మహేశ్‌.. ప్రభాస్‌లా నాకూ చేయాలని ఉంది: వైష్ణవ్‌ తేజ్‌ | Vaishnav Tej talks about Konda polam movie | Sakshi
Sakshi News home page

మహేశ్‌.. ప్రభాస్‌లా నాకూ చేయాలని ఉంది: వైష్ణవ్‌ తేజ్‌

Published Fri, Oct 8 2021 3:15 AM | Last Updated on Fri, Oct 8 2021 11:09 AM

Vaishnav Tej talks about Konda polam movie - Sakshi

‘‘మా మామయ్యలు (చిరంజీవి, నాగబాబు, పవన్‌ కల్యాణ్‌), అన్నయ్య (సాయితేజ్‌)కు ప్రేక్షకుల్లో ఇమేజ్‌ రావడం చూశాను. కానీ నాకో ఇమేజ్‌ వస్తే ఎలా రియాక్ట్‌ రావాలో ఆలోచించలేదు. ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు అందరూ నన్ను చూస్తుంటే బిడియంగా ఉంటుంది’’ అన్నారు హీరో వైష్ణవ్‌ తేజ్‌. క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. ‘బిబో’ శ్రీనివాస్‌ సమర్పణలో జె. సాయిబాబు, వై. రాజీవ్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైష్ణవ్‌ తేజ్‌ చెప్పిన విశేషాలు.

► క్రిష్‌గారి సినిమాలన్నా, మేకింగ్‌ అన్నా నాకు చాలా ఇష్టం. ‘వేదం, గమ్యం’ సినిమాలు బాగా నచ్చాయి. క్రిష్‌గారు ఫోన్‌ చేసినప్పుడు సినిమా కోసమని అనుకోలేదు. పైగా అప్పటికి నా ‘ఉప్పెన’ విడుదల కాలేదు. నేను ఆయన ఇంటికి వెళ్లాక ‘కొండపొలం’ కథ చెప్పారు. నా రెండో సినిమాకే క్రిష్‌ వంటి సీనియర్‌తో పని చేసే అవకాశం రావడం సంతోషంగా అనిపించింది. 

► ‘కొండపొలం’ అనే అంశమే కొత్తది. నేనెప్పుడూ వినలేదు. క్రిష్‌గారు కొత్త కథ చెప్పాలనుకున్నారు.. పైగా నాకూ కథ కొత్తగా అనిపించడంతో ఒప్పుకున్నాను. ఈ సినిమా కోసం కొండలు ఎక్కేవాళ్లం, రెండు మూడు కిలోమీటర్లు నడిచేవాళ్లం. అదేం పెద్ద కష్టంగా అనిపించలేదు. అయితే ఎండలో రోజంతా మాస్కులు పెట్టుకుని చేయడం కష్టంగా అనిపించింది.

ఏమీ లేని స్థాయి నుంచి ఎన్నో కష్టాలను దాటుకుని ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ స్థాయికి ఎదగడమే ‘కొండపొలం’ కథ. అడవితో, అక్కడ ఉన్న ఓబులమ్మతో ప్రేమలో పడతాడు. ఈ కథ, పాత్రలు చాలా కొత్తగా అనిపిస్తాయి. పెద్ద హీరోల సినిమాలు చూసినప్పుడు నాకూ అలాంటి కమర్షియల్‌ కథలు చేయాలనిపిస్తుంది. ప్రభాస్, మహేశ్‌బాబు అన్నల్లా నాక్కూడా కొట్టాలనిపిస్తుంది (సినిమాలో విలన్లను). మా ఫ్యామిలీకి కూడా నన్ను అలా చూడటం ఇష్టం. అదే సమయంలో కొత్త పాత్రలు చేయాలనిపిస్తుంది.

► ‘కొండపొలం’ కోసం ప్రత్యేకంగా వర్క్‌ షాప్స్‌ చేయలేదు. కొన్ని పదాలు మాత్రం యాసలోనే మాట్లాడాలని క్రిష్‌గారు చెప్పారు.. అలానే చేశాను. నా రెండో సినిమాకే కీరవాణిగారితో పని చేయడం నా అదృష్టం.

► కథకు తగ్గట్టు సినిమా తీశారా? లేదా? అని ఇప్పుడే చెప్పేంత అనుభవం నాకు లేదు. నా నటన గురించి నేను జడ్జ్‌ చేసుకోవడం కంటే దర్శకుడు, ప్రేక్షకులు చెబితేనే బాగుంటుంది. కొన్నిసార్లు బాగా చేశామని మనసు చెబుతుంది.. అలాంటప్పుడు మానిటర్‌ చూస్తాను. ఓటీటీ ఆఫర్లు వస్తే నటిస్తాను. ప్రస్తుతానికి గిరి సాయితో (తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడు) ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రం తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ సినిమా ఉంటుంది.

‘రిపబ్లిక్‌’ చిత్రంలో అన్నయ్య ఐఏఎస్‌గా చేశారు. ‘కొండపొలం’ మూవీలో నేను ఐఎఫ్‌ఎస్‌. ‘రిపబ్లిక్, కొండపొలం’ సినిమాకు సంబంధం ఉండదు. అన్నయ్య బాగున్నారు.. భయపడాల్సిన పనిలేదు. ఫిజియోథెరపీ జరుగుతోంది.. త్వరలోనే ఆస్పత్రి నుంచి బయ టకు వస్తారు.  

అడవిలో ఎక్కువ రోజులు షూటింగ్‌ చేయడంతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా మనకు అడవి ఎంతో ఆక్సిజన్‌ను ఇస్తుంది. అలాంటి అడవుల్లో ఎక్కువగా చెత్త వేయకూడదనిపించింది. ‘కొండపొలం’ షూటింగ్‌లో మొదట్లో గొర్రెల భాషను అర్థం చేసుకోలేకపోయాను. తల పొట్టేలు నడిచినట్టుగానే మిగతా గొర్రెలు కూడా నడుస్తాయి. వాటికి ఇష్టమైన పచ్చళ్లతో వాటిని కంట్రోల్‌ చేశాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement