Konda Polam Movie
-
మహేశ్.. ప్రభాస్‌లా నాకూ చేయాలని ఉంది: వైష్ణవ్ తేజ్
‘‘మా మామయ్యలు (చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్), అన్నయ్య (సాయితేజ్)కు ప్రేక్షకుల్లో ఇమేజ్ రావడం చూశాను. కానీ నాకో ఇమేజ్ వస్తే ఎలా రియాక్ట్ రావాలో ఆలోచించలేదు. ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు అందరూ నన్ను చూస్తుంటే బిడియంగా ఉంటుంది’’ అన్నారు హీరో వైష్ణవ్ తేజ్. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. ‘బిబో’ శ్రీనివాస్ సమర్పణలో జె. సాయిబాబు, వై. రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ చెప్పిన విశేషాలు. ► క్రిష్‌గారి సినిమాలన్నా, మేకింగ్ అన్నా నాకు చాలా ఇష్టం. ‘వేదం, గమ్యం’ సినిమాలు బాగా నచ్చాయి. క్రిష్‌గారు ఫోన్ చేసినప్పుడు సినిమా కోసమని అనుకోలేదు. పైగా అప్పటికి నా ‘ఉప్పెన’ విడుదల కాలేదు. నేను ఆయన ఇంటికి వెళ్లాక ‘కొండపొలం’ కథ చెప్పారు. నా రెండో సినిమాకే క్రిష్ వంటి సీనియర్‌తో పని చేసే అవకాశం రావడం సంతోషంగా అనిపించింది. ► ‘కొండపొలం’ అనే అంశమే కొత్తది. నేనెప్పుడూ వినలేదు. క్రిష్‌గారు కొత్త కథ చెప్పాలనుకున్నారు.. పైగా నాకూ కథ కొత్తగా అనిపించడంతో ఒప్పుకున్నాను. ఈ సినిమా కోసం కొండలు ఎక్కేవాళ్లం, రెండు మూడు కిలోమీటర్లు నడిచేవాళ్లం. అదేం పెద్ద కష్టంగా అనిపించలేదు. అయితే ఎండలో రోజంతా మాస్కులు పెట్టుకుని చేయడం కష్టంగా అనిపించింది. ఏమీ లేని స్థాయి నుంచి ఎన్నో కష్టాలను దాటుకుని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదగడమే ‘కొండపొలం’ కథ. అడవితో, అక్కడ ఉన్న ఓబులమ్మతో ప్రేమలో పడతాడు. ఈ కథ, పాత్రలు చాలా కొత్తగా అనిపిస్తాయి. పెద్ద హీరోల సినిమాలు చూసినప్పుడు నాకూ అలాంటి కమర్షియల్ కథలు చేయాలనిపిస్తుంది. ప్రభాస్, మహేశ్‌బాబు అన్నల్లా నాక్కూడా కొట్టాలనిపిస్తుంది (సినిమాలో విలన్లను). మా ఫ్యామిలీకి కూడా నన్ను అలా చూడటం ఇష్టం. అదే సమయంలో కొత్త పాత్రలు చేయాలనిపిస్తుంది. ► ‘కొండపొలం’ కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్స్ చేయలేదు. కొన్ని పదాలు మాత్రం యాసలోనే మాట్లాడాలని క్రిష్‌గారు చెప్పారు.. అలానే చేశాను. నా రెండో సినిమాకే కీరవాణిగారితో పని చేయడం నా అదృష్టం. ► కథకు తగ్గట్టు సినిమా తీశారా? లేదా? అని ఇప్పుడే చెప్పేంత అనుభవం నాకు లేదు. నా నటన గురించి నేను జడ్జ్ చేసుకోవడం కంటే దర్శకుడు, ప్రేక్షకులు చెబితేనే బాగుంటుంది. కొన్నిసార్లు బాగా చేశామని మనసు చెబుతుంది.. అలాంటప్పుడు మానిటర్ చూస్తాను. ఓటీటీ ఆఫర్లు వస్తే నటిస్తాను. ప్రస్తుతానికి గిరి సాయితో (తమిళ ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు) ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రం తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ సినిమా ఉంటుంది. ‘రిపబ్లిక్’ చిత్రంలో అన్నయ్య ఐఏఎస్‌గా చేశారు. ‘కొండపొలం’ మూవీలో నేను ఐఎఫ్ఎస్. ‘రిపబ్లిక్, కొండపొలం’ సినిమాకు సంబంధం ఉండదు. అన్నయ్య బాగున్నారు.. భయపడాల్సిన పనిలేదు. ఫిజియోథెరపీ జరుగుతోంది.. త్వరలోనే ఆస్పత్రి నుంచి బయ టకు వస్తారు. అడవిలో ఎక్కువ రోజులు షూటింగ్ చేయడంతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా మనకు అడవి ఎంతో ఆక్సిజన్‌ను ఇస్తుంది. అలాంటి అడవుల్లో ఎక్కువగా చెత్త వేయకూడదనిపించింది. ‘కొండపొలం’ షూటింగ్లో మొదట్లో గొర్రెల భాషను అర్థం చేసుకోలేకపోయాను. తల పొట్టేలు నడిచినట్టుగానే మిగతా గొర్రెలు కూడా నడుస్తాయి. వాటికి ఇష్టమైన పచ్చళ్లతో వాటిని కంట్రోల్ చేశాం. -
ఛాలెంజింగ్ పాత్రలు ఇష్టం
‘‘కొన్ని సన్నివేశాలకో, పాటలకే పరిమితం అయ్యే పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నాను.. అందుకే సెలెక్టివ్‌గా ఉంటున్నాను. ఓబులమ్మ పాత్ర నన్ను ఎగై్జట్ చేయడంతో ‘కొండపొలం’ సినిమా చేశాను’’ అని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్‌రెడ్డి, జె.సాయిబాబు నిర్మించిన ఈ సినిమా రేపు(8న) విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రకుల్ ప్రీత్‌సింగ్ పంచుకున్న విశేషాలు... ► ‘కొండపొలం’ కథ చెప్పేందుకు క్రిష్‌గారు ఇంటికి వచ్చినప్పుడు నేను షార్ట్, టీషర్ట్‌లో ఉన్నాను. ‘చాలా యంగ్‌గా ఉన్నావ్.. వైష్ణవ్ తేజ్ పక్కన యంగ్ గర్ల్ కావాలనుకున్నా.. అలాగే ఉన్నావ్’ అంటూ క్రిష్‌గారు ఎగై్జట్ అయ్యారు. ఆయన కథ చెబుతున్నప్పుడే వెంటనే ఓకే చెప్పేశాను. గొర్రెల కాపర్ల గురించి ‘కొండపొలం’ లాంటి చిత్రం ఇంత వరకూ ఇండియాలో రాలేదు. ► ‘కొండపొలం’ లో పూర్తిస్థాయిలో గొర్రెలు కాసే పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. అడవిలో గొర్రెలను కంట్రోల్ చేయడానికి నేను, వైష్ణవ్ మొదట్లో చాలా కష్టపడ్డాం. అయితే షూటింగ్ స్టార్ట్ చేసిన నాలుగైదు రోజుల్లోనే ఎలా కంట్రోల్ చేయాలో తెలిసింది. ► ‘కొండపొలం’ చూడటానికి ఈజీగా ఉంటుంది. కానీ, షూట్ చేయడం చాలా కష్టమైంది. కీరవాణిగారి సంగీతం అద్భుతంగా ఉంది. ► ఈ నెల 10న నా పుట్టినరోజు. అయితే ఆ రోజు ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం లేదు. షూటింగ్లో ఉంటాను. ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఏదీ అంగీకరించలేదు. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు కూడా చేయాలని ఉంది. కరణం మల్లీశ్వరీ బయోపిక్ చేస్తున్నాననే వార్తల్లో వాస్తవం లేదు. ► నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. కానీ మనం ఒక్క సినిమా చేస్తే అది జీవితాంతం ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవాలి. ఒక డీడీఎల్జే (దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే), ఒక ‘బాహుబలి’ లాంటి సినిమాలు చేస్తే చాలనిపిస్తోంది. అలాంటి కేటగిరిల్లో ‘కొండపొలం’ కూడా ఉంటుందని నమ్ముతున్నాను. సాయి తేజ్‌తో నేరుగా మాట్లాడలేదు. వైష్ణవ్ తేజ్ నుంచి తేజు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. -
కొండపొలం ప్రీ రిలీజ్ ఈవెంట్
-
ఫిల్మ్ మేకింగ్‌లో నాకు నచ్చింది అదే!
‘‘దర్శకులంతా కలిసినప్పుడు పుస్తకాల గురించి చర్చించుకుంటాం. అలా కరోనా సమయంలో ఓసారి డైరెక్టర్స్ అందరం కలిసినప్పుడు ‘కొండపొలం’ నవల గురించి ఇంద్రగంటి మోహనకృష్ణ, సుకుమార్ గార్లు చెప్పడంతో చదివాను.. బాగా నచ్చడంతో సినిమాగా తీశా’’ అని దర్శకుడు క్రిష్ అన్నారు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై. రాజీవ్‌రెడ్డి, జె. సాయిబాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా క్రిష్ చెప్పిన విశేషాలు. ►సాహసం నేపథ్యంలో ఓ కథ చెప్పాలనుకున్నాను. ఆ సమయంలో ‘సప్తభూమి, కొండపొలం’ పుస్తకాలు చదివా. ‘కొండపొలం’ బాగా నచ్చడంతో ఆ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిని కలిసి హక్కులు తీసుకున్నాం. ‘కొండపొలం’ హక్కులు కొన్నావా? అని సుకుమార్ అడిగారు. నేను తీసుకున్నానని చెప్పడంతో వదిలేశారు. లేకుంటే ఆయన తీసుకోవాలనుకున్నారు. ‘సప్తభూమి’ నవల హక్కులు కొనేందుకు ట్రై చేశాం.. కానీ కుదరలేదు. ►రచయితకు విపరీతమైన పరిధి ఉంటుంది. పుస్తకం రాయడం వేరు.. సినిమాగా తీయడం వేరు. సన్నపురెడ్డి ‘కొండపొలం’ అద్భుతమైన కథ.. స్క్రీన్‌ప్లే చక్కగా ఉంటుంది. ఆ కథలో ఓబులమ్మ పాత్ర ఉండదు. కానీ దానికి అందమైన ప్రేమకథను జోడిస్తే బాగుంటుందని ఓబులమ్మ పాత్రను క్రియేట్ చేశాం. దాన్ని సన్నపురెడ్డికి చెప్పాను.. ఆయనే ఈ సినిమాకు కథనం రాయడం వల్ల నాకు సులభం అయ్యింది. ►వైష్ణవ్‌ను తన పదో తరగతి అప్పుడో ఇంటర్లోనో చూశాను. ‘కొండపొలం’ అనుకున్నప్పుడు తనను ఓ పార్టీలో చూశా. అప్పటికింకా తన ‘ఉప్పెన’ చిత్రంలోని ‘నీ కళ్లు నీలి సముద్రం..’ పాట రాలేదనుకుంటాను. ఆ పాట చూడమన్నాడు.. చూడగానే వైష్ణవ్ తేజ్ కళ్లు బాగా అట్రాక్ట్ చేశాయి. కొండపొలం’లో రవీంద్ర పాత్రకు వైష్ణవ్ తేజ్ సరిపోతాడనిపించింది. వైష్ణవ్‌ని ఇంటికి పిలిపించి సినిమా గురించి చెప్పాను. వైష్ణవ్‌కి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే యాటిట్యూడ్ ఉండదు. నేర్చుకోవాలనే తపన ఎంతో ఉంది.. అందుకే ‘ఉప్పెన’, ‘కొండపొలం’ లాంటి కథలు ఎంచుకున్నాడు. ►ఓబులమ్మ పాత్రకు రకుల్ ప్రీత్ సరిపోతారని కెమెరామేన్ జ్ఞానశేఖర్ చెప్పారు. ఈ కథను రకుల్‌కు చెబుతున్నప్పుడే ఆమె హావాభావాలు చూసి ఈ పాత్రకు సరిపోతుందనుకున్నాను. తనకూ కథ నచ్చడంతో పాత్ర కోసం మరింత సన్నబడింది. ►గొర్రెలను అడవులకు తీసుకెళ్తే పులులు వస్తాయని గోవాలో షూటింగ్‌కి పర్మిషన్ ఇవ్వలేదు. నల్లమలలో తీద్దామనుకుంటే కోవిడ్ వల్ల కుదరలేదు. అందుకే వికారాబాద్ అడవుల్లో చేశాం. కొండపై దాదాపు 1000 గొర్రెలతో షూటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఉదయం 6:30 గంటలకే అందరం సెట్స్‌లో ఉండేవాళ్లం. ఈ సినిమా చూస్తుంటే మనం కూడా గొర్రెల కాపరిలా భావిస్తాం.. అంతలా కథలో లీనమవుతాం. ►‘కొండపొలం’ కోసం సంగీత దర్శకునిగా ముందుగా కీరవాణిగారి తనయుడు కాలభైరవకి ఫోన్ చేశాను. ‘కొండపొలం’ చదివి కీరవాణిగారు ఎగై్జట్ అయ్యారు. మీ కంటే ముందు ఓ మ్యూజిక్ డైరెక్టర్‌కు ఫోన్ చేశానని కీరవాణిగారికి చెప్పడంతో ఎవరు? అన్నారు. కాలభైరవ అంటే నవ్వారు. ‘ఎవరు కావాలో నువ్వే తేల్చుకో?’ అనడంతో ‘మీరే కావాలి’ అన్నాను. ∙ఫిల్మ్ మేకింగ్‌లో నాకు నచ్చింది రచనే. ఇప్పుడు నేను హాట్ స్టార్‌కు ఓ కథ రాస్తున్నాను. నేను చేసే ప్రతి సినిమా ఓ కొత్త అధ్యాయంలా ఉంటే ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ‘అతడు అడవిని జయించాడు’ స్ఫూర్తితో వెంకటేశ్‌గారితో అడవి నేపథ్యంలో సినిమా చేయాల్సింది... కానీ కుదర్లేదు. -
కొండపొలం ఆడియో లాంచ్ ఈవెంట్ ఫోటోలు
-
దేశం గర్వపడేలా చేసే కుర్రాడి కథ ఇది: వైష్ణవ్ తేజ్
‘‘నేను సినిమా తీసింది ఒకెత్తు అయితే.. కీరవాణిగారి సంగీతం మరో ఎత్తు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కీరవాణిగార్లు అద్భుతమైన పాటలు రాశారు. ఆత్మన్యూనత భావం ఉన్న రవీంద్ర అనే యువకుడు తనకు దక్కాల్సినదాన్ని ఎలా సాధించుకున్నాడు అనేది కథ. రాజీవ్ వల్లే ఇలాంటి సినిమాలు తీయగలుగుతున్నాను’’ అన్నారు క్రిష్. వైష్ణవ్ తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కొండపొలం’. ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో జరిగిన ఆడియో విడుదల వేడుకలో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘అద్భుతమైన సంగీతాన్ని అందించిన కీరవాణిగారే ఈ రోజు హీరో. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవలను తెరపైకి తీసుకుని వచ్చేందుకు క్రిష్ చాలా కష్టపడ్డారు. ఎప్పుడూ తలెత్తుకుని దేశం గర్వపడేలా చేయాలని క్రిష్ చెబుతుంటారు. తలెత్తుకుని ఉంటూ దేశం గర్వపడేలా చేయాలనుకునే ఓ కుర్రాడి కథ ఇది’’ అన్నారు. ‘‘అపనమ్మకం ఉన్నప్పుడు పాడుకునేలా ఈ చిత్రంలో ఓ మంత్రాన్ని (రయ్...రయ్..) కంపోజ్ చేశాను’’ అని కీరవాణి అన్నారు. ‘‘కీరవాణిగారితో మళ్లీ సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు రాజీవ్‌రెడ్డి. ‘‘నల్లమల అడవుల్లో నలభై రోజులు ఉండి, అక్కడి సంఘటనలతో ‘కొండపొలం’ నవల రాశాను. రాయలసీమ కథ సినిమాగా రావడం మనకెంతో గర్వకారణం. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కథ అని ఆలోచిస్తారు. ఒకటి రెండు శాతమే ఉండే ఫ్యాక్షన్‌ను తీసేసి 98 శాతం ఉండే రైతులు, గొర్రెల కాపర్లు, అట్టడుగువర్గాల వారి కష్టాల గురించి చెప్పే కథ ఇది’’ అన్నారు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొండపొలం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల
Shwaasalo Lyrical Video From Kondapolam: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఓ..ఓ ఓబులమ్మా సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాటని విడుదల చేశారు. ‘శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశ. ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా’అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కీరవాణి సంగీతం అందించినీ పాటను యామిని ఘంటసాల, పీవీఎస్ఎన్ రోహిత్ ఆలపించారు. ఈ పాటలో వైష్ణవ్, రకుల్ మధ్య కెమిస్ట్రీని ఆసక్తికరంగా చూపించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
వైష్ణవ్ తేజ్ ‘కొండ పొలం’ మూవీ స్టిల్స్
-
పండగ సందడి: ద‘సరదా’ షురూ
సినీప్రియులకు పండగ ఎప్పుడంటే బోలెడన్ని సినిమాలు విడుదలైనప్పుడు. పండగలప్పుడు సినిమా రిలీజుల సందడి, పండగ సందడితో డబుల్ ఆనందం దక్కుతుంది. అయితే గత ఏడాది దసరా పండగ సినీ లవర్స్‌ని నిరుత్సాహపరిచింది. థియేటర్ల లాక్డౌన్ వల్ల గత దసరాకి సినిమాలు విడుదల కాలేదు. ఈ దసరాకి సరదా షురూ అయింది. దసరా ఆరంభం నుంచి ముగిసే వరకూ ఈ నవరాత్రికి అరడజను సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలేంటో చూద్దాం. ఉద్యోగం వేటలో అలసిపోయిన రవీంద్ర యాదవ్ జీవితం ఆటలోనైనా గెలవాలని గొర్రెల కాపరిగా కొండపొలం వెళతాడు. అక్కడ ఓబులమ్మతో ప్రేమలో పడతాడు. అసలు కథ అక్కడే మొదలవుతుంది. అడవిలోని క్రూరమైన జంతువులతో పాటు హానికరమైన మనుషులతో కూడా రవీంద్ర యాదవ్ పోరాడాల్సి వస్తుంది. మరి.. ఈ పోరాట ఫలితం ఏంటి? అనేది థియేటర్స్‌లో తెలుస్తుంది. కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ తేజ్, ఓబులమ్మ పాత్రలో రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొండపొలం’. ‘కొండపొలం’లో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ సన్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రచించిన ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. బిబో శ్రీనివాస్ సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదల కాగా, దేవీ నవరాత్రులు మొదలైన మరుసటి రోజు.. అంటే అక్టోబరు 8న ‘కొండపొలం’ థియేటర్స్‌లోకి వస్తుంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఇక నెల్సన్ దర్శకత్వంలో తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘డాక్టర్’ చిత్రం తెలుగులో ‘వరుణ్ డాక్టర్’గా అక్టోబరు 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కోటపాడి జె. రాజేష్ ఈ చిత్రానికి నిర్మాత. ‘డాక్టర్’లో శివకార్తికేయన్ అమ్మాయిల కిడ్నాప్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రియాంకా అరుల్ మోహనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వినయ్‌రాయ్, యోగిబాబు, మిళింద్ తదితరులు కీలక పాత్రధారులు. మరోవైపు ‘ఆర్ ఎక్స్ 100’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్‌ల క్రేజీ కాంబినేషన్లో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘మహాసముద్రం’ కూడా పండగకి వస్తోంది. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావ్ హైదరీ హీరోయిన్లు. ఒక అమ్మాయి ప్రేమ, ఇద్దరు అబ్బాయిల జీవితాలను ఎలా మార్చింది? అనే అంశంతో ఈ సినిమా కథనం సాగుతుంది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 14న విడుదల కానుంది. దసరాకి ‘ఎనిమి’గా థియేటర్స్‌లోకి వస్తున్నాడు విశాల్. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్య మరో హీరో. స్నేహితుడి నమ్మకద్రోహం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. ‘ఎనిమీ’లో విశాల్, ఆర్య ఇక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కూడా దూసుకొస్తున్నాడు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కానుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో పూజా హెగ్డే, అఖిల్ పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చిన ఓ ఎన్ఆర్ఐ కుర్రాడు, స్టాండప్ కమెడియన్ అయిన ఓ అమ్మాయి కోసం ఏం చేశాడు? అనే అంశం ఆధారంగా ఈ చిత్ర కథనం సాగుతుంది. మరోవైపు ఇదే రోజు ‘వరుడు కావలెను’ అంటూ థియేటర్స్‌కు వస్తున్నారు హీరోయిన్ రీతూ వర్మ. నాగశౌర్యనే ఈ వరుడు. ‘వరుడు కావలెను’ లో రీతూవర్మ వీరి కల్యాణం పెళ్లి పీటలపైకి వెళ్లే క్రమంలో జరిగే సంఘటనల డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య డైరెక్టర్. ఈ సినిమాలే కాకుండా వేరే సినిమాలు కూడా దసరా రిలీజ్ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. మరి.. ఈ విజయ దశమికి ప్రేక్షకులు ఏ చిత్రానికి విజయాన్ని అందిస్తారో? ఎవరి దశను తిప్పుతారో చూడాలి. -
ఆర్ఆర్ఆర్ వాయిదా.. దసరా రేసులో యంగ్ హీరోలు!
RRR Movie Postponed: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ చెబుతూ వచ్చారు. దీనికి తగ్గట్లుగానే ప్రతి పోస్టర్ లోనూ అదే తేదీని వేస్తూ సినీ అభిమానుల్లో ఆశ కల్పించారు. కాని ప్రస్తుత పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని వాయిదా వేయనున్నట్టు టాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. అందుకే దసరా రేసులో కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. అక్టోబర్ 8న కొండపొలం రిలీజ్ చేస్తున్నట్లు క్రిష్ ప్రకటించాడు.రిలీజ్ డేట్ లాక్ చేసిన వెంటనే, ప్రమోషన్ స్టార్ట్ చేసాడు.మూవీ నుంచి ఓబులమ్మ ఫుల్ వీడియో సాంగ్ రిలీజైంది.ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఇప్పుడు కొండపొలంకు పోటీగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కూడా అక్టోబర్ 8న రిలీజ్ అవుతోంది. గతేడాది సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా చాలా కాలంగా పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తోంది. గీతా ఆర్డ్స్ నిర్మిస్తున్న ఈ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ లో ఫస్ట్ బిగ్ హిట్ కోసం ట్రై చేస్తున్న అఖిల్ ఈ మూవీపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. టాలీవుడ్ హ్యాపెనింగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 14న శర్వానంద్, సిద్ధార్ద్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ ‘మహా సముద్రం’విడుదల కానుంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదితీరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ రేస్ నుంచి తప్పుకుందనే రూమర్స్‌కే ఇన్ని సినిమాలు దసరా సీజన్ కు ఖర్చీఫ్ వేస్తోంటే, ఒకవేళ అఫీసియల్ ఎనౌన్స్ మెంట్ వస్తే మాత్రం మరిన్ని భారీ చిత్రాలు బాక్సాఫీస్ రిలీజ్ కన్ ఫామ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.