KLI project
-
నీట మునిగిన ‘కేఎల్ఐ’ మోటార్లు
సాక్షి, నాగర్‌కర్నూల్/కొల్లాపూర్ రూరల్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) మొదటి లిఫ్ట్ మోటార్లు నీట మునిగాయి. కొల్లాపూర్ నియోజకవర్గం కృష్ణానది తీరంలోని ఎల్లూరు వద్ద కేఎల్ఐ మొదటి లిఫ్ట్ వద్ద శుక్రవారం సాయంత్రం 1, 3వ మోటార్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మూడో మోటార్ నీటిని ఎత్తిపోసే పైపులైన్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల సర్జ్‌పూల్ పక్కనే గల భూగర్భంలోని ఐదు మోటార్లు నీట మునిగాయి. లీకేజీ ఏర్పడి నీరు మోటార్లకు వస్తుండగా అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు మొదటి మోటార్‌ను, సాయంత్రం 3.40 గంటలకు మూడో మోటార్‌ను ప్రారంభించారు. మూడో మోటార్ ఆన్‌చేసిన 10 నిమిషాల తర్వాత ఆ మోటార్ కింద ఉన్న బేస్మెంట్ బ్లాస్ట్ కావడం వల్ల నీళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. లిప్ట్‌లోని 45 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు వచ్చాయి. లిఫ్ట్‌లోని ఎనిమిది అంతస్తులతో పాటు ప్యానల్ బోర్డు సహా నీట మునిగాయి. ఈ విషయంపై కేఎల్ఐ ఎస్ఈ అంజయ్యను వివరణ కోరగా.. మోటార్లు లీక్ కావడం వల్ల నీరు వచ్చిందని, డీ వాటరింగ్ చేస్తామని వివరించారు. పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే వెల్లడిస్తామని తెలిపారు. కాగా కేఎల్ఐ మొదటి లిఫ్ట్ వద్ద 2015లో కూడా ఇదే విధంగా మోటార్లు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి రాత్రి 10 గంటల సమయంలో ఘటన జరిగిన ఎల్లూరు వద్ద కేఎల్ఐ మొదటి లిఫ్ట్‌ను పరిశీంచారు. సాంకేతిక లోపం వల్లే.. మంత్రి నిరంజన్ రెడ్డి కొల్లాపూర్ రూరల్: కేఎల్ఐ ప్రాజెక్టు మొదటి లిఫ్ట్‌లో సాంకేతిక లోపం వల్ల వరద నీరు వచ్చి ఐదు పంపులు మునిగాయని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సమస్యపై ప్రస్తుతం ఎలాంటి పరిష్కారం దొరకదని, నీటిని డీవాటరింగ్ చేస్తే తప్ప.. విషయం చెప్పడానికి వీలుకాదని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి మునిగిపోయిన పంపులను ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాగునీటి కోసం మిషన్‌భగీరథ పథకం అవసరం నిమిత్తం మధ్యాహ్నం 2.54 నిమిషాలకు మొదటి లిఫ్ట్‌లోని మొదటి పంపును ప్రారంభించారు. 3.45 నిమిషాలకు మూడో పంపును ప్రారంభించిన వెంటనే పెద్ద ఎత్తున మోటార్ల శబ్ధం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ సమస్యను సాంకేతిక లోపంగా గుర్తించామని పేర్కొన్నారు. -
‘పాలమూరు’ పరుగులు
ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకోనుంది. నిధుల సమస్యతో నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.10వేల కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. రుణం మంజూరైన వెంటనే మందకొడిగా సాగుతోన్న ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రుణ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో నిధులు మంజూరు చేయడమే మిగిలిందని అధికారులు చెబుతున్నారు. సాక్షి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాల్లో 12.30లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం 2015 జూన్‌లో ప్రతిష్టాత్మకంగా రూ.35,200కోట్లతో పాలమూరు–ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టింది. ఈ అప్పట్లో సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వద్ద కరివెన రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. తర్వాత కాంట్రాక్టర్ల ఒప్పందం కోసం పది నెలల సమయం పట్టింది. చివరకు 2016 మే నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో 2018 ఆఖరులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయి తే ప్రాజెక్టు పనులు వేగంగా చేసేందుకు సరిపడా నిధులు లేకపోవడంతో పనుల్లో వేగం తగ్గింది. ఇప్పటి వరకు సుమారు రూ.10వేల కోట్ల మేర పనులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం రుణం మంజూరు కానుండడంతో పనుల్లో వేగం మరింత వేగం పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు స్వరూపం ఇదీ.. శ్రీశైలం వెనక జలాల నుంచి నీటిని ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న కేఎల్ఐ ప్రాజెక్టులకు సంబంధించి నీటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు లేకపోవడంతో ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల కింద పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించేందుకు నిర్ణయించింది. మొత్తం ఆరు రిజర్వాయర్లతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇందులో సర్కిల్–1లో కొల్లాపూర్ పరిధిలోని నార్లాపూర్‌లో 8.55 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వనపర్తి పరిధిలోని ఏదుల 6.99టీఎంసీలు, నాగర్‌కర్నూల పరిధిలోని వట్టెం వద్ద 16.75 టీఎంసీలు, మహబూబ్‌నగర్ పరిధిలోని కరివెన వద్ద 17.34 టీఎంసీలు, సర్కిల్–2 పరిధిలోని ఉద్దండాపూర్ వద్ద 9.1టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మిదేవిపల్లి వద్ద 3 టీఎంసీలు (గతంలో 10 టీఎంసీల అంచనా ఉండగా> కుదించారు)మొత్తం ఆరు రిజర్వాయర్ నిర్మించేందుకు పథకాన్ని ప్రారంభించారు. పనులు ఇలా.. జిల్లాలో ఈ ప్రాజెక్టు పనులు 15ప్యాకేజీలుగా విభజించి కొనసాగిస్తున్నారు. రిజర్వాయర్ల వారీగా పరిశీలిస్తే నార్లాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి మొత్తం 2,465 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,275 ఎకరాల భూమిని సేకరించారు. రూ.760కోట్ల వ్యయానికిగాను రూ.425కోట్లు ఖర్చు చేసి 60శాతం పనులు పూర్తి చేశారు. ఏదుల రిజర్వాయర్‌కు సంబంధించి 5,470 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 5,011 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణ వివిధ దశల్లో ఉంది. రూ. 664 కోట్ల వ్యయానికి రూ.622 కోట్లు ఖర్చు చేసి 95శాతం పనులను పూర్తి చేశారు. వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించి 4,526ఎకరాలు సేకరించాల్సి ఉండగా దాదాపు 4 వేల ఎకరాలను సేకరించారు. రూ.6వేల కోట్ల వ్యయానికి రూ.1800 కోట్లతో 30శాతం పనులు పూర్తి చేశారు. కరివెన రిజర్వాయర్‌కు సంబంధించి 6,676 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉండగా 6,008 ఎకరాలను సేకరించారు. మిగిలిన భూమికి సంబంధించి సేకరణ అంశం వివిధ దశల్లో ఉంది. రూ.760కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ పనులు రూ. 425కోట్ల ఖర్చుతో దాదాపు 60శాతం పూర్తయ్యా యి. కాలువల విషయానికొస్తే నార్లపూర్ నుంచి ఏదుల వరకు 8.375 కిలో మీటర్ల కాల్వలను 2, 3 ప్యాకేజీలుగా విభజించి ఇప్పటి వరకు 50శాతం పనులు పూర్తి చేశారు. ఏదుల నుంచి వట్టెం వరకు 6.4 కిలో మీటర్ల కాలువను 6, 7ప్యాకేజీలుగా విభజించి 81శాతం పనులు పూర్తి చేశారు. ఇక వట్టెం నుంచికరివెన వరకు 12కిలో మీటర్ల కాలువను 12వ ప్యాకేజీగా విభజించి 72 శాతం కాలువ పనులను పూర్తి చేశారు. మోటార్లకే కేటాయింపు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం గల మోటార్లను బిగించనున్నారు. నార్లపూర్‌లో 145మెగావాట్ల సామర్థ్యం గల ఎనిమిది మోటార్లను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ప్రతి రోజు 22వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసేలా ఇంజనీర్లు డిజైన్ చేశారు. అయితే ఇంత సామర్థ్యం గల పంపులు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా వినియోగించకపోవడం విశేషం. పవర్ కార్పొరేషన్ ద్వారా మంజూరయ్యే రుణం వీటి కొనుగోలుకే కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో 6.55 టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్‌ను రూ.600 కోట్ల అంచనాతో 2015లో అప్పటి రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పనులు ప్రారంభించారు. సొరంగాలు, సర్జిపూల్స్, కాల్వలు పనులు పురోగతిలో ఉన్నాయి. 7.5 కిలోమీటర్ల పొడవైన ఆనకట్ట నిర్మాణం 99 శాతం పూర్తి చేశారు. రూ.400 కోట్ల రిజర్వాయర్ నిర్మాణానికి, రూ. 200 కోట్ల కాల్వల నిర్మాణం కోసం కేటాయించారు. ఇక్కడ 1.45 హెచ్‌పీ సామర్థ్యం గల 9 పంపులను ఏర్పాటు చేసి, నీటిని ఎత్తిపోసే విధంగా ప్రాజెక్టు డిజైన్ చేశారు. ఈ రిజర్వాయర్‌కు నీరు వస్తే.. 29 గ్రామాల పరి«ధిలోని 45వేల ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందుతోంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటి వరకు 5,011ఎకరాల భూసేకరణ చేశారు. ఇంకా 395 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో 195 ఎకరాల భూమి వివాదాస్పదంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. -
భగీరథ యత్నం
కొల్లాపూర్ : ఇంటింటికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలో మిషన్‌భగీరథ కోసం కృష్ణానది నీటిని ఎత్తిపోసేందుకు నెలరోజులుగా అధికారులు పనులు నిర్వహిస్తున్నారు. కృష్ణానది బ్యాక్‌వాటర్ ఆధారంగా నిర్మించిన మిషన్ భగీరథ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లాలో 3 నియోజకవర్గాల్లోని మొత్తం 81మండలాలకు రక్షిత తాగునీరు అందించేందుకు ఎల్లూరులో మిషన్ భగీరథ పనులు చేపట్టారు. రూ.5,478 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎల్లూరు వద్ద రూ.120కోట్ల వ్యయంతో పంప్‌హౌజ్, ఫిల్టర్‌బెడ్స్ నిర్మించారు. ప్రతి ఏడాది 10 టీఎంసీల కృష్ణానది నీటిని వినియోగించే విధంగా పనులు పూర్తిచేశారు. ప్రాజెక్టుకు మొదట్లో కోతిగుండు ప్రాంతం నుంచి కృష్ణానది నీటిని పంపింగ్ చేయాలని అధికారులు భావించారు. తర్వాత కేఎల్ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచి నీటిని వాడుకునే విధంగా ప్రణాళికలు తయారుచేశారు. రెండు నెలలుగా నీటి సరఫరా.. కేఎల్ఐ ప్రాజెక్టులో భాగమైన ఎల్లూరు రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం కేవలం 0.35టీఎంసీలు మాత్రమే. కేఎల్ఐ ప్రాజెక్టు మోటార్ల ద్వారా ఈ రిజర్వాయర్‌ను నింపి, అక్కడి నుంచి మిషన్ భగీరథ పరిధిలోని గ్రామాలకు నీటిని సరఫరా చేపడుతున్నారు. ఈ ఏడాది జనవరిలోనే నీటివిడుదల చేపట్టాలని ప్రభుత్వం భావించినప్పటికీ పనుల్లో జాప్యం, సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. అయితే ఇటీవల కొల్లాపూర్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు అధికారులు తాగునీటి సరఫరా చేపట్టారు. కొల్లాపూర్ మున్సిపాలిటీతో పాటు కొన్ని గ్రామాలకు రెండు నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయి. ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తికావడంతో ఈ నెలాఖరులోగా మిషన్ భగీరథ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. తగ్గిన నీటిమట్టం కారణంగా.. కృష్ణానదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో కేఎల్ఐ అప్రోచ్ చానల్‌కు నీళ్లు అందడం లేదు. రెండు నెలల క్రితం వరకూ కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటిని పంపింగ్ చేసి ఎల్లూరు రిజర్వాయర్‌ను నింపారు. ఈ నీళ్లనే కొల్లాపూర్ నియోజకవర్గానికి సరఫరా చేస్తున్నారు. నెల వ్యవధిలోనే సగం రిజర్వాయర్ ఖాళీ అయ్యింది. అప్రోచ్చానల్కు నీళ్లు అందేలా కిలోమీటర్ లోపల అధికారులు అడ్డుకట్టలు వేశారు. అయినా పంపింగ్‌కు సరిపోయినన్ని నీళ్లు రాకపోవడంతో కేఎల్ఐ ప్రాజెక్టుకు 2.3కి.మీ.దూరంలో కోతిగుండు వద్ద అడ్డుకట్ట నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నెలరోజులుగా పనులు కోతిగుండు ప్రాంతంలో నది బ్యాక్‌వాటర్‌లో ప్రస్తుతం అడ్డుకట్ట నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.6కోట్ల నిధులు కేటాయించారు. నెల రోజులుగా పనులు కొనసాగుతున్నాయి. నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని సమీక్షిస్తున్నారు. అడ్డుకట్ట వేసిన ప్రాంతం వరకు విద్యుత్ లైనింగ్ పనులు చేపట్టారు. కేఎల్ఐ ప్రాజెక్టు సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసున్నారు. 150స్తంభాలను పాతారు. వైరింగ్ పనులు జరుగుతున్నాయి. అడ్డుకట్టపై 100హెచ్‌పీ సామ ర్థ్యం కలిగిన 25 పంప్మోటార్లను బిగించి నీటిని కేఎల్ఐ అప్రోచ్చానల్లోకి ఎత్తిపోసే విధంగా పనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అడ్డుకట్టపై రోలింగ్ పనులు సాగుతున్నాయి. త్వరలోనే మోటార్ల ఏర్పాటు కృష్ణానది నీటిమట్టం తగ్గిపోవడంతో కోతిగుండు నుంచి పంప్ మోటార్ల ద్వారా మిషన్‌భగీరథకు నీటిని పంపింగ్ చేసే విధంగా పను లు చేపట్టాం. నీటి మట్టం తగ్గినప్పుడు ఈ కట్టపై మోటార్లు ఏర్పాటుచేసి పంపింగ్ చేస్తాం. వరదలు వచ్చే సమయానికి మళ్లీ మోటార్లను ఒడ్డుకు చేర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం అడ్డుకట్టను పటిష్టంగా నిర్మించేందుకు రోలింగ్ పనులు జరుగుతున్నాయి. మూడు రోజుల్లో మోటార్లు ఎల్లూరుకు చేరుకుంటాయి. త్వరగా పనులు పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. నీటి ఎత్తిపోత ప్రారంభమైన వెంటనే ప్రాజెక్టు పరిధిలోని మిగతా నియోజకవర్గాలకు కూడా నీటి సరఫరా చేపడతాం. – రాజు, డీఈఈ -
ఏడాది చివరిలోగా సాగునీరు
► కేఎల్ఐ పెండింగ్‌కు గత పాలకుల నిర్లక్ష్యమే ► చివరి ఆయకట్టు రైతులకునీరందించడమే లక్ష్యం ► అన్ని వర్గాలకు మేలు జరిగేలా పాలన ► భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మిడ్జిల్: ఈ ఏడాది చివరిలోగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గురువారం మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్డిగూడ సమీపంలోని దుందుబీ వాగు వద్ద జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వలన కేఎల్ఐ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రాజెక్టులను నిర్మించకుండా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలోని నాలు మండలాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు. రైతులను రాజులు చేయడమే లక్ష్యం కేఎల్ఐ వేగంగా పూర్తి చేసేందుకు సహకారం అందించాలని స్థానిక రైతులను మంత్రి కోరారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండడం తో పనులు వేగవంతం అవుతున్నాయని తెలిపారు. బంగారు తెలంగాణ చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో బీడు భూములు లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారన్నారు. రైతులను రాజులను చేయడమే ఆయన లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని అన్నారు. ఆయన వెంట మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, బాల్‌రెడ్డి, సుదర్శన్ , గిరినాయక్, సురేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
కేఎల్ఐ ప్రాజెక్టు వైఎస్ పుణ్యమే
కొల్లాపూర్‌రూరల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమేనని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎల్లూరు శివారులోని పాలమూరు ఎత్తిపోతల పథకం కొత్త డిజైన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ఎతిపోతల కొత్త రీడిజైన్ ద్వారా కేఎల్ఐ ప్రాజెక్టు కింద 90వేల ఎకరాల ఆయకట్టును రైతులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేఎల్ఐ ప్రాజెక్టు సమీపంలో పాలమూరు రీడిజైన్ ప్రాజెక్టు పనులు చేపట్టడం విడ్డూరమన్నారు. దీనివల్ల కేఎల్‌ఐకి పూర్తిగా ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ సందర్భంగా పాలమూరు ప్రాజెక్టు రీడిజైన్ వివరాలను డీఈ ప్రవీణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే అగ్రిమెంట్ పనులు జరుగుతున్నాయని, కొత్తగా ఎలాంటి పనులు చేయడం లేదని డీఈ వివరించారు. కొల్లాపూర్ రైతులను ముంచేందుకే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. కేఎల్ఐ ఆయకట్టుకు ఎలాంటి ముప్పువాటిల్లినా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రంగినేని జగదీశ్వరుడు, నాగరాజు, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు జంబులయ్య, సురేందర్సింగ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పస్పుల కష్ణ, ప్రధాన కార్యదర్శి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.