kobbarimatta
-
హాట్ స్టార్‌తో సంపూ
సెటైరికల్ డైలాగులతో సంపూర్నేష్ బాబు సునామీలా దూసుకొచ్చిన ‘సింగం 123’ విడుదలై ఏడాదిపైనే అయ్యింది. ఆ సినిమా తర్వాత ‘కొబ్బరిమట్ట’లో హీరోగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో సినిమాలో సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. భవానీ మస్తాన్ దర్శకత్వంలో హాట్ స్టార్ పూనమ్ పాండే ప్రధాన పాత్రధారిగా ఫకృద్దీన్ ఖాన్, విజయ్‌భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమాలో సంపూ అతిథి పాత్రలో నటిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న ఈ సినిమాలో సంపూ క్యారెక్టర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఈ నెలాఖరున ముంబైలో సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది. తెలుగు, హిందీ భాషల్లో చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు. ఆశిష్ విద్యార్థి, తాగుబోతు రమేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: ఆనెం వెంకటరావు. -
'కొబ్బరి మట్ట'తో మరింత దగ్గరవుతా: సంపు
హైదరాబాద్: దసరా పండక్కి రాబోతున్న 'కొబ్బరిమట్ట' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానని హృదయ కాలేయం సినిమా హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు. సికింద్రాబాద్ సోమసుందరం వీధిలోని కొత్త ఎల్లయ్య మెమోరియల్ హైస్కూల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. 'కొబ్బరిమట్ట' చిత్రంలో త్రిపాత్రాభినం చేస్తున్నానని ఇందులో తాను పాపారాయుడు, పెద్ద రాయుడు, ఆండ్రాయుడు పాత్రలతో అలరించనున్నట్లు చెప్పారు. ఏడుగురు హీరోయిన్లు ఇందులో ఉండటం ప్రత్యేకత అన్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలతో పాటు కామెడీ కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పారు. హృదయ కాలేయం, సింగం 123 చిత్రాలతో చాలా మంది అభిమానుల్ని సంపాదించుకున్నానని.. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరింత ఆదరిస్తారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. దసరా పండుగకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి మూడు పాత్రల్లో కనిపించడం తనకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని అన్నారు. -
లక్ష 'లైకు'ల లక్షణమైన హీరో
ఒకప్పుడు సినిమాల్లో అవకాశం రావడమనేది అంత సులువైన విషయం కాదు. ఒకవేళ వచ్చినా ఏ చిన్నా చితకా పాత్రలో మాత్రమే. హీరోలవ్వడం అనేది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వస్తే తప్ప అంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు. కొంచెం అటూ ఇటుగా, ఇదే పరంపర ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలాంటి సినీ ప్రపంచంలోకి ఏ మాత్రం సినీ సంబంధంలేని ఒక నటుడు వచ్చి కేవలం హీరో మాత్రమే కాదు ఏకంగా స్టార్ అయి చూపించాడు. అతడే 'హృదయ కాలేయం' సినిమా హీరో సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ ఇంత పెద్ద స్టార్ అవ్వడానికి కారణాలేవైనా.. అతన్ని జనాలకు దగ్గర చేసింది మాత్రం సోషల్ మీడియానే. చిత్రీకరణే మొదలవ్వకముందు విడుదల చేసిన సంపూ ఫోటోలు.. ఆ తర్వాత రాజమౌళి ట్వీట్‌తో సంచలనం సృష్టించాయి. తదనంతరం ఆ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం ఒక సంచలనమే. సినిమా విడుదలయ్యాక కూడా అదే పరంపర కొనసాగడంతో సంపూకు తిరుగులేకుండా పోయింది. గత కొంత కాలంగా 'ఫేస్బుక్'లో తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ వారికి మరింత దగ్గరయిన సంపూర్ణేష్ బాబు.. తాజాగా మరో సంచలనానికి తెర లేపాడు. తన అఫీషియల్ ఫేస్బుక్ ఎకౌంట్లో లక్షకు పై చిలుకు లైక్‌లతో దూసుకుపోతున్నాడు. ప్రతీ పోస్ట్‌కి చివర్లో, 'సదా మీ ప్రేమకు బానిసను' అని చెప్పుకునే సంపూ.. తనపై వచ్చే విమర్శలను కూడా చాలా ఓపికతో, సహృదయంతో ఎదుర్కొనే వ్యక్తిత్వంతో ముందుకు సాగిపోతున్నాడు. ఇలా తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నసంపూర్ణేష్ బాబు మున్ముందు ఇంకెన్ని సంచలనాలకు కేంద్ర బిందువవుతాడో వేచి చూడాలి. -
బెజవాడకు రుణపడి వుంటా: సంపూర్ణేష్
విజయవాడ : హృదయ కాలేయం చిత్రానికి తాము ఊహించిన దానికంటే ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చిందని చిత్ర హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా హీరో సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ.. తాను హీరోగా నటించిన తొలిచిత్రానికి ఇంతటి ఆదరణ లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఓ వైపు అగ్రహీరో చిత్రం విడుదలైనప్పటికీ ‘ హృదయ కాలేయం’ చిత్రం కలెక్షన్లు తగ్గలేదన్నారు. ప్రేక్షకులు చూపించిన ఆదరణను తానెపుడూ మరచిపోలేనన్నారు. త్వరలో తన రెండో చిత్రం ‘ కొబ్బరి మట్ట ’ షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఐలాపురం హోటల్లో శుక్రవారం చిత్రం విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆ కార్యక్రమంలో పాల్గొంది. కాగా హీరోయిన్ కావ్యకుమారి మాట్లాడుతూ.. తొలి చిత్రం విజయవంతం కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ ప్రేక్షకుల రుణం తీర్చుకోలేమన్నారు. దర్శకుడు సాయిరాజేష్ మాట్లాడుతూ.. కథ బాగుంటే చిన్న చిత్రాలనైనా ఆదరిస్తామని ప్రేక్షకులు రుజువు చేశారన్నారు. చిన్న హీరోలు అగ్రహీరోల డైలాగులు చెబితే వచ్చే కామెడీని ప్రేక్షకులకు అందించేందుకే ఈ చిత్రం తెరకెక్కించామని, ఏ హీరోని విమర్శించే ఉద్దేశం తమకు లేదన్నారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో విలన్‌గా నటించిన కె.సురేష్, దుర్గాఫిలింస్ అధినేత తుమ్మల రామ్మోహనరావు పాల్గొన్నారు.