కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శిరీష రాఘవేంద్ర
సాక్షి, వికారాబాద్ అర్బన్: మహిళ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదనే కోపంతో ఆమెను చంపేసి ఒంటిపై ఉన్న నగలతో ఉడాయించాడు. ఇటీవల వికారాబాద్ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శిరీష రాఘవేంద్ర వెల్లడించారు.
మున్సిపల్ పరిధిలోని ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలోని ఓ ఇంట్లో ఏనుగు స్వరూప(30) కొంతకాలంగా అద్దెకు ఉంటుంది. కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉంటున్న ఆమె ఇంట్లో ఒంటరిగా నివాసం ఉండేది. అయితే, ఆమె తన దూరపు బంధువైన పట్లోళ్ల మాధవరెడ్డి వద్ద నాలుగు నెలల క్రితం రూ. 40వేలు అప్పుగా తీసుకుంది. తీసుకున్న డబ్బులను నెలరోజుల్లో తిరిగి ఇస్తానని హామీ ఇచ్చింది. గడువు దాటినా స్వరూప డబ్బులు ఇవ్వకపోవడంతో మాధవరెడ్డి నిత్యం ఫోన్‌చేసి డబ్బులు ఇవ్వాలని అడిగేవాడు. ఈక్రమంలో ఈ నెల 4న స్వరూప మాధవరెడ్డికి ఫోన్‌చేసి డబ్బులు ఇస్తానని తన ఇంటికి రావాలని చెప్పింది. అనంతరం ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో వాగ్వాదం జరిగింది.
దీంతో తీవ్ర అగ్రహానికి గురైన మాధవరెడ్డి ఇంట్లో కూరగాయలు కోసే కత్తిపీటను తీసుకొని స్వరూప మెడపై దాడి చేసి చంపేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న సుమారు రూ.1.2 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతోపాటు ఆమె సెల్‌ఫోన్‌ను తీసుకొని పరారయ్యాడు. పోలీసులకు చిక్కకుండా నేరస్తుడు పలు జాగ్రతలు తీసుకున్నా ఆధునిక టెక్నాలజీతో తమ సిబ్బంది 48 గంటల్లో కేసును చేధించినట్లు డీఎస్పీ శిరీష రాఘవేందర్ తెలిపారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. స్వరూప ఒంటిపై నగలు కనిపించకపోవడంతో ముందుగా దొంగలు హత్య చేసి ఉండొచ్చని భావించారు. హతురాలి సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు నిందితుడు మాధవరెడ్డిని గుర్తించి పట్టుకున్నారు.
అతడి నుంచి బంగారు పుస్తెల తాడు, చెవి కమ్మలు, ఇతర వస్తువులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో పట్టణ సీఐ సీతయ్య, ఎస్‌ఐ లక్ష్మణ్, కానిస్టేబుల్ శివకుమార్, బాలు తీవ్రంగా శ్రమించారని డీఎస్పీ వారిని అభినందించారు. నేరాలకు పాల్పడే నిందితులు ఎట్టి పరిస్థితిలోనూ పోలీసుల నుంచి తప్పించుకోరని డీఎస్పీ తెలిపారు. నేడు సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగి పోయిందని, కొత్త టెక్నాలజీ సహకారంతో నేరస్తులను పట్టుకోవడం చాలా తేలికైందన్నారు. అనంతరం పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment