మహిళకు జీరో బిల్లు అందజేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి. పక్కన ఎన్పిడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, కలెక్టర్ గౌతమ్
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముదిగొండలో ‘గృహజ్యోతి’ ప్రారంభం.. జీరో బిల్లు జారీ
ముదిగొండ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పదిహేను రోజుల్లోగా అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ కేంద్రాల్లో నిపుణులైన అధ్యాపకులతో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉద్యోగ నియామకాల పరీక్షలను లీకేజీలు లేకుండా పారదర్శకంగా చేపడతామని తెలిపారు.
డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు బకాయిలు లేకుండా ప్రతినెలా వేతనాలు చెల్లిస్తామని వెల్లడించారు. గత పాలకులు రెసిడెన్షియల్ పాఠశాలలను ఇరుకు భవనాల్లో నడిపించగా, తాము తాజా బడ్జెట్‌లో సొంత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి, ఖజానా ఖాళీ చేయగా.. తాము ప్రతీపైసా పోగు చేసి ముందుకు సాగుతున్నామని, ఈ క్రమంలో ఇచ్చింన ప్రతీ హామీ నెరవేరుస్తామని భట్టి వెల్లడించారు.
గృహజ్యోతి ప్రారంభం
ముదిగొండలోని ఓ ఇంట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ మీటర్ రీడింగ్ తీసి గృహజ్యోతి పథకం ద్వారా జీరో బిల్లు అందజేశారు. ఈనెల నుంచి 200 యూనిట్లు వరకు విద్యుత్‌ను వినియోగించే వారు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈకార్యక్రమంలో ఎన్పిడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment