కారును ఎప్పటికప్పుడు రీచార్జ్ చేస్తుండే సోలార్ ప్యానల్స్
ప్రపంచమంతా ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం పరుగులు పెడుతోంది కదా.. ఈ క్రమంలోనే పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలేవీ వాడకుండా కేవలం సౌరశక్తితో మాత్రమే నడిచే వాహనాల తయారీ కోసం జరిగిన తాజా ప్రయత్నం ఈ సోలార్ కారు. ఇప్పటివరకూ ఇలాంటివి ఎవరూ తయారు చేయలేదా అంటే చాలామంది చేశారు గానీ.. ఎప్పటికప్పుడు ఈ సోలార్ కార్లు తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి అనేందుకు ఐండ్‌హోవెన్ విశ్వవిద్యాలయ విద్యార్థులు తయారు చేసిన ఈ ‘స్టెల్లా వీ’ కారు తార్కాణం.
పైకప్పుపై ఉన్న సోలార్ ప్యానెల్స్‌తోనే ఈ కారు వంద, రెండు వందలూ కాదు.. ఏకంగా వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించగలగడం సాధారణ విషయమేమీ కాదు కదా! మొత్తం ఐదు మంది కూర్చోగల స్టెల్లా వీ.. చూసేందుకు కొంచెం తేడాగానే కనిపిస్తుంది. పదహారు అడుగుల పొడవు.. దాదాపు ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. పైకప్పుపై మొత్తం 58 చదరపు అడుగుల విశాలమైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. సోలార్ కారు కదా.. అక్కడికక్కడ విద్యుత్తు ఉత్పత్తి చేసుకుని పరుగెత్తాలంటే కొంచెం కష్టమేమో అనుకుంటే మాత్రం మనం తప్పులో కాలేసినట్లే,. ఎందుకంటే స్టెల్లా వీ పరుగెత్తిన గరిష్ట వేగం గంటకు 128 కిలోమీటర్లు! అంతేకాదు.. ఈ కారులో కొన్ని స్మార్ట్‌ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఇందులోని పార్కింగ్ నావిగేషన్ సిస్టమ్.. వీలైనంత వరకూ ఎక్కువ సూర్యరశ్మి సోకే ప్రాంతాన్ని ఎంచుకుని మరీ అక్కడే కారును పార్క్ చేస్తుంది. ప్రస్తుతం ఈ కారు ఆస్ట్రేలియాలో ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే బ్రిడ్జ్‌స్టోన్ వరల్డ్ సోలార్ చాలెంజ్ పోటీలో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ఈ పోటీ క్రూయిజర్ క్లాస్ విభాగంలో పాల్గొనాలంటే ఏ సోలార్ కారైనా ఆస్ట్రేలియాలో ఏకబిగిన దాదాపు 3000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. స్టెలా వీ దీన్ని పూర్తి చేస్తుందో లేదో చూడాలి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్