‘డబుల్’ రైడర్స్
రెండో సారి ఐపీఎల్ విజేతగా కోల్‌కతా
ఫైనల్లో 3 వికెట్లతో పంజాబ్‌పై గెలుపు కింగ్స్ ఎలెవన్‌కు తీవ్ర నిరాశ
మనీశ్ పాండే అద్భుత ఇన్నింగ్స్
సాహా సెంచరీ వృథా
పైజ్మనీ
కోల్‌కతా: రూ. 15 కోట్లు
పంజాబ్: రూ. 10 కోట్లు
18904 ఈ సీజన్ ఐపీఎల్లో మొత్తం పరుగులు
3 నమోదైన సెంచరీలు
671 సీజన్లో మొత్తం వికెట్లు
36 అత్యధిక వ్యక్తిగత సిక్సర్లు (మ్యాక్స్‌వెల్)
కోల్‌కతా మళ్లీ సాధించింది...రెండేళ్లనాటి అద్భుత ప్రదర్శనను పునరావృతం చేసింది. సీజన్ ఆరంభంలో పేలవంగా ఆడిన గంభీర్ సేన... టోర్నీ ద్వితీయార్ధంలో సంచలన ఆటతీరు కనబరచింది. ప్రత్యర్థి భారీ స్కోరు చేసినా బెదరకుండా... ఆత్మవిశ్వాసంతో ఆడి షారుఖ్‌కు మరో టైటిల్‌ను కానుకగా అందించింది.
రెండు కొదమసింహాల్లాంటి జట్ల మధ్య జరిగిన భారీ స్కోర్ల పోరాటంలో పంజాబ్ చేతులెత్తేసింది. సాహా అద్భుతమైన సెంచరీ చేసినా ప్రీతి జింటా టైటిల్ కరవును తీర్చలేకపోయాడు. ఫైనల్లో కోల్‌కతా గెలిచినా... రెండు జట్ల పోరాటంతో క్రికెట్ అభిమానులు మాత్రం చివరి వరకూ నరాలు తెగే ఉత్కంఠను అనుభవించారు.
బెంగళూరు: మూడు వారాల క్రితం... ఈ సీజన్ ఐపీఎల్లో సగం మ్యాచ్‌లు ముగిశాక... కోల్‌కతా టైటిల్ గెలుస్తుందని ఎవరైనా అంటే అదో పెద్ద జోక్. తాము ప్లే ఆఫ్‌కు చేరడమే గొప్ప అని ఆ జట్టు కెప్టెన్ స్వయంగా చెప్పిన పరిస్థితి. అలాంటి కోల్‌కతా మ్యాజిక్ చేసింది. వరుసగా 9వ మ్యాచ్‌లో గెలిచి ఔరా అనిపించింది.
ఇన్నాళ్లూ గెలిచిన మ్యాచ్‌లు ఒకెత్తయితే... ఈసారి ఫైనల్లో పంజాబ్‌ను ఓడించడం మరో ఎత్తు. వరుసగా రెండు సార్లు కోల్‌కతా చేతిలో ఓడి కసి మీదున్న పంజాబ్ తమ సర్వశక్తులూ ఒడ్డి భారీ స్కోరు సాధించినా... సమష్టి మంత్రంతో రాణించిన నైట్‌రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్-7 విజేతగా నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో... టాస్ గెలిచిన గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది.
వృద్ధిమాన్ సాహా (55 బంతుల్లో 115 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. మనన్ వోహ్రా (52 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా మూడు బంతుల ముందే మ్యాచ్ ముగించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మనీశ్ పాండే (50 బంతుల్లో 94; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ ప్రదర్శనతో పాటు యూసుఫ్ పఠాన్ (22 బంతుల్లో 36; 4 సిక్సర్లు) మెరుపులతో ఆ జట్టు 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు సాధించింది. 2012లో ఐపీఎల్ టోర్నీ నెగ్గిన కోల్‌కతా రెండో సారి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకొని చెన్నైతో సమంగా నిలవడం విశేషం.
‘ఆహా’ అనిపించాడు
గత మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించిన సెహ్వాగ్ (7)తో పాటు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన కెప్టెన్ బెయిలీ (1)ని ఆరంభంలోనే అవుట్ చేసి కోల్‌కతా ఆధిక్యం ప్రదర్శించింది. మోర్కెల్, షకీబ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడింది.
ఈ దశలో వోహ్రా, సాహా భాగస్వామ్యం జట్టును నిలబెట్టింది. ఆరంభంలో కొంత తడబడ్డా నిలదొక్కుకున్నాక చెలరేగిపోయారు. ముఖ్యంగా నరైన్ వేసిన 14వ ఓవర్లో 19 పరుగులు...మోర్కెల్ వేసిన తర్వాతి ఓవర్లో 20 పరుగులు రాబట్టడంతో పంజాబ్ వేగం పుంజుకుంది. ఈ క్రమంలో సాహా 29 బంతుల్లో, వోహ్రా 42 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
ముఖ్యంగా సాహా గతంలో ఎప్పుడూ చూడని దూకుడు ప్రదర్శించాడు. ఏ బౌలర్‌ను లెక్క చేయకుండా అద్భుతమైన షాట్లతో కింగ్స్ ఎలెవన్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కోల్‌కతా ప్రధాన బలమైన నరైన్ బౌలింగ్‌లో 18 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 35 పరుగులు బాదాడు.
129 పరుగుల భారీ భాగస్వామ్యం అనంతరం వోహ్రా వెనుదిరిగినా...తన జోరు కొనసాగిస్తూ సాహా 49 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో ఫైనల్ మ్యాచ్‌లో నమోదైన తొలి సెంచరీ ఇదే.
తొలి పది ఓవర్లలో 58 పరుగులే చేయగలిగిన కింగ్స్ ఎలెవన్...తర్వాతి పది ఓవర్లలో ఏకంగా 141 పరుగులు చేయడం విశేషం.
పాండే ప్రతాపం
సూపర్ ఫామ్‌లో ఉన్న ఉతప్ప (5)ను నాలుగో బంతికే అవుట్ చేసిన జాన్సన్, పంజాబ్ శిబిరంలో ఆనందం నింపాడు. అయితే గంభీర్ (17 బంతుల్లో 23; 3 ఫోర్లు), పాండే జోడి కలిసి కోల్‌కతాను నిలబెట్టారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడుతూ పరుగుల వేగం తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. పవర్ ప్లేలో జట్టు స్కోరు 59 పరుగులకు చేరగా...ఆ తర్వాతి బంతికే గంభీర్ వెనుదిరిగాడు.
అయితే మనీశ్ పాండే తన ఐపీఎల్ కెరీర్లోనే కీలక ఇన్నింగ్స్ ఆడి రైడర్స్‌ను రేసులో నిలబెట్టాడు. స్వేచ్ఛగా ఆడుతూ ప్రతీ బౌలర్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ క్రమంలో 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరో వైపు యూసుఫ్ పఠాన్ మెరుపులు కోల్‌కతాను విజయానికి చేరువ చేశాయి. పఠాన్, షకీబ్ (12), డస్కటే (4) అవుటైనా, పాండే జోరు తగ్గలేదు. భారీ సిక్సర్లు కొట్టిన అతను మరో షాట్‌కు ప్రయత్నించి అవుట్ కావడంతో కొద్ది సేపు ఉత్కంఠ నెలకొంది. అయితే చావ్లా (13 నాటౌట్) నిలబడి సూపర్ ఫోర్‌తో జట్టును గెలిపించాడు.
స్కోరు వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) గంభీర్ (బి) ఉమేశ్ 7; వోహ్రా (సి) అండ్ (బి) చావ్లా 67; బెయిలీ (బి) నరైన్ 1; సాహా (నాటౌట్) 115; మ్యాక్స్‌వెల్ (సి) మోర్కెల్ (బి) చావ్లా 0; మిల్లర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 199.
వికెట్ల పతనం: 1-23; 2-30; 3-159; 4-170.
బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-40-0; ఉమేశ్ యాదవ్ 4-0-39-1; నరైన్ 4-0-46-1; షకీబ్ 4-0-26-0; చావ్లా 4-0-44-2;
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) పటేల్ (బి) జాన్సన్ 5; గంభీర్ (సి) మిల్లర్ (బి) కరణ్వీర్ 23; పాండే (సి) బెయిలీ (బి) కరణ్వీర్ 94; పఠాన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) కరణ్ వీర్ 36; షకీబ్ (రనౌట్) 12; డస్కటే (సి) మిల్లర్ (బి) కరణ్వీర్ 4; యాదవ్ (సి) వోహ్రా (బి) జాన్సన్ 5; చావ్లా (నాటౌట్) 13; నరైన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.3 ఓవర్లలో 7 వికెట్లకు) 200.
వికెట్ల పతనం: 1-6; 2-59; 3-130; 4-156; 5-168; 6-179; 7-187.
బౌలింగ్: జాన్సన్ 4-0-41-2; బాలాజీ 4-0-41-0; అవానా 3.3-0-43-0; కరణ్వీర్ 4-0-54-4; అక్షర్ పటేల్ 4-0-21-0.
మ్యాన్ ఆఫ్ ద ఫైనల్:
మనీష్‌పాండే (కోల్‌కతా)
అత్యంత విలువైన ఆటగాడు:
మ్యాక్స్‌వెల్ (పంజాబ్)
ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు):
ఉతప్ప (కోల్‌కతా, 660 పరుగులు)
పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్ల):
మోహిత్ శర్మ (చెన్నై, 23 వికెట్లు)
ఎమర్జింగ్ క్రికెటర్: అక్షర్ పటేల్ (పంజాబ్)
ఫెయిర్ ప్లే అవార్డు: చెన్నై సూపర్ కింగ్స్
ఉత్తమ క్యాచ్: పొలార్డ్ (ముంబై)
మూడు సార్లు ఐపీఎల్ గెలిచిన తొలి క్రికెటర్
యూసుఫ్ పఠాన్. 2008లో రాజస్థాన్, 2012, 14లలో కోల్‌కతాలో పఠాన్ సభ్యుడు.