ఏడాది చివరిలోగా సాగునీరు
► కేఎల్‌ఐ పెండింగ్‌కు గత పాలకుల నిర్లక్ష్యమే
► చివరి ఆయకట్టు రైతులకునీరందించడమే లక్ష్యం
► అన్ని వర్గాలకు మేలు జరిగేలా పాలన
► భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
మిడ్జిల్: ఈ ఏడాది చివరిలోగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గురువారం మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్డిగూడ సమీపంలోని దుందుబీ వాగు వద్ద జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వలన కేఎల్‌ఐ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రాజెక్టులను నిర్మించకుండా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలోని నాలు మండలాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు.
రైతులను రాజులు చేయడమే లక్ష్యం
కేఎల్‌ఐ వేగంగా పూర్తి చేసేందుకు సహకారం అందించాలని స్థానిక రైతులను మంత్రి కోరారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండడం తో పనులు వేగవంతం అవుతున్నాయని తెలిపారు. బంగారు తెలంగాణ చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో బీడు భూములు లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారన్నారు. రైతులను రాజులను చేయడమే ఆయన లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని అన్నారు. ఆయన వెంట మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, బాల్‌రెడ్డి, సుదర్శన్ , గిరినాయక్, సురేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.