కడప అగ్రికల్చర్ : జిల్లాకు మరో కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏఆర్‌ఎస్, కేవీఎస్, ఏరువాక కేంద్ర కో ఆర్డినేటర్లకు ఉత్తర్వులు అందాయి. ఇందుకు సంబంధించి జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో 50 ఎకరాలలో భూమిని సేకరించేలా చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏఆర్‌ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ జి.కరుణసాగర్, కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ పద్మోదయ, ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ వీరయ్య జిల్లా కలెక్టర్ కేవీ రమణతో ఈ విషయమై శనివారం సమావేశమై చర్చించారు. రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాలలో ఉద్యాన తోటలు అధికంగా ఉన్నందున అక్కడ కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు భూ సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు వారు చర్చించినట్లు సమాచారం.
జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో వ్యవసాయ పంటలు ఎక్కువగా పండిస్తుండటంతో ఆ ప్రాంతాలలో కేవీకే ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఏఆర్‌ఎస్, కేవీకే, ఏరువాక కో ఆర్డినేటర్లు కలెక్టర్‌కు విన్నవించినట్లు తెలిసింది. పంటల్లో వచ్చే తెగుళ్లు, చీడపీడల నివారణ, పంటల విస్తరణ, క్షేత్ర పంటల సాగు, రైతులు, మహిళా రైతులకు ఉపయోగపడేలా కార్యక్రమాలు, శిక్షణలు వంటివి కృషి విజ్ఞాన కేంద్రంలో ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండేసి కేవీకేలు ఉంటున్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007-08లో ఊటుకూరులో తొలి కృషి విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించి ప్రారంభించారు. రెండవ కేంద్రాన్ని మంజూరు చేసే సమయంలో ఆయన ఆకాల మృతి చెందారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జిల్లాకు రెండవ కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంజూరు చేసింది.
జిల్లాకు మరో కృషి విజ్ఞాన కేంద్రం
Published Sun, Aug 17 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM
Advertisement