Kollywood Categories Talk
-
నిర్మాతగా మీనా?
ఒక సంచలన వార్త చిత్ర పరిశ్రమలో హల్చల్ చేస్తోంది. మీనా బహుభాషా నటి అన్న విషయం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంలో రజనీకాంత్,కమలహాసన్, శరత్‌కుమార్ ఇలా ప్రముఖ నటులందరితోనూ జతకట్టారు. అలాగే తెలుగులో చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్స్ అందరి సరసన నటించారు. ఇప్పటికీ అడపాదడపా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఆ మధ్య తెలుగులో దృశ్యం చిత్రంలో వెంకటేశ్‌కు భార్యగా ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించిన విషయం విదితమే. తాజాగా తన వారుసురాలిని బాల నటిగా రంగంలోకి దింపారు. మీనా కూతురు నైనికా తెరి చిత్రంలో విజయ్‌కు కూతురిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇలా ఒక పక్క నటిస్తూ, మరో పక్క తన వారసురాలి సినీ పయనానికి బాటలు వే స్తూ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్న మీనా తాజాగా నిర్మాతగా అవతారమెత్తడానికి రంగం సిద్ధం చేస్తున్నారన్నది తాజా సమాచారం. తమిళం,తెలుగు భాషల్లో భారీ చిత్రాలను నిర్మించడానికి సన్నద్ధం అవుతున్నారనిచిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం. ప్రారంభంలోనే విశ్వనాయకుడు కమలహాసన్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబులతో చిత్రాలు నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ముందుగా బ్యానర్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. -
నాతో నటించాలని.. ఆశ ఉంటే అలా చేయండి!
ప్రతిభను పక్కన పెడితే(ఎందుకంటే ఇప్పుడది చాలామందిలో ఉండదు కనుక. చాలా మంది కథానాయికలు గ్లామర్‌నే నమ్ముకుంటున్నారు కనుక) అదృష్టంతో అందలమెక్కిన వారి మాట చెల్లుబాటు అవుతుందన్నది చాలాసార్లు నిరూపణ అయ్యింది. ఇక నటి నయనతార విషయానికి వస్తే ఆమెకు అందంతో పాటు అభినయం మెండన్నది చెప్పక తప్పదు. అందాలారబోతలోనూ అందే వేసిన నయనతార నటిగా సెకెండ్ ఇన్నింగ్‌లోనూ నంబర్‌వన్ స్థానంలో వెలుగొందుతున్నారు. టాప్ స్టార్‌తోనే కాదు, వర్ధమాన హీరోలతోనూ నటిస్తూ విజయాలు అందుకుంటున్నా నయనతార ఇప్పటి వరకూ క్రేజ్‌తో పాటు పారితోషికాన్ని పెంచుకుంటూ వచ్చారు. తాజాగా తన ప్రియుడికి సిపార్సు చేయడానికి తన స్థాయిని వాడుకుంటున్నారనే ప్రచారం చిత్ర పరిశ్రమలో జోరందుకుంది. విషయం ఏమిటంటే ఇటీవల మాయ, తనీఒరువన్, నానూ రౌడీదాన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన నయనతార ఈ చిత్రాలలో రెండింటిలో వర్ధమాన నటులతోనే నటించారు. కాగా నాను రౌడీదాన్ చిత్రం విజయం తరువాత ఆ చిత్ర జంట అయిన విజయ్ సేతుపతి, నయనతారలతో ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం చిత్రం చేయడానికి ప్రయత్నించినట్లు ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి కాల్షీట్స్ కేటాయించే విషయమై నయనతార ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కాగా తనీఒరువన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఆ చిత్ర దర్శకుడు మోహన్‌రాజా శివకార్తీకేయన్‌తో చిత్రం చేయడానికి రేడీ అవుతున్నట్లు తెలిసింది. ఇందులో నయనతారను హీరోయిన్గా ఎంపిక చేయాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా నటి నయనతార శికార్తీకేయన్కు ఫోన్ చేసి మీకు నాతో నటించాలన్న ఆశ ఉంటే విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో నటించండి అని చెప్పినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. అంతే కాదు ఈ బ్యూటీ మంత్రం బాగానే పని చేసిందనీ ఇప్పుడు ఆమె బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివ దర్శకత్వంలో శివకార్తీకేయన్ నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అంతే కాదు విజయ్‌సేతుపతిని పక్కన పెట్టే యుక్తిలోనూ నయనతార సఫలం అయ్యారనే ప్రచారం జోరందుకుంది. అన్నట్టు ఈ భామ చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్లోకి రీఎంట్రీ అయ్యారు. ప్రముఖ నటుడు వెంకటేశ్ సరసన బాబు బంగారం అనే చిత్రంలో నటిస్తున్నారు. శ్రీరామరాజ్యం చిత్రం తరువాత నయనతార నటిస్తున్న తెలుగు చిత్రం ఇదేనన్నది గమనార్హం.