ప్రజల మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ
కొండా లక్ష్మణ్ బాపూజీ అనే పేరు సమస్త ఉద్యమాలకు చిరునామా. నిజాం వ్యతిరేక ఉద్యమం, వందేమాతరం ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, సహకార ఉద్య మం, దళిత బహుజన ఉద్యమం. ఇలా తెలంగాణ గడ్డపై చెలరేగిన ఉద్యమ రూపాలన్నింటికీ అండగా, జెండాగా నిలిచారాయన. 16 ఏళ్ల చిరుప్రాయం లో మొదలుపెట్టిన ఉద్యమ జీవితాన్ని 97 ఏళ్ల పండువయసులో ముగించారు. జీవితమంతా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కృషి చేశారు. తుదిశ్వాస విడిచేవరకూ తెలంగాణ సాధనే లక్ష్యంగా పోరాడారు. జీవిత మలిసంధ్యలో వయోభారాన్ని లెక్క చేయకుండా ఎక్కడ తెలంగాణ టెంట్ మొలిస్తే అక్కడ ప్రత్యక్షమవుతూ యువతకు స్ఫూర్తినిచ్చారు. చారిత్రక నైజాం వ్యతిరేక పోరాటం నుంచి ఇటీవలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాకా రాష్ట్ర రాజకీయా ల్లో బాపూజీ తనదైన ముద్ర వేశారు.
ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో నిరుపేద చేనేత కుటుంబంలో కొండా లక్ష్మణ్ 1915 సెప్టెంబర్ 27న జన్మించారు. 16వ ఏట 1930లో బొంబాయి రాష్ట్రం లోని చాందా పట్టణంలో మహాత్మాగాం ధీ చేసిన ప్రసంగంతో ప్రభావితుడై తన తెల్ల షరాయిని గాంధీ టోపీగా కుట్టుకుని ధరించారు. 1940లో ఆంధ్రమహాసభ లో చేరారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ఆబిడ్స్ పోస్టాఫీసుపై, కోఠీలోని బ్రిటిష్ రెసిడెన్సీపై జాతీయజెండా ఎగురవేసి సంచలనం కలిగించారు.
నిజాం రాజును అంతమొందిస్తే తప్ప హైద్రా బాద్ ప్రజలకు విముక్తి లేదని భావించిన బాపూజీ ఉస్మాన్ ఆలీఖాన్‌పై బాంబుదాడికి వ్యూహం రచిం చారు. 1947 డిసెంబర్ 4న ఆ ప్రయత్నం కొద్దిలో తప్పిపోగా బాంబు విసిరిన నారాయణరావు పవా ర్ను అక్కడికక్కడే నిర్బంధించి ఉరిశిక్ష, ఇతరులకు జైలుశిక్ష విధించారు. నిజాం హత్యకు కుట్రను రూపొందించాడని కొండా లక్ష్మణ్‌ను ప్రాసిక్యూట్ చేశారు. క్రిమినల్ లాయర్‌గా కూడా పేరుపొందిన బాపూజీ.. తెలంగాణ రైతాంగ సాయు ధ పోరాటంలో నిర్బంధితులైన నేతలకు ఉచిత న్యాయ సహాయం చేశారు.
స్వాతంత్య్రానంతరం పార్లమెంట రీ ప్రజాస్వామ్యంలో మచ్చలేని నేతగా సేవలందించారు. ఎంపీగా, ఉపసభాప తిగా, మంత్రిగా, సహకారోద్యమ పిత గా, బహుజన నేతగా, తెలంగాణ ఉద్యమ నాయకు నిగా సేవలందించారు. 1952లో తొలిసారిగా అసి ఫాబాద్ ద్విసభ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం ప్రారంభించారు. తర్వాత కాలంలో కమ్యూనిస్టుల కంచుకోట నల్లగొండజిల్లాలోని వేర్వేరు నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు విధానసభకు ఎన్నికయ్యారు. 1957 లో విధానసభ డిప్యూటీ స్పీకర్‌గా, సంజీవయ్య, బ్రహ్మానందరెడ్డిల మంత్రివర్గంలో క్యాబినెట్ మం త్రిగా సేవలందించారు.
తొలినాళ్లలో సమైక్యవాదిగా విశాలాంధ్ర ఆవిర్భావానికి మద్దతునిచ్చారు. కానీ ఆంధ్రా పాలకుల తెలంగాణ వ్యతిరేక విధానాలు, ముల్కీ నిబంధనల అమలులో వైఫల్యం, ప్రాంతాల మధ్య ఆర్థిక ఆంతరాలను స్వయంగా ఎదుర్కొన్న బాపూజీ తన పూర్వ అభిప్రాయాలను మార్చుకుని 1969 నాటికి మంత్రిపదవికి రాజీనామా ఇచ్చి మరీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిం చారు. రాష్ట్రం రెండు ప్రాంతాలుగా విడిపోవాలే తప్ప తెలుగు ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు, వైషమ్యాలు ఉండరాదని ఆనాడే కోరుకున్నారు. 1996లో మొదలైన మలిదశ ఉద్యమానికి కూడా ఊతకర్రగా నిలిచారు.
2001లో టీఆర్ఎస్ ఏర్పడిన ప్పుడు దాన్ని నిండుమనసుతో ఆహ్వానించి తన నివాసం జలదృశ్యంలోనే దానికి పురుడు పోశారు. తెలంగాణ రాష్ట్రసాధన కొరకు కరడుగట్టిన సమైక్య వాది లగడపాటి రాజగోపాల్‌తో కూడా చర్చలు జరి పిన అజాతశత్రువాయన. ఆయన స్వప్నం సాకార మైంది. ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదు బతుకు తెలంగాణ కావాలి. ఆత్మహత్యల తెలంగాణ వద్దు. ఆత్మగౌరవ తెలంగాణ కావాలి. శతజయంతి సందర్భంగా వారికి శతకోటి జోహార్లు.
(27న కొండాలక్ష్మణ్ బాపూజీ శతజయంతి)
వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్
పాలమూరు విశ్వవిద్యాలయం, 98492 83056
- డా॥వంగరి భూమయ్య