wav factor
-
ఒక్క సారికి వెయ్యి కిలోమీటర్లు!
ప్రపంచమంతా ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం పరుగులు పెడుతోంది కదా.. ఈ క్రమంలోనే పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలేవీ వాడకుండా కేవలం సౌరశక్తితో మాత్రమే నడిచే వాహనాల తయారీ కోసం జరిగిన తాజా ప్రయత్నం ఈ సోలార్ కారు. ఇప్పటివరకూ ఇలాంటివి ఎవరూ తయారు చేయలేదా అంటే చాలామంది చేశారు గానీ.. ఎప్పటికప్పుడు ఈ సోలార్ కార్లు తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి అనేందుకు ఐండ్హోవెన్ విశ్వవిద్యాలయ విద్యార్థులు తయారు చేసిన ఈ ‘స్టెల్లా వీ’ కారు తార్కాణం. పైకప్పుపై ఉన్న సోలార్ ప్యానెల్స్‌తోనే ఈ కారు వంద, రెండు వందలూ కాదు.. ఏకంగా వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించగలగడం సాధారణ విషయమేమీ కాదు కదా! మొత్తం ఐదు మంది కూర్చోగల స్టెల్లా వీ.. చూసేందుకు కొంచెం తేడాగానే కనిపిస్తుంది. పదహారు అడుగుల పొడవు.. దాదాపు ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. పైకప్పుపై మొత్తం 58 చదరపు అడుగుల విశాలమైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. సోలార్ కారు కదా.. అక్కడికక్కడ విద్యుత్తు ఉత్పత్తి చేసుకుని పరుగెత్తాలంటే కొంచెం కష్టమేమో అనుకుంటే మాత్రం మనం తప్పులో కాలేసినట్లే,. ఎందుకంటే స్టెల్లా వీ పరుగెత్తిన గరిష్ట వేగం గంటకు 128 కిలోమీటర్లు! అంతేకాదు.. ఈ కారులో కొన్ని స్మార్ట్ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులోని పార్కింగ్ నావిగేషన్ సిస్టమ్.. వీలైనంత వరకూ ఎక్కువ సూర్యరశ్మి సోకే ప్రాంతాన్ని ఎంచుకుని మరీ అక్కడే కారును పార్క్ చేస్తుంది. ప్రస్తుతం ఈ కారు ఆస్ట్రేలియాలో ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే బ్రిడ్జ్‌స్టోన్ వరల్డ్ సోలార్ చాలెంజ్ పోటీలో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ఈ పోటీ క్రూయిజర్ క్లాస్ విభాగంలో పాల్గొనాలంటే ఏ సోలార్ కారైనా ఆస్ట్రేలియాలో ఏకబిగిన దాదాపు 3000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. స్టెలా వీ దీన్ని పూర్తి చేస్తుందో లేదో చూడాలి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నా దారి.. అడ్డదారి..
♦ వావ్ ఫ్యాక్టర్ అపార్ట్మెంట్లలో... బహుళ అంతస్తుల భవనాల్లో ఉపయోగించే లిఫ్ట్‌లు తయారై 160 ఏళ్లు అవుతోంది.. అప్పటి నంచి ఇప్పటివరకూ వాటి డిజైన్‌లో వచ్చిన మార్పు దాదాపు శూన్యం. ఇప్పటివరకూ లిఫ్టులు బలమైన ఇనుప తాళ్ల సాయంతో పైకి, కిందకు తిరుగుతున్నాయి. అయితే భవిష్యత్తులో అడ్డంగానూ పరుగులు పెట్టడం ఖాయం అనిపిస్తోంది. అంత కచ్చితంగా ఎలా చెబుతారు అంటే.. పక్క ఫొటోలో చూడండి. వాస్తవానికి ఫొటోల్లో ఉన్నవి కూడా ఊహా చిత్రాలేగానీ.. జర్మనీకి చెందిన థైసెన్‌క్రుప్ కంపెనీ పుణ్యమా అని త్వరలోనే అడ్డంగానూ పరుగులు పెట్టే లిఫ్ట్‌లు నిజరూపం దాల్చనున్నాయి. తాము ఇలాంటి లిఫ్ట్‌లను తయారు చేస్తున్నట్లు థైసన్‌క్రుప్ మూడేళ్ల క్రితమే ప్రకటించింది. దాదాపు 807 అడుగుల ఎత్తైన టవర్ ఒకదాన్ని కట్టేసి దాంట్లో ఈ కొత్త రకం లిఫ్ట్‌లను పరీక్షించింది కూడా. మల్టీ అని పిలుస్తున్న వీటిల్లో బలమైన తాళ్లకు బదులు శక్తిమంతమైన అయస్కాంతాలు ఉంటాయి. వీటికి అతుక్కుని, లీనియర్ మోటార్ల సాయంతో లిఫ్ట్ క్యాబిన్ ప్రయాణిస్తుందన్నమాట. నిట్టనిలువుగా పైకి వెళుతూనే అవసరమైన సందర్భంలో పక్కలకూ వెళ్లేలా భవనంలోని కొన్ని ప్రాంతాల్లో చక్రాల్లాంటి ఏర్పాట్లు ఉండటం ఈ కొత్త లిఫ్ట్ టెక్నాలజీలో కీలకం. ఈ చక్రం లిఫ్ట్‌ను ఒక దిశ నుంచి ఇంకో దిశకు మారుస్తుంది. థైసన్‌క్రుప్ నిర్మించిన ప్రయోగాత్మక టవర్‌లో దాదాపు పన్నెండు మల్టీ లిఫ్ట్‌లు ఉన్నాయి. ఒకొక్కటి గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. మల్టీ లిఫ్ట్‌ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని థైసన్‌క్రుప్ అంటోంది. మరింత విశాలమైన లిఫ్ట్‌లను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఏకకాలంలో అనేక లిఫ్ట్‌లు పనిచేసేలా చేయవచ్చునని కంపెనీ అంటోంది. మరింత ఎత్తైన భవంతులు కట్టేందుకూ ఈ లిఫ్ట్‌లు దోహదపడతాయని.. భవనంలోని ఏ మూలకైనా మల్టీ లిఫ్ట్‌ద్వారా వెళ్లిపోవచ్చు కాబట్టి.. అందులో నివసించే వారికీ ఇది అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. జర్మనీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తమ కొత్త భవనంలో మల్టీ లిఫ్ట్‌ను వాడేందుకు రెడీ అవుతోంది కాబట్టి.. ఈ ప్రయోజనాలు ఎంతవరకూ నిజమో త్వరలోనే తెలిసిపోనుంది!! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చేతికి పెట్టుకుంటే షుగర్ ఎంతుందో చెప్పేస్తుంది!
ఈయనగారి చేతికున్నది వాచీ అనుకుంటున్నారా? కానేకాదు. మధుమేహంతో బాధపడుతున్నవారికి కాసింత ఉపశమనాన్ని ఇచ్చే హైటెక్ గాడ్జెట్. దీన్ని చేతికి బిగించుకుంటే మీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సూదులతో గుచ్చుకుని రక్త పరీక్షలు చేసుకునే అవసరాన్ని తప్పించేందుకు డల్లాస్‌లోని టెక్సస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ శాలినీ ప్రసాద్ సిద్ధం చేశారు దీన్ని. చర్మంపైన స్వేద బిందువుల్లో ఉండే కార్టిసోల్, గ్లూకోజ్, ఇంటర్‌ల్యూకిన్–6 పదార్థాల మోతాదును లెక్కించేందుకు ఇందులో సూక్ష్మమైన సెన్సర్లు ఏర్పాటు చేశారు. వీటిద్వారా ఎప్పటికప్పుడు రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను తెలుసుకోవచ్చు. అయితే వారానికి ఒకసారి కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ గాడ్జెట్‌ను మళ్లీమళ్లీ వాడుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా టైప్–2 మధుమేహంతో బాధపడేవారికి దీన్ని చౌకగా అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏడాదిలోపు ఇది మార్కెట్లోకి వస్తుందని అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆటుపోట్లతో కరెంటు
ఊహూ... ఫొటోలో ఉన్నది నీటమునిగిన పురాతన నిర్మాణం కానే కాదు. సూపర్ హైటెక్. సముద్రపు అలల్లోని శక్తిని కరెంటుగా మార్చేస్తుంది. చూసేందుకు కొంచెం చిత్రంగా అనిపిస్తున్నా సముద్ర శక్తిని విద్యుత్తుగా మార్చేందుకు ఇదే భేషైన మార్గం అంటున్నారు నెదర్లాండ్స్‌కు చెందిన వాటర్‌స్టూడియో శాస్త్రవేత్తలు. పార్థీనియన్ అని పిలుస్తున్న ఈ సరికొత్త టెక్నాలజీతో ఇంకో ఉపయోగమూ ఉంది. నౌకాశ్రయాల్లో ఆటుపోట్లతో కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తాయి ఇవి. దీంట్లోని ఒక్కో స్తంభం మూడు అడుగుల వ్యాసముంటుంది. సముద్రపు అలల శక్తికి గిర్రున తిరుగుతుంది. ఈ క్రమంలో పుట్టే శక్తిని.. పార్థీనియన్ పైభాగంలో ఉన్న ప్రత్యేకమైన ఏర్పాటు ద్వారా విద్యుత్తుగా మారుస్తారు. ఆటు.. పోటు రెండింటికీ స్తంభాలు రెండువైపులకూ తిరగగలవు కాబట్టి రోజంతా విద్యుదుత్పత్తి సాధ్యమవుతుందన్నమాట. వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువ అవుతున్న ఈ కాలంలో కాలుష్యం లేకుండా విద్యుత్తు ఉత్పత్తి చేయగల ఇలాంటి టెక్నాలజీల అవసరం చాలానే ఉంది.– సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నో వాలెట్
పెద్ద పెద్ద రెస్టారెంట్లలో, హోటళ్లలో ‘వాలెట్ పార్కింగ్’ ఉంటుంది. కారు దిగగానే వాళ్లే వచ్చి కారుని పార్కింగ్ ప్లేస్‌లో పెట్టేస్తారు. దీన్నే వాలెట్ పార్కింగ్ అంటారు. అయితే ఇకముందు ఆ పనిని రోబోలు చేయబోతున్నాయి. ఫొటోలో ఉన్న రోబోను చూడండి. ఇదేం చేస్తుందో తెలుసా? షాపింగ్‌మాల్స్, ఎయిర్‌పోర్ట్‌లు, ఇతర ప్రాంతాల్లో ఆటోమేటిక్‌గా కార్లను పార్క్ చేస్తుంది. మాల్కెళితే లేదా ఎయిర్‌పోర్ట్‌కు వెళితే కారు పార్క్ చేసేందుకే బోలెడు సమయం పడుతుంది కదా.. పైగా ఒక్కో వాహనం ఒక్కో తీరుగా పార్క్ చేసి ఉండటం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఈ చికాకులన్నింటికీ విరుగుడుగా ఫ్రాన్స్‌కు చెందిన స్టాన్లీ రోబోటిక్స్ అనే సంస్థ ఈ వాలెట్ పార్కింగ్ రోబోను అభివృద్ధి చేసింది. పార్కింగ్ స్థలం ముఖద్వారం వద్ద మనం మన కారును వదిలేసి వచ్చేస్తే చాలు.. మిగిలిన పనంతా ఈ స్టాన్ రోబోనే చూసుకుంటుంది. శక్తిమంతమైన ప్లాట్‌ఫామ్ సాయంతో కారు చక్రాలను పైకిలేపడం.. వాహనం మొత్తాన్ని భద్రంగా ప్లాట్‌ఫామ్‌పైకి చేర్చి... ఖాళీ పార్కింగ్ స్థలం వరకూ మోసుకెళ్లడం.. పార్క్ చేసిన తరువాత ఇంకో కారును తీసుకొచ్చేందుకు వెళ్లడం ఇదీ స్టాన్ రోబో పనితీరు. వాహనం తాలూకూ వివరాలను స్కాన్ చేయడం ద్వారా మళ్లీ మన కారును మనకు తెచ్చిస్తుంది కూడా. ఫ్రాన్స్ రాజధాని పారిస్ విమానాశ్రయంలో ప్రస్తుతం దీన్ని పైలట్ పద్ధతిలో పరీక్షించి చూస్తున్నారు. ఇంకో విషయం. ఇతర వాలెట్ పార్కింగ్‌ల మాదిరిగా డ్రైవర్‌కు టిప్ ఇవ్వాల్సిన అవసరమూ ఉండదు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వావ్ ఫ్యాక్టర్: నో పైలట్
డ్రైవర్ల అవసరం లేని కార్లు చూశాం. డ్రైవర్ లేని బస్సులు.. లారీలూ వచ్చేశాయి. ఇక మిగిలింది గాల్లో ఎగిరే వాహనాలు. ఈ కొరతనూ తీర్చేస్తోంది ‘ఎయిర్‌బస్’ సంస్థ. ఎగిరే కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఎలాగూ కొంత సమయం ఉందనుకుందో ఏమో.. ఈ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ వీఎస్ఆర్ 700 పేరుతో ఈమధ్యే ఓ అటానమస్.. అదేనండీ.. డ్రైవర్ల అవసరం లేని హెలికాప్టర్‌ను పరిచయం చేసింది. ఓ డమ్మీ పైలట్‌ను కూర్చోబెట్టి.. కేవలం సాఫ్ట్వేర్, కొంత హార్డ్‌వేర్ సాయంతో పైకి ఎగరడం మాత్రమే కాకుండా గాల్లోనే కొంతసేపు నిలకడగా ఉండేలా చేసింది.. ఆ తరువాత క్షేమంగా ల్యాండ్ చేసింది కూడా. ఫొటోలో చూపినట్లు ఉండే వీఎస్ఆర్ 700లో ఇద్దరు మాత్రమే ప్రయాణించవచ్చు. ఇంకోలా చెప్పాలంటే 250 కిలోల బరువును మాత్రమే మోసుకెళ్లగలదు. ఒకసారి గాల్లోకి ఎగిరితే పది గంటలపాటు ప్రయాణించేలా ఇంధన ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి దీన్ని మిలటరీ అవసరాలకు మాత్రమే వాడుకునే అవకాశముంది. ఇందుకు అనుగుణంగానే దీంట్లో బోలెడన్ని సెన్సర్లు, రాడార్లు ఏర్పాటు చేశారు. నేవీతోపాటు పదాతిదళంలోనూ శత్రు స్థావరాల సమాచార సేకరణకు, లక్ష్యాలను గుర్తించేందుకు దీన్ని వాడుకోవచ్చునని అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పేరుకే మినీ... పనులు సో మెనీ!
కరెంటు పోయింది. కొవ్వొత్తి వెలిగించాలి. టార్చ్‌లైట్ కోసం వెతుకుతాం. ఇది ఒకప్పుడు. కరెంటు పోయింది. నో కొవ్వొత్తి.. నో టార్చ్‌లైట్.. సెల్‌ఫోన్ ‘వెలిగిస్తాం’. ఇది ఇప్పుడు. ఈ టైమ్‌లో.. ‘టార్చ్లైట్లండీ... టార్చ్‌లైట్లూ...’ అంటూ ఎవరైనా మన వీధిలో గానీ, ఆన్లైన్లో గారీ అరిస్తే కొంటామా? అసలు వింటామా? ఊహు! కానీ మాది అలాంటిలాంటి టార్చ్‌లైట్ కాదు అంటోంది ఓ ఫారిన్ కంపెనీ. విషయం ఏంటంటే.. టార్చ్లైట్నీ, ఫ్లాష్లైట్నీ కలిపి హాంకాంగ్‌లోని ‘విక్డ్ లేజర్స్’ కంపెనీ ఓ ఫ్లాష్టార్చ్ని తయారు చేసింది. దానికి ‘ఫ్లాష్టార్చ్ మినీ’ అని పేరు పెట్టింది. మన ఇళ్లలో వాడే సాధారణ ఎల్.ఇ.డి. బల్బులు వెదజల్లే కాంతి సామర్థ్యం 470 లూమెన్లు అయితే, ఈ ఫ్లాష్ లైట్ 2,300 లూమెన్ల కాంతి శక్తితో కళ్లను జిగేల్మనిపిస్తుంది. టార్చ్ పొడవు ఎనిమిదిన్నర అంగుళాలు. బరువు పావు కిలో. చక్కగా బ్యాక్ పాకెట్లోనూ పట్టేస్తుంది. ‘బాబోయ్ ఇన్ని లూమెన్లను వెనుక జేబులో పెట్టుకుని తిరుగుతుంటే ఏమైనా ఉందా! పొరపాటున స్విచాన్ అయిపోతే బతుకు స్విచాఫ్ ఐపోదూ!’ అని కంగారు పడక్కర్లేదు. దానిష్టం వచ్చినప్పుడు వెలగకుండా, మన ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే వెలిగేందుకు ‘లాక్’ ఉంటుంది. అదేం పెద్ద విషయం కాదు కానీ, దీని వెలుగులో ఫుట్‌బాల్ ఆడేయొచ్చు. దీని వేడితో గుడ్డును ఉడకబెట్టుకుని, ఎగ్ కర్రీ కూడా చేసుకోవచ్చు! కాగితాలు సరేసరి. కొన్ని క్షణాలు లైట్‌ని ఫోకస్ చేసి ఉంచితే భగ్గుమంటాయి. మరి.. ఇంత లైట్ ఉంటే లెన్సులు, రిఫ్లెక్టర్ కరిగి, మాడి, మసైపోవా? పోవు. అన్నీ హీట్ రెసిస్టెంట్. వేడిని తట్టుకునేలా వాటిని తయారుచేశారట. అంతేకాదు, ఎంత కావాలో అంత కాంతి మాత్రమే వచ్చేలా టార్చ్లోపల మూడు స్థాయిలలో సెట్టింగులు ఉంటాయి. బ్యాటరీతో ఏకబిగిన గంటపాటు పనిచేస్తుంది. బ్యాటరీని బయటికి తీయక్కర్లేకుండానే రీచార్చ్ చేసుకోవచ్చు. ధర 200 డాలర్లు. అంటే.. 13 వేల 600 రూపాయలు. ‘ఓర్నాయనో అంత ధరా అనిపించవచ్చు కానీ.. ఆ మాత్రం ‘ఫ్లాష్’కి ఈ మాత్రం క్యాష్ తప్పదు’ అంటోంది విక్డ్ లేజర్స్ కంపెనీ.