జీవిస్తున్న సంధ్య గోళ్లమూడి.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పుట్టిన సంధ్య తమ ఇంట్లో తాతముత్తాతల నుంచి దేశసేవ చేయటం చూస్తూ పెరిగారు. దాంతో తాను కూడా బడుగు, బలహీన వర్గాల వారికోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనకు బీజం పడింది. భర్త బ్యాంకు ఉద్యోగి డాక్టర్ శాంతారామ్... రైతుల కోసం ఏర్పాటు చేసిన ఫార్మర్స్ సొసైటీలకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. ఉద్యోగరీత్యా అనేక పల్లెసీమలకు తిరిగేవారు. ఈ క్రమంలో తనకు తారసపడిన నిరుపేదలకు అండగా నిలబడాలనుకున్నారామె. అందుకోసం బుట్టలు అల్లటం,పెట్టీకోట్స్ కుట్టడం, ఎంబ్రాయిడరీ... వంటి పనులు నేర్చుకున్నారు. పేద స్త్రీలకు వీటన్నింటినీ ఉచితంగా నేర్పించారు. పేదలకు అండగా.. నెల్లూరు వచ్చాక, ట్యూషన్లు చెబుతూ డబ్బు సంపాదించి, సంఘసేవ కోసం ఖర్చుచేశారు. తన సేవాకార్యక్రమాలకోసం భర్త మీద ఆధారపడదలచుకోలేదు. తన సంపాదన నుంచే ఖర్చు పెట్టేవారు. అందుకోసం టీచింగ్ దగ్గర నుంచి చిరు వ్యాపారాల వరకు ఎన్నో పనులు చేసేవారు. ఖమ్మంలో ఒక స్కూల్లో పుస్తకాలు లేక తండా పిల్లలు చదువు మానేసి మిరప చేలలో కూలికి వెళ్తున్న సంగతి తెలుసుకున్న సంధ్య తమ కుమార్తె శైలజ సహకారంతో సుమారు యాభైవేల రూపాయలు సేకరించి ఆ మొత్తాన్ని ఆ పిల్లలకు అందించి, వారి చదువు సజావుగా సాగేలా చూశారు. ‘‘అదే సమయంలో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, దాని ద్వారా అవసరంలో ఉన్నవారికి సహాయ పడాలనుకున్నాను. మా అమ్మాయి, తన స్నేహితులు అందరూ లక్ష రూపాయల చొప్పున డిపాజిట్ చేశారు. సంస్థకు pure (people for rural and urban education) అని పేరు పెట్టి, 2016 మార్చిలో రిజిస్టర్ చేశాం. నేను చలాకీగా ఉండటంతో డైరెక్టర్‌గా కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 69 సంవత్సరాలు’’ అంటారు సంధ్య గోళ్లమూడి. విపత్తు సమయంలో అండగా... కేరళలో వరదలు వచ్చిన సమయంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, సహాయ కార్యక్రమాలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద పిల్లలకు కావలసిన ఆర్వో వాటర్, బెంచీలు, లైబ్రరీ, కిచెన్ డెవలప్మెంట్, నోట్‌బుక్స్, టాయిలెట్స్, ఆడపిల్లలకు ప్యాడ్స్.. ఇలా ఇబ్బంది లేకుండా చదువుకోవటానికి అవసరమైన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. 2017 – 2018 మధ్య ప్రాంతంలో 1,75,000 కి.మీ. డ్రైవర్ ని పెట్టుకుని ఒంటరిగా వివిధ పాఠశాలలకు ప్రయాణించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏడువేల స్లమ్స్‌లో ప్రతి బుధవారం ఒక్కో స్లమ్‌లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యులకు మోదుగ ఆకుల విస్తర్లు కుట్టడానికి అనువుగా రెండు మెషీన్లు అందించారు. వారే మా వలంటీర్లు.. ‘‘సమాజసేవ చేయాలనుకునే టీచర్లే మాకు ప్రతినిధులు. ఆయా ప్రాంతాల ఎన్జీఓ ల సహాయంతో ఈ పనులు చేయగలుగుతున్నాం. కడపలో కోవిడ్ కారణంగా మరణించిన వారి కోసం వ్యాన్, ఐస్ బాక్స్ అందచేశాం’’ అని చెబుతారు సంధ్య గోళ్లమూడి. అమ్మమ్మ... అభ్యాస పాఠశాలలు.. అటవీ ప్రాంతాలలో కొండ మీద నివసించేవారి కోసం అభ్యాస విద్యాలయాలు ఏర్పాటు చేశారు. ‘‘అందరూ నన్ను ‘మా అమ్మమ్మ’ అని ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకుంటారు’’ అంటున్న సంధ్య గోళ్లమూడి, వివిధ సమస్యల మీద ఛందోబద్ధంగా 3000 కవితలు రాశారు. 65 సంవత్సరాల వయసులో కూచిపూడి నాట్యం చేసి, ఫేస్బుక్లో పెట్టారు. ఋతువులను అనుసరించి ఇల్లు సర్దుకుంటారు. ‘‘ప్రతిదీ ప్రభుత్వమే చేయాలంటే కుదరకపోవచ్చు. అందరం ప్రభుత్వంలో భాగస్వాములమే కనుక దేశపౌరులుగా ఇది మనందరి బాధ్యత’’ అంటారు ఎంతో హుందాగా. –వైజయంతి పురాణపండ లాక్డౌన్ విధించటానికి ముందే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కావలసిన నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌ని సప్లయి చేశాం. సమతుల ఆహారాన్ని అందించాం. వివిధ ప్రాంతాలకు చెందినవారు వారి ఇళ్లకు చేరుకోవటం కోసం రెండు బస్సులు ఏర్పాటు చేశాం. రెండు కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. మేం నడిపిన కోవిడ్ సెంటర్లలో అందరూ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క మరణం కూడా లేదు. – సంధ్య గోళ్లమూడి సంధ్య గోళ్లమూడి -
నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి
రాజేంద్రనగర్: నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రస్తుతం నియామకాలపై సర్కారు దృష్టిసారించిందని తెలిపారు. కిస్మత్‌పూర్‌లోని ఎక్సైజ్ అకాడమీలో 284 మంది ఎక్సైజ్ ఎస్సైలకు సోమవారం ఆయన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన అధికారులు అంకితభావంతో శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. గుడుంబా రహిత రాష్ట్రంగా చేయడంతో పాటు గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నీరాను అందుబాటులోకి తేనుందని చెప్పారు. ఈత, తాటిచెట్లను పెంచే వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. మరో 20 ఏళ్లు కేసీఆర్ నాయకుడని, ఆ తర్వాత కేటీఆర్ తమ నాయకుడని శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని, వచ్చిన వారు ప్రజలకు మంచి జరిగేలా చూడాలన్నారు. అనంతరం ఎక్సైజ్ ఉద్యోగుల డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సొంతింటికి దగ్గరిదారి!
పదేళ్ల క్రితం వరకూ షేరు ఆటోలు కూడా సరిగా తిరగని ఆ ప్రాంతంలో.. నేడు లగ్జరీ కార్లు చక్కర్లు కొడుతున్నాయి! గతంలో గజం స్థలం రూ.2 వేలు కూడా పలకని ఆ ప్రాంతంలో.. నేడు రూ.10 వేలు పెట్టినా దొరకని పరిస్థితి!! ఒకప్పుడు విద్యా, వైద్యం, వినోదం.. అన్నింటికీ సిటీలోకి వచ్చే అక్కడి ప్రజలు.. ఇప్పుడు అన్నింటినీ ఒకే చోట పొందేస్తున్నారు!!! .. ఇదివరకది గ్రామం.. కానీ, నేడది గ్రామంలోనే రూపుదిద్దుకున్న మహా నగరం! అభివృద్ధికి, అందుబాటు ధరలకీ కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతమే కిస్మత్పూర్. పేరులోనే కాదు.. ఊరులోనూ అదృష్టాన్ని దాచుకుందీ ప్రాంతం. ► అభివృద్ధికి.. అందుబాటు ధరలకూ కిస్మత్పూర్ సరైన ప్రాంతం ► లగ్జరీ ఫ్లాట్లు.. విల్లా ప్రాజెక్ట్‌లకు కేరాఫ్ అడ్రస్ ► ఐటీ హబ్, ఎయిర్‌పోర్ట్‌లకు దగ్గర్లో ఉండటం కలిసొచ్చే అంశం ► స్థిరాస్తి కొనుగోలుకు ఇదే సరైన ప్రాంతమంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధిలో అప్పా జంక్షన్, బండ్లగూడ, హైదర్షాకోట, కిస్మత్పూర్, బుద్వేల్, అత్తాపూర్, పీరంచెరువు, మంచిరేవుల ప్రాంతాలు ప్రధానమైనవి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ప్రాంతం కిస్మత్పూర్. ఎందుకంటే ఈ ప్రాంతం సెక్రటేరియట్, లక్డికపూల్ వంటి సిటీ సెంటర్ ప్రాంతాలకు 15 కి.మీ. దూరంలో, ఐటీ హబ్, శంషాబాద్ విమానాశ్రయానికి 20 కి.మీ.ల దూరంలో ఉండటం. నేటికీ సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండటమేనని గిరిధారి కన్స్ట్రక్షన్స్ సీఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతం అటు మెట్రో రైలుకు, ఇటు ఔటర్ రింగ్ రోడ్డులకూ సులువుగా చేరుకునేంత దూరంలో ఉంది. షాద్‌నగర్, కొత్తూరులోని పలు మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులూ కిస్మత్పూర్లోనే ఉంటున్నారు. ఎందుకంటే మెట్రో రైలుతో సిటీలో ప్రయాణించే వీలు.. కూతవేటు దూరంలో ఉన్న ఓఆర్ఆర్ మీదుగా ఆదిభట్ల, మహేశ్వరంలోని ఐటీ, హార్డ్‌వేర్ పార్క్, ఏరో స్పేస్ కంపెనీలకే కాదు.. 40 కి.మీ. దూరంలో పీఅండ్‌జీ, జాన్సన్ వంటి మల్టీనేషనల్ కంపెనీలకు, ఫార్మా సిటీ, లాజిస్టిక్ పార్కులకూ సులువుగా చేరుకునే వీలుంది. రూ.30 లక్షల నుంచి ప్రారంభం.. కిస్మత్పూర్లో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటుగా విదేశీ సంస్థల ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రెస్టిజ్, జైన్, మంత్రి, పీబీఈఎల్, వసతి ఆనంది, శాంతాశ్రీరాం, ఆర్వీ నిర్మాణ్, కీర్తి, గిరిధారి, ఎస్ఎంఆర్ వంటి సంస్థలు నిర్మాణాలు చేపడుతున్నాయి. ఈ ప్రాంతంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి 10 శాతం నిర్మాణాలుండగా.. 9 నెలల్లో పూర్తయ్యేవి 40 శాతం వరకున్నాయి. ధర విషయానికొస్తే చ.అ. ధర రూ.3-4 వేల వరకున్నాయి. రూ. 30-60 లక్షల మధ్య 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు దొరుకుతున్నాయి. 300-400 గజాల స్థలాల్లో ఉండే విల్లాలు రూ. 2-3 కోట్ల మధ్య చెబుతున్నారు. ఐటీ, ఎన్నారైల దృష్టి ఇక్కడే.. రూ. 25-40 వేల మధ్య వేతనాలుండే ప్రతి ఉద్యోగికి ఇది అనువైన ప్రాంతం. ఐటీ ఉద్యోగులకైతే మరీను. అందరు ఐటీ ఉద్యోగులూ గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకోలేరు. అందుబాటు ధరల్లో.. తక్కువ దూరంలో ఉండే ప్రాంతం కిస్మత్పూర్ కావటంతో ఈ వైపు దృష్టి పెడుతున్నారు. కొత్తగా ప్రారంభమైన రేతిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా రాయదుర్గం జంక్షన్ నుంచి ఐటీ హబ్‌కు త్వరగా చేరుకోవచ్చు. 20 నిమిషాల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే వీలుండటంతో ఎన్నారైలు, విదేశీయులూ ఈ ప్రాంతంపై మక్కువ చూపుతున్నారు. విద్యా, వైద్యం, వినోదాలు కూడా.. వాస్తు ప్రకారం ఏ నది అయితే దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి ప్రవహిస్తుందో అక్కడ అభివృద్ధి, ఆయురారోగ్యాలూ ఉంటాయని పండితుల మాట. కిస్మత్‌పూర్‌లోని ఈసా నది అలా ప్రవహిస్తున్నదే మరి. ఇన్నర్, ఔటర్లను అనుసంధానం చేసేందుకు ఈసా నదిపై బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు కూడా. మరో విషయమేంటంటే.. కిస్మత్పూర్, బండ్లగూడ గ్రామాలను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ దత్తత తీసుకున్నారు. దీంతో ఇక్కడి రహదారులకు, మౌలిక వసతులకు మహర్దశ పట్టుకుంది. ఈ ప్రాంతంలోకి ఐటీ పార్క్‌ను తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం. రాజేంద్రనగర్‌లో ఎన్ఐఆర్డీ, ఎన్జీరంగా వర్సిటీలతో పాటుగా. అప్పా జంక్షన్లో సుమారు 70కి పైగా విద్యా సంస్థలు, ప్రముఖ ఆసుపత్రులెన్నో ఉన్నాయి. అప్పా జంక్షన్ చుట్టూ మిలటరీ ఏరియా ఉండటంతో శాంతి భద్రతల సమస్య లేదు. ఈ ప్రాంతం హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాలకు అతి దగ్గర్లో ఉండటంతో జల వనరులకూ కొదవేలేదు. హిమాయత్‌సాగర్‌కు ఆనుకొని ఎకో పార్క్, సైన్స్ పార్క్, కిద్వాయి గార్డెన్లతో నిత్యం కిటకిటలాడుతుంది. ఓవైపు నిజాం నిర్మించిన హిమాయత్‌సాగర్, ఇంకోవైపు గోల్కొండ, కుతుబ్‌షాహీ టూం బ్స్.. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిటీకి కలుపుతున్న ఓఆర్ఆర్.. ఇలా అభివృద్ధికి, చరిత్రాత్మక కట్టడాలకు నెలవాలంగా నిలుస్తోంది కిస్మత్పూర్. 600 ఫ్లాట్లు.. 120 విల్లాలు.. కిస్మత్పూర్ అభివృద్ధి, ఇక్కడి గిరాకీని దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్తులో ఇక్కడి స్థిరాస్తి ధరలు రెండితలు పెరిగే అవకాశముంది. అందుకే సామాన్య, మధ్య తరగతి ప్రజలకే కాదు కాస్త ముందు చూపున్న ఉద్యోగులు, వ్యాపారులు, ఎన్నారైలూ కిస్మత్పూర్లో స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు ప్రాజెక్ట్‌లతో పాటుగా మరో రెండు ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని గిరిధారి సంస్థ సీఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. 4 ఎకరాల్లో విల్లా ఓనిక్స్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో 43 విల్లాలు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల విల్లా ఓనిక్స్ క్లబ్ హౌజ్‌ను ప్రారంభించాం. ఎకరం విస్తీర్ణంలో ఈస్టా ప్రాజెక్ట్‌నూ నిర్మిస్తున్నాం. ఇందులో 90 ఫ్లాట్లొచ్చాయి. త్వరలో ఈ ప్రాంతంలో 6 ఎకరాల్లో మూడు ప్రాజెక్ట్‌లు కలిపి మొత్తం 600 ఫ్లాట్లు, 12 ఎకరాల్లో దాదాపు 120 విల్లా ప్రాజెక్ట్‌నూ నిర్మించనున్నాం.