∙ప్రయోగం సక్సెస్... ప్రయాణమే ఇక మిగిలింది
డ్రైవర్ల అవసరం లేని కార్లు చూశాం. డ్రైవర్ లేని బస్సులు.. లారీలూ వచ్చేశాయి. ఇక మిగిలింది గాల్లో ఎగిరే వాహనాలు. ఈ కొరతనూ తీర్చేస్తోంది ‘ఎయిర్‌బస్’ సంస్థ. ఎగిరే కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఎలాగూ కొంత సమయం ఉందనుకుందో ఏమో.. ఈ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ వీఎస్‌ఆర్ 700 పేరుతో ఈమధ్యే ఓ అటానమస్.. అదేనండీ.. డ్రైవర్ల అవసరం లేని హెలికాప్టర్‌ను పరిచయం చేసింది. ఓ డమ్మీ పైలట్‌ను కూర్చోబెట్టి.. కేవలం సాఫ్ట్‌వేర్, కొంత హార్డ్‌వేర్ సాయంతో పైకి ఎగరడం మాత్రమే కాకుండా గాల్లోనే కొంతసేపు నిలకడగా ఉండేలా చేసింది..
ఆ తరువాత క్షేమంగా ల్యాండ్ చేసింది కూడా. ఫొటోలో చూపినట్లు ఉండే వీఎస్‌ఆర్ 700లో ఇద్దరు మాత్రమే ప్రయాణించవచ్చు. ఇంకోలా చెప్పాలంటే 250 కిలోల బరువును మాత్రమే మోసుకెళ్లగలదు. ఒకసారి గాల్లోకి ఎగిరితే పది గంటలపాటు ప్రయాణించేలా ఇంధన ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి దీన్ని మిలటరీ అవసరాలకు మాత్రమే వాడుకునే అవకాశముంది. ఇందుకు అనుగుణంగానే దీంట్లో బోలెడన్ని సెన్సర్లు, రాడార్లు ఏర్పాటు చేశారు. నేవీతోపాటు పదాతిదళంలోనూ శత్రు స్థావరాల సమాచార సేకరణకు, లక్ష్యాలను గుర్తించేందుకు దీన్ని వాడుకోవచ్చునని అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్