ఎన్పీఏ నిబంధనలు మార్చలేం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్పీఏ నిర్వచనం, నిబంధనలు మార్చలేమని ఆర్బీఐ స్పష్టం చేసింది. తీసుకున్న రుణంపై 90 రోజుల పాటు ఎటువంటి వడ్డీ, అసలు చెల్లింపులు లేకపోతే ఎన్పీఏగా పరిగణిస్తున్నామని, దీని నుంచి మధ్య, చిన్న తరహా పరిశ్రమలను మినహాయించలేమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షోభం, విద్యుత్ సంక్షోభం వల్ల ఎంఎస్ఎంఈ రంగం వ్యాపారాన్ని నష్టపోయిందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర కంపెనీలకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని ఫ్యాఫ్సీ ఆర్బీఐని కోరింది.
దీనిపై గాంధీ స్పందిస్తూ వ్యాపారాలు దెబ్బతినడానికి కారణమైన ప్రభుత్వం నుంచి రాయితీలు కోరడం తప్ప వేరే మార్గం లేదన్నారు. వ్యాపార అవకాశాలుండి, ప్రత్యేక పరిస్థితుల వల్ల దెబ్బతిన్న పరిశ్రమల రుణాలను పునర్ వ్యవస్థీకరిస్తున్నామని, ఇది కూడా ఆర్థికంగా పటిష్టంగా ఉంటేనే చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ‘నో యువర్ కస్టమర్’ అనే అంశంపై ఫ్యాప్సీ నిర్వహించిన సదస్సుకు గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమ బాగు కోసం వడ్డీపై రాయితీలను, రుణాలు రీ-షెడ్యూల్ చేస్తే పరిశ్రమలు బాగుంటాయేమో కాని, బ్యాంకులు దివాళా తీయడం తథ్యం అన్నారు. అటు డిపాజిట్‌దారులు, ఇటు రుణాలు ఇచ్చిన వారి ప్రయోజనాలను కాపాడుకంటూ వెళ్లడమే బ్యాంకుల ప్రధాన కర్తవ్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కేవైసీ నిబంధనలు అమల్లో ఉన్నాయని, నల్లధనం, హవాల మార్గంలో నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఒకవేళ కేవైసీ నిబంధనలకు కావల్సిన పత్రాలు లేకపోయినా అకౌంట్స్‌ను తెరవడానికి అనుమతిస్తున్నామని, కాని వీటి లావాదేవీలపై పరిమితులుంటాయన్నారు. ఇలా ప్రారంభించిన ఖాతాలు ఒక ఏడాదిలోగా కేవైసీ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుందన్నారు.