ఆమె వయసు ఏడు పదులు.. మనసుకు మాత్రం రెండు పదులే.. అందుకే కాబోలు ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా.. నేనున్నానంటూ చకచక పరుగులు తీస్తారు.. ప్యూర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. ప్రపంచవ్యాప్తంగా ఐదు దేశాలలో 350 మంది కార్యకర్తలతో వేలాదిమందికి సేవలు అందిస్తున్నారు. నిరాడంబర జీవితం.. నిరంతర సేవానిరతి... అన్నీ కలిపితే... హైదరాబాద్ కిస్మత్‌పూర్‌లో పచ్చని చెట్ల మధ్య ఫలవృక్షంలా జీవిస్తున్న సంధ్య గోళ్లమూడి..
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పుట్టిన సంధ్య తమ ఇంట్లో తాతముత్తాతల నుంచి దేశసేవ చేయటం చూస్తూ పెరిగారు. దాంతో తాను కూడా బడుగు, బలహీన వర్గాల వారికోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనకు బీజం పడింది. భర్త బ్యాంకు ఉద్యోగి డాక్టర్ శాంతారామ్... రైతుల కోసం ఏర్పాటు చేసిన ఫార్మర్స్ సొసైటీలకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. ఉద్యోగరీత్యా అనేక పల్లెసీమలకు తిరిగేవారు. ఈ క్రమంలో తనకు తారసపడిన నిరుపేదలకు అండగా నిలబడాలనుకున్నారామె. అందుకోసం బుట్టలు అల్లటం,పెట్టీకోట్స్ కుట్టడం, ఎంబ్రాయిడరీ... వంటి పనులు నేర్చుకున్నారు. పేద స్త్రీలకు వీటన్నింటినీ ఉచితంగా నేర్పించారు.
పేదలకు అండగా..
నెల్లూరు వచ్చాక, ట్యూషన్లు చెబుతూ డబ్బు సంపాదించి, సంఘసేవ కోసం ఖర్చుచేశారు. తన సేవాకార్యక్రమాలకోసం భర్త మీద ఆధారపడదలచుకోలేదు. తన సంపాదన నుంచే ఖర్చు పెట్టేవారు. అందుకోసం టీచింగ్ దగ్గర నుంచి చిరు వ్యాపారాల వరకు ఎన్నో పనులు చేసేవారు. ఖమ్మంలో ఒక స్కూల్‌లో పుస్తకాలు లేక తండా పిల్లలు చదువు మానేసి మిరప చేలలో కూలికి వెళ్తున్న సంగతి తెలుసుకున్న సంధ్య తమ కుమార్తె శైలజ సహకారంతో సుమారు యాభైవేల రూపాయలు సేకరించి ఆ మొత్తాన్ని ఆ పిల్లలకు అందించి, వారి చదువు సజావుగా సాగేలా చూశారు. ‘‘అదే సమయంలో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, దాని ద్వారా అవసరంలో ఉన్నవారికి సహాయ పడాలనుకున్నాను. మా అమ్మాయి, తన స్నేహితులు అందరూ లక్ష రూపాయల చొప్పున డిపాజిట్ చేశారు. సంస్థకు pure (people for rural and urban education) అని పేరు పెట్టి, 2016 మార్చిలో రిజిస్టర్ చేశాం. నేను చలాకీగా ఉండటంతో డైరెక్టర్‌గా కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 69 సంవత్సరాలు’’ అంటారు సంధ్య గోళ్లమూడి.
విపత్తు సమయంలో అండగా...
కేరళలో వరదలు వచ్చిన సమయంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, సహాయ కార్యక్రమాలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద పిల్లలకు కావలసిన ఆర్వో వాటర్, బెంచీలు, లైబ్రరీ, కిచెన్ డెవలప్‌మెంట్, నోట్‌బుక్స్, టాయిలెట్స్, ఆడపిల్లలకు ప్యాడ్స్.. ఇలా ఇబ్బంది లేకుండా చదువుకోవటానికి అవసరమైన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. 2017 – 2018 మధ్య ప్రాంతంలో 1,75,000 కి.మీ. డ్రైవర్ ని పెట్టుకుని ఒంటరిగా వివిధ పాఠశాలలకు ప్రయాణించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏడువేల స్లమ్స్‌లో ప్రతి బుధవారం ఒక్కో స్లమ్‌లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యులకు మోదుగ ఆకుల విస్తర్లు కుట్టడానికి అనువుగా రెండు మెషీన్లు అందించారు.
వారే మా వలంటీర్లు..
‘‘సమాజసేవ చేయాలనుకునే టీచర్లే మాకు ప్రతినిధులు. ఆయా ప్రాంతాల ఎన్‌జీఓ ల సహాయంతో ఈ పనులు చేయగలుగుతున్నాం. కడపలో కోవిడ్ కారణంగా మరణించిన వారి కోసం వ్యాన్, ఐస్ బాక్స్ అందచేశాం’’ అని చెబుతారు సంధ్య గోళ్లమూడి.
అమ్మమ్మ... అభ్యాస పాఠశాలలు..
అటవీ ప్రాంతాలలో కొండ మీద నివసించేవారి కోసం అభ్యాస విద్యాలయాలు ఏర్పాటు చేశారు. ‘‘అందరూ నన్ను ‘మా అమ్మమ్మ’ అని ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకుంటారు’’ అంటున్న సంధ్య గోళ్లమూడి, వివిధ సమస్యల మీద ఛందోబద్ధంగా 3000 కవితలు రాశారు.
65 సంవత్సరాల వయసులో కూచిపూడి నాట్యం చేసి, ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఋతువులను అనుసరించి ఇల్లు సర్దుకుంటారు. ‘‘ప్రతిదీ ప్రభుత్వమే చేయాలంటే కుదరకపోవచ్చు. అందరం ప్రభుత్వంలో భాగస్వాములమే కనుక దేశపౌరులుగా ఇది మనందరి బాధ్యత’’ అంటారు ఎంతో హుందాగా.
–వైజయంతి పురాణపండ
లాక్‌డౌన్ విధించటానికి ముందే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కావలసిన నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌ని సప్లయి చేశాం. సమతుల ఆహారాన్ని అందించాం. వివిధ ప్రాంతాలకు చెందినవారు వారి ఇళ్లకు చేరుకోవటం కోసం రెండు బస్సులు ఏర్పాటు చేశాం. రెండు కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. మేం నడిపిన కోవిడ్ సెంటర్లలో అందరూ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క మరణం కూడా లేదు.
– సంధ్య గోళ్లమూడి
సంధ్య గోళ్లమూడి
Comments
Please login to add a commentAdd a comment