ఉత్తమ్ పద్మావతిపై చెప్పులు, కోడిగుడ్లతో దాడి
మునగాల: నల్లగొండ జిల్లా కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉత్తమ్ పద్మావతిపై సీపీఎం కార్యకర్తలు ఆదివారం చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మునగాల మండలం నర్సింహులగూడెం వెళ్లారు. అక్కడ ఇటీవల హత్యకు గురైన సీపీఎం నాయకుడు సతీమణి విజయలక్ష్మి పద్మావతిని ఆపింది.
తమ గ్రామంలో కాంగ్రెస్, సీపీఎం పార్టీల మధ్య ఘర్షణలు ఆపాలని నీ భర్త ఉత్తమ్ ఇరుపార్టీల మధ్య రాజీ కుదిర్చిన తర్వాత కూడా... కాంగ్రెస్ వాళ్లు తన భర్త పులీందర్రెడ్డిని ఎందుకు హత్య చేశారని, దీనిపై వివరణ ఇవ్వాలని నిలదీసింది. ఈ క్రమంలో కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఘర్షణను నివారించేందుకు వాహనంపై ఉన్న పద్మావతి కిందకు దిగింది.
ఈ దశలో సీపీఎం కార్యకర్తలు చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలతో దాడికి దిగారు. ఈలోగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. పద్మావతిని నర్సింహులగూడెంలో ప్రచారం నిర్వహించకుండా పక్క గ్రామమైన జగన్నాథపురం తరలించారు.