Knowledge Center
-
119 నియోజకవర్గాల్లో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు
ముదిగొండ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పదిహేను రోజుల్లోగా అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ కేంద్రాల్లో నిపుణులైన అధ్యాపకులతో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉద్యోగ నియామకాల పరీక్షలను లీకేజీలు లేకుండా పారదర్శకంగా చేపడతామని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు బకాయిలు లేకుండా ప్రతినెలా వేతనాలు చెల్లిస్తామని వెల్లడించారు. గత పాలకులు రెసిడెన్షియల్ పాఠశాలలను ఇరుకు భవనాల్లో నడిపించగా, తాము తాజా బడ్జెట్లో సొంత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి, ఖజానా ఖాళీ చేయగా.. తాము ప్రతీపైసా పోగు చేసి ముందుకు సాగుతున్నామని, ఈ క్రమంలో ఇచ్చింన ప్రతీ హామీ నెరవేరుస్తామని భట్టి వెల్లడించారు. గృహజ్యోతి ప్రారంభం ముదిగొండలోని ఓ ఇంట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ మీటర్ రీడింగ్ తీసి గృహజ్యోతి పథకం ద్వారా జీరో బిల్లు అందజేశారు. ఈనెల నుంచి 200 యూనిట్లు వరకు విద్యుత్‌ను వినియోగించే వారు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈకార్యక్రమంలో ఎన్పిడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యలో ‘షేరింగ్’
సాక్షి, అమరావతి: సెంట్రల్ వర్సిటీలు సహా దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లోని వనరులను సద్వినియోగం చేయడం, సమీపంలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలు కూడా వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ‘షేరింగ్’ విధానానికి శ్రీకారం చుట్టింది. వివిధ సదుపాయాలతో పాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధన ఇతర అంశాల్లో విద్యా సంస్థల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణికి తెరతీసింది. నాలెడ్జ్ షేరింగ్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి వీలుగా టెక్నాలజీని, ఇతర వనరులను ఆయా సంస్థలు ఉమ్మడిగా వినియోగించుకునేందుకు ఈ విధానం దోహదపడనుంది. సెంట్రల్ వర్సిటీలు సహా అన్ని ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ ఆదేశాలిచ్చింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు పరిశోధన కోర్సుల్లోనూ దీన్ని అమలుచేయాలని సూచించింది. వనరులు లేని విద్యాసంస్థలు వాటిని ఏర్పాటు చేసుకునేందుకు అదనపు పెట్టుబడి పెట్టాల్సిన అవసరంలేకుండా దగ్గర్లోని విద్యా సంస్థల వనరులను వినియోగిస్తూ తమ విద్యార్థులను ఆయా సంస్థలు తీర్చిదిద్దడానికి ఈ విధానంతో వీలుపడుతుంది. రెట్టింపు ఫలితాలు ఈ విధానంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయని యూజీసీ భావిస్తోంది. అకడమిక్ అంశాలు సహా ఏదైనా అభివృద్ధి కార్యకలాపాలను సమగ్రంగా అమలుచేయాలంటే అదనపు సదుపాయాలు అవసరమవుతుంటాయి. ఇందుకోసం ఆయా సంస్థలు అదనపు పెట్టుబడి పెట్టాలి. అలా కాకుండా.. ఇప్పటికే ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించడంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్యాసంస్థలు పరస్పర సహకారంతో విద్యాపరమైన మౌలిక వనరులను పంచుకోవడం వల్ల విద్యార్థులకు సమానమైన విద్య అందుతుంది. ప్రస్తుతం ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఇతర వనరులున్న సంస్థల్లో చదివే వారికి ఆ వనరుల ద్వారా ఉత్తమ బోధన లభిస్తుంది. కానీ, అలాంటివిలేని సంస్థల విద్యార్థులకు ఉన్నత బోధన దూరమవుతోంది. వనరులను పంచుకునేలా ఆయా సంస్థల మధ్య జరిగేఒప్పందాలతో విద్యార్థులందరికీ మేలు చేకూరుతుంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్, పీహెచ్డీ కోర్సులన్నిటికీ ఈ విధానాన్ని అమలుచేయాలని యూజీసీ సూచించింది. ఆయా విద్యాసంస్థలన్నీ తమ సంస్థలోని తరగతి గదులు, ల్యాబ్‌లు ఇతర వనరుల సమాచారాన్ని సమీపంలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలన్నిటికీ తెలిసేలా వెబ్సైట్ ద్వారా తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. వీటిని వినియోగించుకోవాలనుకునే ఇతర ఉన్నత విద్యా సంస్థల నుంచి నిర్దిష్ట వనరులకు సాధారణ కనీస ఛార్జీలు నిర్ణయించి వసూలుచేయవచ్చని సూచించింది. ఆ కనీస ఛార్జీల వివరాలూ అందుబాటులో ఉంచాలని పేర్కొంది. సంస్థల మధ్య ఒప్పందాలు ఇక ఉన్నత విద్యా సంస్థల్లోని వనరులను పరస్పర భాగస్వామ్యంతో వినియోగించుకునేందుకు వీలుగా ఆయా సంస్థలు ఎంఓయూ కుదుర్చుకోవాలని యూజీసీ పేర్కొంది. ఏ సమయంలో ఏ సంస్థ విద్యార్థులు వనరులు వినియోగించుకోవాలో సమగ్ర టైమ్‌టేబుల్‌ను రూపొందించి ఆ ప్రకారం కార్యక్రమాలకు కమిటీలను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. తరగతి గదులు, ల్యాబ్‌లు, ఇతర వనరులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సంస్థలు చర్యలు చేపట్టాలని, ఏ ఒక్క తరగతి ఖాళీగా ఉండకుండా చూసుకోవాలని యూజీసీ సూచించింది. ఈ విధానంతో విద్యార్థులకు మేలు.. తరగతి గదులు, మౌలిక సదుపాయాలు పంచుకోవడం ద్వారా విద్యార్థులకు మేలు చేకూరుతుంది. క్రీడా మైదానాలు, స్టేడియం, సమావేశ మందిరాలను కూడా అవసరాలను అనుసరించి పంచుకోవచ్చు. సైన్సేతర అంశాలకు సంబంధించిన వనరుల విషయంలో కూడా సంస్థలు పూర్తిస్థాయిలో తమ వద్ద ఉన్న అన్ని సదుపాయాలను ఇతర సంస్థలకు అందుబాటులో ఉంచాలని యూజీసీ పేర్కొంది. పరికరాలు దెబ్బతినే విషయంలోనూ వాటిని తిరిగి ఏర్పాటుచేయడంపైనా ఒప్పందంలో పేర్కొనాలి. అకడమిక్ అంశాలకు సంబంధించి ఆన్లైన్ లెక్చర్లు, వీడియోలు, లెర్నింగ్ మెటీరియల్‌లు, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లలోనూ ఇచ్చిపుచ్చుకోవచ్చు. విద్యార్థుల నమోదు ప్రక్రియ మొత్తం ముందుగా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పూర్తిచేయాలి. ఉపాధ్యాయుల శిక్షణ, ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు. ఖర్చులపై ముందుగానే ప్రణాళిక వనరులను పంచుకోవడానికి ముందు వ్యయ విశ్లేషణ, ఖర్చును నిర్ణయించే పద్ధతులపై ప్రణాళిక రూపొందించుకోవాలి. లాభనష్టాలకు తావులేని రీతిలో వనరుల వినియోగంపై ఛార్జీలు వసూలుచేయాలి. ప్రయోగాల వినియోగం ఆధారంగా, నిర్వహణ వ్యయం ప్రకారం పరికరాలు ఛార్జీలు నిర్ణయించాలి. ఉన్నత విద్యాసంస్థల మధ్యే కాకుండా కాలేజీలు, పరిశ్రమల మధ్య కూడా ఒప్పందాలు చేసుకోవాలని యూజీసీ సూచించింది. -
నో వాలెట్
పెద్ద పెద్ద రెస్టారెంట్లలో, హోటళ్లలో ‘వాలెట్ పార్కింగ్’ ఉంటుంది. కారు దిగగానే వాళ్లే వచ్చి కారుని పార్కింగ్ ప్లేస్‌లో పెట్టేస్తారు. దీన్నే వాలెట్ పార్కింగ్ అంటారు. అయితే ఇకముందు ఆ పనిని రోబోలు చేయబోతున్నాయి. ఫొటోలో ఉన్న రోబోను చూడండి. ఇదేం చేస్తుందో తెలుసా? షాపింగ్‌మాల్స్, ఎయిర్‌పోర్ట్‌లు, ఇతర ప్రాంతాల్లో ఆటోమేటిక్‌గా కార్లను పార్క్ చేస్తుంది. మాల్కెళితే లేదా ఎయిర్‌పోర్ట్‌కు వెళితే కారు పార్క్ చేసేందుకే బోలెడు సమయం పడుతుంది కదా.. పైగా ఒక్కో వాహనం ఒక్కో తీరుగా పార్క్ చేసి ఉండటం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఈ చికాకులన్నింటికీ విరుగుడుగా ఫ్రాన్స్‌కు చెందిన స్టాన్లీ రోబోటిక్స్ అనే సంస్థ ఈ వాలెట్ పార్కింగ్ రోబోను అభివృద్ధి చేసింది. పార్కింగ్ స్థలం ముఖద్వారం వద్ద మనం మన కారును వదిలేసి వచ్చేస్తే చాలు.. మిగిలిన పనంతా ఈ స్టాన్ రోబోనే చూసుకుంటుంది. శక్తిమంతమైన ప్లాట్‌ఫామ్ సాయంతో కారు చక్రాలను పైకిలేపడం.. వాహనం మొత్తాన్ని భద్రంగా ప్లాట్‌ఫామ్‌పైకి చేర్చి... ఖాళీ పార్కింగ్ స్థలం వరకూ మోసుకెళ్లడం.. పార్క్ చేసిన తరువాత ఇంకో కారును తీసుకొచ్చేందుకు వెళ్లడం ఇదీ స్టాన్ రోబో పనితీరు. వాహనం తాలూకూ వివరాలను స్కాన్ చేయడం ద్వారా మళ్లీ మన కారును మనకు తెచ్చిస్తుంది కూడా. ఫ్రాన్స్ రాజధాని పారిస్ విమానాశ్రయంలో ప్రస్తుతం దీన్ని పైలట్ పద్ధతిలో పరీక్షించి చూస్తున్నారు. ఇంకో విషయం. ఇతర వాలెట్ పార్కింగ్‌ల మాదిరిగా డ్రైవర్‌కు టిప్ ఇవ్వాల్సిన అవసరమూ ఉండదు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వావ్ ఫ్యాక్టర్: నో పైలట్
డ్రైవర్ల అవసరం లేని కార్లు చూశాం. డ్రైవర్ లేని బస్సులు.. లారీలూ వచ్చేశాయి. ఇక మిగిలింది గాల్లో ఎగిరే వాహనాలు. ఈ కొరతనూ తీర్చేస్తోంది ‘ఎయిర్‌బస్’ సంస్థ. ఎగిరే కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఎలాగూ కొంత సమయం ఉందనుకుందో ఏమో.. ఈ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ వీఎస్ఆర్ 700 పేరుతో ఈమధ్యే ఓ అటానమస్.. అదేనండీ.. డ్రైవర్ల అవసరం లేని హెలికాప్టర్‌ను పరిచయం చేసింది. ఓ డమ్మీ పైలట్‌ను కూర్చోబెట్టి.. కేవలం సాఫ్ట్వేర్, కొంత హార్డ్‌వేర్ సాయంతో పైకి ఎగరడం మాత్రమే కాకుండా గాల్లోనే కొంతసేపు నిలకడగా ఉండేలా చేసింది.. ఆ తరువాత క్షేమంగా ల్యాండ్ చేసింది కూడా. ఫొటోలో చూపినట్లు ఉండే వీఎస్ఆర్ 700లో ఇద్దరు మాత్రమే ప్రయాణించవచ్చు. ఇంకోలా చెప్పాలంటే 250 కిలోల బరువును మాత్రమే మోసుకెళ్లగలదు. ఒకసారి గాల్లోకి ఎగిరితే పది గంటలపాటు ప్రయాణించేలా ఇంధన ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి దీన్ని మిలటరీ అవసరాలకు మాత్రమే వాడుకునే అవకాశముంది. ఇందుకు అనుగుణంగానే దీంట్లో బోలెడన్ని సెన్సర్లు, రాడార్లు ఏర్పాటు చేశారు. నేవీతోపాటు పదాతిదళంలోనూ శత్రు స్థావరాల సమాచార సేకరణకు, లక్ష్యాలను గుర్తించేందుకు దీన్ని వాడుకోవచ్చునని అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నాలెడ్జ్ సెంటర్‌గా సీడీఎస్
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆ సంస్థ వ్యవస్థాపకులు మల్లేపల్లి లక్ష్మయ్య సాక్షి, హైదరాబాద్: దళిత వర్గాలకు అన్నిరకాలుగా చేదోడువాదోడుగా నిలిచి, అవసరమైన సమాచారాన్ని అందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేందుకు భాగ్యరెడ్డి వర్మ స్మారక భవన్ (సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్)ను నాలెడ్జ్ సెంటర్‌గా తీర్చిదిద్దనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. అంబేడ్కర్ రచనలు, దళిత సాహిత్యం, సామాజికాంశాలు, ఇతరత్రా పుస్తకాలతో పూర్తిస్థాయిలో గ్రంథాలయం, ఆడిటోరి యం ఏర్పాటు చేస్తామన్నారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా బోరబండలో సీడీఎస్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో.. సీడీఎస్ లక్ష్యాలు, చేపట్టబోయే కార్యక్రమాలపై లక్ష్మయ్యతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ ముఖ్యాం శాలు ఆయన మాటల్లోనే... సమాజంలో అణగారిన వర్గాలకు వివిధ రూపాల్లో సహాయ పడేందుకు కార్యక్రమాలను చేపడతాం. ఇప్పటికే సీడీఎస్ ద్వారా వివిధ కార్యక్రమాలను పరిమితంగానే చేపడుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం అం దిస్తున్న చేయూతతో దానిని పూర్తిస్థాయిలో విస్తరించి, అధికశాతం దళితులకు ప్రయోజనం కలిగించాలన్నదే మా లక్ష్యం. దళితులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఒక రీసెర్చ్, రిసోర్స్, ట్రైనింగ్సెంటర్గా సీడీఎస్‌ను నిలుపుతాం. ఈ కేంద్రానికి వస్తే తమ సమస్యలు, సందేహాలు తీరి, ఏదో ఒక మార్గాంతరం లభిస్తుందనే నమ్మకం కలిగేలా తీర్చిదిద్దాలనేది ధ్యేయం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ముఖ్యంగా యూపీఎస్సీ ద్వారా అందుబాటులో ఉన్న ఎన్నోరకాల ఉద్యోగాలు, అవకాశాలపై అవగాహన కల్పిస్తాం. నిరుద్యోగులు, నిరక్షరాస్యులకు అవసరమైన శిక్షణ ఇస్తాం. ఇబ్బందుల్లో ఉన్నవారికి న్యాయ, వైద్య, ఆరోగ్యపరమైన సలహాలతో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తాం. యువతకు నైపుణ్యాల మెరుగుదల.. శిక్షణకు వచ్చే వారికి రెసిడెన్షియల్ పద్ధతిలో సౌకర్యాలు కల్పన.. అంబేడ్కర్ జీవి తం, సాహిత్యం పై తరగతులు, ముఖ్యమైన అం శాలపై పుస్తకాల ముద్రణ, పత్రికలు తీసుకొస్తాం. పథకాలపై అవగాహన... దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజలకు తెలిపి, వాటి అమల్లో విధానపరమైన లోపాలు, లోటుపాట్లపై అధ్యయనం జరుపుతాం. వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతాం. దళితులకు 3ఎకరాల పంపి ణీ, కల్యాణలక్ష్మి తదితర పథకాల వల్ల కలిగే ప్రయోజనం, వాటి అమల్లోని లోపాలపై పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తాం. దళితుల జీవితాల్లోని అన్ని పార్శ్వాలను తడిమి, వారికి అవసరమైన సహాయ, సహకారాలను అందించేందుకు మా వంతు కృషి చేస్తాం. -
జిల్లాకు మరో కృషి విజ్ఞాన కేంద్రం
కడప అగ్రికల్చర్ : జిల్లాకు మరో కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏఆర్ఎస్, కేవీఎస్, ఏరువాక కేంద్ర కో ఆర్డినేటర్లకు ఉత్తర్వులు అందాయి. ఇందుకు సంబంధించి జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో 50 ఎకరాలలో భూమిని సేకరించేలా చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ జి.కరుణసాగర్, కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ పద్మోదయ, ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ వీరయ్య జిల్లా కలెక్టర్ కేవీ రమణతో ఈ విషయమై శనివారం సమావేశమై చర్చించారు. రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాలలో ఉద్యాన తోటలు అధికంగా ఉన్నందున అక్కడ కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు భూ సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు వారు చర్చించినట్లు సమాచారం. జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో వ్యవసాయ పంటలు ఎక్కువగా పండిస్తుండటంతో ఆ ప్రాంతాలలో కేవీకే ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఏఆర్ఎస్, కేవీకే, ఏరువాక కో ఆర్డినేటర్లు కలెక్టర్‌కు విన్నవించినట్లు తెలిసింది. పంటల్లో వచ్చే తెగుళ్లు, చీడపీడల నివారణ, పంటల విస్తరణ, క్షేత్ర పంటల సాగు, రైతులు, మహిళా రైతులకు ఉపయోగపడేలా కార్యక్రమాలు, శిక్షణలు వంటివి కృషి విజ్ఞాన కేంద్రంలో ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండేసి కేవీకేలు ఉంటున్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007-08లో ఊటుకూరులో తొలి కృషి విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించి ప్రారంభించారు. రెండవ కేంద్రాన్ని మంజూరు చేసే సమయంలో ఆయన ఆకాల మృతి చెందారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జిల్లాకు రెండవ కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంజూరు చేసింది.