భారీ ఎత్తు అపార్ట్‌మెంట్‌లలో నిలువుగానూ, అడ్డంగానూ వెళ్ల గల లిఫ్టుల నమూనాలివి. త్వరలోనే ఈ లిఫ్టులు రూపుదాల్చబోతున్నాయి.
♦ వావ్ ఫ్యాక్టర్
అపార్ట్మెంట్లలో... బహుళ అంతస్తుల భవనాల్లో ఉపయోగించే లిఫ్ట్‌లు తయారై 160 ఏళ్లు అవుతోంది.. అప్పటి నంచి ఇప్పటివరకూ వాటి డిజైన్‌లో వచ్చిన మార్పు దాదాపు శూన్యం. ఇప్పటివరకూ లిఫ్టులు బలమైన ఇనుప తాళ్ల సాయంతో పైకి, కిందకు తిరుగుతున్నాయి. అయితే భవిష్యత్తులో అడ్డంగానూ పరుగులు పెట్టడం ఖాయం అనిపిస్తోంది. అంత కచ్చితంగా ఎలా చెబుతారు అంటే.. పక్క ఫొటోలో చూడండి. వాస్తవానికి ఫొటోల్లో ఉన్నవి కూడా ఊహా చిత్రాలేగానీ.. జర్మనీకి చెందిన థైసెన్‌క్రుప్ కంపెనీ పుణ్యమా అని త్వరలోనే అడ్డంగానూ పరుగులు పెట్టే లిఫ్ట్‌లు నిజరూపం దాల్చనున్నాయి. తాము ఇలాంటి లిఫ్ట్‌లను తయారు చేస్తున్నట్లు థైసన్‌క్రుప్ మూడేళ్ల క్రితమే ప్రకటించింది. దాదాపు 807 అడుగుల ఎత్తైన టవర్ ఒకదాన్ని కట్టేసి దాంట్లో ఈ కొత్త రకం లిఫ్ట్‌లను పరీక్షించింది కూడా. మల్టీ అని పిలుస్తున్న వీటిల్లో బలమైన తాళ్లకు బదులు శక్తిమంతమైన అయస్కాంతాలు ఉంటాయి.
వీటికి అతుక్కుని, లీనియర్ మోటార్ల సాయంతో లిఫ్ట్ క్యాబిన్ ప్రయాణిస్తుందన్నమాట. నిట్టనిలువుగా పైకి వెళుతూనే అవసరమైన సందర్భంలో పక్కలకూ వెళ్లేలా భవనంలోని కొన్ని ప్రాంతాల్లో చక్రాల్లాంటి ఏర్పాట్లు ఉండటం ఈ కొత్త లిఫ్ట్ టెక్నాలజీలో కీలకం. ఈ చక్రం లిఫ్ట్‌ను ఒక దిశ నుంచి ఇంకో దిశకు మారుస్తుంది. థైసన్‌క్రుప్ నిర్మించిన ప్రయోగాత్మక టవర్‌లో దాదాపు పన్నెండు మల్టీ లిఫ్ట్‌లు ఉన్నాయి. ఒకొక్కటి గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. మల్టీ లిఫ్ట్‌ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని థైసన్‌క్రుప్ అంటోంది. మరింత విశాలమైన లిఫ్ట్‌లను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఏకకాలంలో అనేక లిఫ్ట్‌లు పనిచేసేలా చేయవచ్చునని కంపెనీ అంటోంది. మరింత ఎత్తైన భవంతులు కట్టేందుకూ ఈ లిఫ్ట్‌లు దోహదపడతాయని.. భవనంలోని ఏ మూలకైనా మల్టీ లిఫ్ట్‌ద్వారా వెళ్లిపోవచ్చు కాబట్టి.. అందులో నివసించే వారికీ ఇది అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. జర్మనీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తమ కొత్త భవనంలో మల్టీ లిఫ్ట్‌ను వాడేందుకు రెడీ అవుతోంది కాబట్టి.. ఈ ప్రయోజనాలు ఎంతవరకూ నిజమో త్వరలోనే తెలిసిపోనుంది!! – సాక్షి నాలెడ్జ్ సెంటర్