వెంకటరామిరెడ్డి, క్రిష్, కీరవాణి, వైష్ణవ్, సాయిచంద్, రాజీవ్
‘‘నేను సినిమా తీసింది ఒకెత్తు అయితే.. కీరవాణిగారి సంగీతం మరో ఎత్తు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కీరవాణిగార్లు అద్భుతమైన పాటలు రాశారు. ఆత్మన్యూనత భావం ఉన్న రవీంద్ర అనే యువకుడు తనకు దక్కాల్సినదాన్ని ఎలా సాధించుకున్నాడు అనేది కథ. రాజీవ్ వల్లే ఇలాంటి సినిమాలు తీయగలుగుతున్నాను’’ అన్నారు క్రిష్. వైష్ణవ్ తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కొండపొలం’.
ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో జరిగిన ఆడియో విడుదల వేడుకలో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘అద్భుతమైన సంగీతాన్ని అందించిన కీరవాణిగారే ఈ రోజు హీరో. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవలను తెరపైకి తీసుకుని వచ్చేందుకు క్రిష్ చాలా కష్టపడ్డారు. ఎప్పుడూ తలెత్తుకుని దేశం గర్వపడేలా చేయాలని క్రిష్ చెబుతుంటారు. తలెత్తుకుని ఉంటూ దేశం గర్వపడేలా చేయాలనుకునే ఓ కుర్రాడి కథ ఇది’’ అన్నారు.
‘‘అపనమ్మకం ఉన్నప్పుడు పాడుకునేలా ఈ చిత్రంలో ఓ మంత్రాన్ని (రయ్...రయ్..) కంపోజ్ చేశాను’’ అని కీరవాణి అన్నారు. ‘‘కీరవాణిగారితో మళ్లీ సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు రాజీవ్‌రెడ్డి. ‘‘నల్లమల అడవుల్లో నలభై రోజులు ఉండి, అక్కడి సంఘటనలతో ‘కొండపొలం’ నవల రాశాను. రాయలసీమ కథ సినిమాగా రావడం మనకెంతో గర్వకారణం. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కథ అని ఆలోచిస్తారు. ఒకటి రెండు శాతమే ఉండే ఫ్యాక్షన్‌ను తీసేసి 98 శాతం ఉండే రైతులు, గొర్రెల కాపర్లు, అట్టడుగువర్గాల వారి కష్టాల గురించి చెప్పే కథ ఇది’’ అన్నారు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment