knief
-
కన్నతల్లిపై కత్తితో కొడుకు దాడి
నంగునూరు(సిద్దిపేట): కన్న కొడుకే తల్లిపై కత్తితో దాడి చేశాడు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండి సారవ్వ (52) పదేళ్ల కిందట భర్త మరణించడంతో కూలీ పనులు చేస్తూ ముగ్గురు కూతుళ్లు, కొడుకును పెంచి పోషించి పెళ్లిళ్లు జరిపించింది. అయితే తాగుడుకు బానిసగా మారిన కొడుకు తిరుపతి (23) కొన్ని రోజులుగా డబ్బుల విషయమై భార్య, తల్లితో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం తల్లీ కొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆవేశానికి లోనైన తిరుపతి ఇంట్లో ఉన్న కత్తితో తల్లిపై దాడి చేశాడు. కొడుకు బారి నుంచి తప్పించుకునేందుకు ఆమె ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తినా.. వెంబడించి మెడ, చేతులు, ఛాతీ భాగంపై ఇష్టారీతిగా దాడి చేశాడు. దీంతో సారవ్వ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన గ్రామస్తులు ఆమెను 108 అంబులెన్స్‌లో సిద్దిపేటలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. సర్పంచ్ తిప్పని రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి గొంతు కోసిన కొడుకు
కాగజ్‌నగర్ టౌన్: మద్యం, గంజాయికి బానిసైన కొడుకు కసాయిగా మారి కన్నతల్లి గొంతుకోశాడు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్ కాలనీలో నివాసముంటున్న తాడూరి సంధ్యారాణి అంగన్వాడీ ఆయాగా పనిచేస్తోంది. సంధ్యారాణికి కుమారుడు, కూతురు ఉండగా భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. కొడుకు ప్రశాంత్ గత కొద్ది కాలంగా మద్యం, గంజాయికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. కాగా ప్రశాంత్ తనకు పెళ్లి చేయాలని, మద్యానికి డబ్బులు ఇవ్వాలని గత కొద్ది రోజులుగా తల్లిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ప్రశాంత్ తల్లితో గొడవపడ్డాడు. కోపంతో ఉన్న ప్రశాంత్ గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నిద్రిస్తున్న తల్లి సంధ్యారాణి గొంతును కత్తితో కోశాడు. దాంతో తీవ్ర గాయాలతో ఆమె కేకలు వేయడంతో ప్రశాంత్ అక్కడి నుంచి పారిపోయాడు. చుట్టుపక్కల వారు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని సంధ్యారాణిని సిర్పూర్(టి) సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సంధ్యారాణి ఉస్మానియాలో చికిత్స పొందుతుండగా, ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు ఎస్సై గంగన్న తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పట్టణ సీఐ తెలబోయిన కిరణ్ వెల్లడించారు. -
అప్పు చెల్లించలేదని హత్య
సాక్షి, వికారాబాద్ అర్బన్: మహిళ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదనే కోపంతో ఆమెను చంపేసి ఒంటిపై ఉన్న నగలతో ఉడాయించాడు. ఇటీవల వికారాబాద్ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శిరీష రాఘవేంద్ర వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని ఎల్ఐసీ కార్యాలయం సమీపంలోని ఓ ఇంట్లో ఏనుగు స్వరూప(30) కొంతకాలంగా అద్దెకు ఉంటుంది. కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉంటున్న ఆమె ఇంట్లో ఒంటరిగా నివాసం ఉండేది. అయితే, ఆమె తన దూరపు బంధువైన పట్లోళ్ల మాధవరెడ్డి వద్ద నాలుగు నెలల క్రితం రూ. 40వేలు అప్పుగా తీసుకుంది. తీసుకున్న డబ్బులను నెలరోజుల్లో తిరిగి ఇస్తానని హామీ ఇచ్చింది. గడువు దాటినా స్వరూప డబ్బులు ఇవ్వకపోవడంతో మాధవరెడ్డి నిత్యం ఫోన్‌చేసి డబ్బులు ఇవ్వాలని అడిగేవాడు. ఈక్రమంలో ఈ నెల 4న స్వరూప మాధవరెడ్డికి ఫోన్‌చేసి డబ్బులు ఇస్తానని తన ఇంటికి రావాలని చెప్పింది. అనంతరం ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర అగ్రహానికి గురైన మాధవరెడ్డి ఇంట్లో కూరగాయలు కోసే కత్తిపీటను తీసుకొని స్వరూప మెడపై దాడి చేసి చంపేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న సుమారు రూ.1.2 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతోపాటు ఆమె సెల్‌ఫోన్‌ను తీసుకొని పరారయ్యాడు. పోలీసులకు చిక్కకుండా నేరస్తుడు పలు జాగ్రతలు తీసుకున్నా ఆధునిక టెక్నాలజీతో తమ సిబ్బంది 48 గంటల్లో కేసును చేధించినట్లు డీఎస్పీ శిరీష రాఘవేందర్ తెలిపారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. స్వరూప ఒంటిపై నగలు కనిపించకపోవడంతో ముందుగా దొంగలు హత్య చేసి ఉండొచ్చని భావించారు. హతురాలి సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు నిందితుడు మాధవరెడ్డిని గుర్తించి పట్టుకున్నారు. అతడి నుంచి బంగారు పుస్తెల తాడు, చెవి కమ్మలు, ఇతర వస్తువులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో పట్టణ సీఐ సీతయ్య, ఎస్ఐ లక్ష్మణ్, కానిస్టేబుల్ శివకుమార్, బాలు తీవ్రంగా శ్రమించారని డీఎస్పీ వారిని అభినందించారు. నేరాలకు పాల్పడే నిందితులు ఎట్టి పరిస్థితిలోనూ పోలీసుల నుంచి తప్పించుకోరని డీఎస్పీ తెలిపారు. నేడు సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగి పోయిందని, కొత్త టెక్నాలజీ సహకారంతో నేరస్తులను పట్టుకోవడం చాలా తేలికైందన్నారు. అనంతరం పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. -
మరదలితో తిరగొద్దన్నందుకు మచ్చు కత్తితో దాడి
సాక్షి, ఎర్రగుంట్ల : తన మరదలితో తిరగొద్దన్నందుకు ఓబులేసు అనే వ్యక్తిపై గురుస్వామి అనే వ్యక్తి మచ్చు కత్తితో దాడి చేసిన సంఘటన మంగళవారం కలమల్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్ల మండల పరిధిలోని కర్చుకుంటపల్లి గ్రామానికి చెందిన ఎస్.ఓబులేసు ఆర్టీపీపీలోని ఆరవ యూనిట్లో కూలీలను పెట్టుకొని సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఈ కూలీలతో పాటు తన మరదలు శేషమ్మ కూడా ఆర్టీపీపీకి పనికి వస్తుండేది. అయితే ప్రొద్దుటూరు పట్టణం హనుమాన్‌నగర్‌కు చెందిన డి. గురుస్వామి కూడా ఆర్టీపీపీలో బేల్దార్ పని చేసేవాడు. ఈ నేపథ్యంలో శేషమ్మ, గురుస్వామికి పరిచయం ఏర్పడింది. వారిద్దరు చనువుగా ఉండేవారు. ఇది గమనించిన ఓబు లేసు వారిద్దరిని మందలించాడు. తమ పరిచయానికి ఓబులేసు అడ్డుగా ఉన్నాడని భావించిన వీరిద్దరూ అతనిపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో రోజు మాదిరిగానే ఓబులేసు చిలంకూరు గ్రామం నుంచి ఆర్టీపీపీకి ఆటోలో కూలీలను పిలుచుకొని తాను బైకుపై బయలు దేరాడు. ఆ సమయంలోనే కలమల్ల వంకపై ఉన్న వంతెన వద్ద గురుస్వామి కాపుకాశాడు. ఓబులేసు బైకుపై వస్తుండగా ఎదురుగా గురుస్వామి కూడా బైకుపై వెళ్లి ఢీకొట్టాడు. కింద పడ్డ ఓబులేసుపై తాను వెంట తెచ్చుకున్న మచ్చుకత్తితో తలపై, భుజంపై నరికాడు. వెంటనే స్థానికులు కేకలు వేయడంతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న ఓబులేసును చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింంచారు. దాడి చేసిన గురుస్వామిని కూడా వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. డాక్టర్ సుధీర్‌రెడ్డి పరామర్శ: కలమల్లలో జరిగిన సంఘటనను తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి గాయపడ్డ ఓబులేసును పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీ మైసూరారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు. -
కత్తితో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.. ఆపై..
సాక్షి, ప్రకాశం: వివాహితను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన జిల్లాలోని బేస్తవారిపేట మండలం ఖాజీపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలివి.. గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళను తర్లుపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అతను కత్తితో పాటు కంభం పోలీస్ స్టేషన్ వెళ్లి సరండర్ అయ్యాడు. అయితే నిందితుడిని బేస్తవారిపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మృతదేహం గుర్తించే పక్రియలో భాగంగా అతడ్ని పోలీసులు సంఘటన స్థలానికి తరలించారు. ఈ హత్యకు వారిద్దరి మధ్య అక్రమ సంబంధమేన కారణమని సమాచారం. మృతురాలు నాగమణిని ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
జూబ్లీహిల్స్‌లో పట్టపగలే దారుణం..
సాక్షి, హైదరాబాద్: పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే...ముగ్గురు దుండగులు కత్తులతో బీభత్సం సృష్టించారు. ఒంటరిగా వెళుతున్న ద్విచక్ర వాహనదారుడిని టార్గెట్ చేసుకుని... వాహనంతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. ఈ సంఘటన గురువారం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న యాదగిరి మరో ఉద్యోగితో కలిసి... ఆఫీస్ పనిమీద జూబ్లీహిల్స్ వెళ్లాడు. ఒకరు షాపులోకి వెళ్లగా.... యాదగిరి బైక్ మీద బయట వేచి చూస్తున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన ముగ్గురు వ్యక్తులు యాదగిరిని కత్తులతో బెదిరించడమే కాకుండా బైక్ మీద నుంచి కిందకు తోసేశారు. ఆ తరువాత.. గొంతుపై కత్తిపెట్టి.. పర్సు లాక్కున్నారు. ఈ సందర్భంగా యాదగిరి దుండగులను ఎదుర్కొనేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దుండగులపై హెల్మెట్ విసిరికొట్టినా వదలకుండా ముగ్గురు దుండగులు ద్విచక్రవాహనంపై అక్కడి నుంచి ఉడాయించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు ఈ ఘటన జరుగుతున్నా అక్కడ ఉన్నవారు మాత్రం మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. అటుగా వచ్చిన కార్లు, టూవీలర్ మీద వున్న వ్యక్తులు కూడా చూస్తూ ఉండిపోయారే కానీ... ఏమీ చేయకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. -
అక్కను కత్తితో పొడిచిన తమ్ముడు
అనంతపురం: ఓ వ్యక్తి తన సోదరిని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడన్హళ్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగరాజు అనే యువకుడు తన సోదరి వడ్డె గోవిందమ్మ(40)పై శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో దాడి చేశాడు. ఛాతిపై కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నాగరాజును నిలువరించేందుకు ప్రయత్నించిన గోవిందమ్మ అల్లుడు వెంకటేష్‌కు కూడా గాయాలయ్యాయి. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని వారు తెలిపారు. (మడకశిర)