Kondapalli toys artists
-
కొండపల్లి బొమ్మలకు.. మార్వలెస్ టచ్
ఈ తరం యువతకు అధునాతన ఆవిష్కరణల పై ఉన్న ఆసక్తి.. మన మూలాలను అన్వేషించడంపై ఉండదని తరచూ వింటుంటాం. కానీ నగరానికి చెందిన అభినవ్ సాయి అనే 23 ఏళ్ల యువకుడు తన సృజనాత్మకతతో సాంస్కృతిక వైభవానికి అధునాతన హంగులను అద్దుతూ రెండు తరాలకూ మధ్య వారధిలా నిలుస్తున్నాడు. కళ పరంగా ఎంతో విశిష్టత ఉన్నప్పటికీ ఆదరణకు దూరమవుతున్న కొండపల్లి బొమ్మలకు అధునాతన హంగులతో మళ్లీ ప్రాణం పోస్తున్నాడు. వోక్సన్ యూనివర్సిటీ వేదికగా తను చదువుకున్న విజ్ఞానాన్ని సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆద్యం పోస్తున్నాడు. ఇలా కొండపల్లి బొమ్మకు తాను రూపొందించిన మోడ్రన్ జాయింట్ టెక్నాలజీకి పేటెంట్ సైతం లభించింది. తాను అందించిన ప్రొడక్ట్ డిజైన్ నేపథ్యంతో స్వయంగా రూపొందించిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు ఐదు నేషనల్ అవార్డులను పొందింది. అంతేకాకుండా తన స్టార్టప్ ‘క్యాపిబరో’ ఆధ్వర్యంలో హాలీవుడ్ లెగో టాయ్స్ తరహాలో రూపొందించిన కల్కి మూవీ టాయ్స్ వినూత్న ఆవిష్కరణను తలపిస్తున్నాయి. ఇలా కొండపల్లి బొమ్మలు మొదలు తన సినిమా ప్రయాణం ఈ తరానికి స్ఫూర్తి దాయకమే. ఆ విశేషాలు అభినవ్ మాటల్లోనే తెలుసుకుందాం...!! చిన్నప్పటి నుంచి క్రియేటివ్ పెయింటింగ్, రాక్ స్కల్ప్చరింగ్, మినియేచర్ స్కల్ప్చర్ వంటి సృజనాత్మకత కళలు అంటే ఇష్టం. ఇలా కళాత్మక ప్రయోగాల్లో భాగంగానే నేను 7వ తరగతి (12 ఏళ్ల వయసులో..) చదువుతున్నప్పుడే ఫ్రెండ్స్‌తో నా మొదటి షార్ట్‌ఫిల్మ్ తీశాను. అప్పటికీ నాకు ఎడిటింగ్ అంటే కూడా సరిగా తెలీదు. ఐ మూవీస్ యాప్ సహాయంతో దానిని పూర్తిచేశాను. అలా బ్లాక్ అండ్ వైట్ సినిమా, థ్రిల్లర్, యానిమేషన్, ఫ్యాషన్ తదితర వేరియేషన్స్‌తో 50 షార్ట్ఫిల్్మ్స చేశాను. ఈ క్రియేటివిటీ, ఐడియాలజీతోనే నగరంలోని వోక్సెన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ ఆండ్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్‌లో చేరాను. వోక్సెన్ వేదికగా తెలుగు సంస్కృతిలో విశిష్టత కలిగిన కొండపల్లి బొమ్మలపైన పరిశోధనలు చేశాను. నా క్రియేటివిటీలో భాగంగా కొండపల్లి బొమ్మకు యాక్షన్ మూమెంట్ ఉండేలా మార్పు చేశాను. డెమోక్రసీ డెత్ ఆఫ్ ఆర్ట్స్..నా గ్రూప్ ప్రాజెక్ట్‌లో భాగంగా టాయ్‌కథాన్ అనే కాంపిటీషన్లో పలు ఆసక్తికర విషయాలను తెలుసుకున్నాను. ముఖ్యంగా 95 శాతం ట్రెడిషనల్ బొమ్మల విషయంలో ప్రచారం వేరు, వాస్తవికత వేరు. ఆన్లైన్లో కూడా ఔట్‌డేటెడ్ సమాచారం ఉంటుంది. కొండపల్లి బొమ్మలకు ఎంతో విశిష్టత ఉంది. 400 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి రాజుల కళాభిరుచిలో భాగంగా తెలుగు నేలకు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయింది. తేలికైన తెల్లపొనిక చెక్కతో చేస్తారు. కానీ వాటికి ప్రస్తుతం అంతగా మార్కెట్ లేదు. ఒకప్పుడు 6 అడుగుల వరకూ ఉంటే ఇప్పుడు 4, 5 ఇంచులకు మారిపోయాయి. సహజసిద్ధమైన రంగులు వినియోగించేవారు. ప్రస్తుతం అవి వాడట్లేదు. ఎయిర్ పోర్ట్‌లు, పెద్ద షాపింగ్ మాల్స్‌లో అమ్మే బుట్ట బొమ్మలు కూడా కొండపల్లి బొమ్మలు అనుకుంటారు చాలమంది. ఇలాంటి అంశాల వెనుకున్న కారణాలను నా పరిశోధనలో తెలుసుకున్నారు.యూనివర్సిటీ ప్రోత్సాహంతో పేటెంట్ ఒక స్పైడర్ మ్యాన్ బొమ్మలా మన కొండపల్లి చెక్క బొమ్మలు కూడా కదిలేలా డిజైన్ చేశాను. ప్రయోగంలో మా యూనివర్సిటీ అందించిన ప్రోత్సాహంతో నాకు పేటెంట్ రైట్స్ లభించాయి. హాలీవుడ్లో టాయ్స్టిక్ స్టార్టజీ బాగా ఆదరణ పొందింది. బార్బీ వంటి బొమ్మలను రూపొందించి వాటి మార్కెట్ కోసం భారీ సినిమాలను సైతం నిర్మిస్తారు. ఈ కోణంలోనే నా ప్రొడక్ట్ డిజైన్ నేపథ్యంలో తీసిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు మరో ఐదు నేషనల్ అవార్డులు పొందింది. మరో 10 నేషనల్ అవార్డులకు ఎంపికైంది. ఈ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. 3డీ డిజైన్.. గ్లిమ్స్‌తో యానిమేషన్..హాలీవుడ్ లెగో టాయ్స్లాగే.. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలుగు సినిమా ‘కలి్క’ సినిమాలోని బుజ్జీ కారు, ప్రభాస్ తదితర పాత్రధారులను నా స్టార్టప్ ‘క్యాపిబరో’ ఆధ్వర్యంలో స్కెచ్ వేసి, 3డీ డిజైన్‌తో కొండపల్లి క్రాఫ్ట్ మెన్‌తో బొమ్మలు చేయించాను. అంతేకాకుండా కల్కి గ్లిమ్స్ ఆధారంగా యానిమేటెడ్ వీడియో చేశాను. ఈ విషయం తెలుసుకుని కల్కి నిర్మాత స్వప్న, దర్శకులు నాగ్ అశ్విన్ నా క్రియేటివిటీని అభినందించారు. వారితో కలిసి ఒక ప్రాజెక్టులా ఈ బొమ్మలను తయారు చేయాలని ప్లాన్ చేశాం. కానీ సినిమా విడుదల బిజీ నేపథ్యంలో కుదరలేదు. నా క్రియేటివిటీతో దర్శకునిగా సినిమాలు చేయాలని ఉంది. ఇప్పటి వరకూ తొమ్మిది కమర్షియల్ సినిమా స్క్రిప్‌్టలు రెడీ చేశాను. ఇందులో ఒక కథ ప్రముఖ దర్శకులు సుకుమార్‌కు నచ్చి చర్చలు జరుగుతున్నాయి. తన సుకుమార్ రైటింగ్స్ ఆధ్వర్యంలో నా సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. -
బొమ్మల కొలువు
పండుగకు బొమ్మలను కొలువుదీర్చడం లేదామె. బొమ్మల తయారీ ‘కొలువు’ను పండగ చేస్తున్నారు. బొమ్మలతో ‘చక్కటి కొలువు’కు మార్గం వేస్తున్నారు. మన బొమ్మల నుంచి మన చేనేతల వరకు... సంప్రదాయ కళల పురోగతికి బాట వేస్తున్నారామె. ‘‘కళకు రాజపోషణ అవసరమే. కానీ కళ జీవించాల్సింది కేవలం దాతల దయాదాక్షిణ్యాల మీద మాత్రమే కాదు. కళ స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే ఆ కళకు గుర్తింపు, కళాకారులకు గౌరవం లభిస్తాయి’’ అన్నారు చిత్రాసూద్. ఆమె హైదరాబాద్‌లో కార్పొరేట్రంగంలో ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేస్తున్నారు. సమాజానికి చేయాలనుకున్న పనులను ఒక సుమహారంగా మలుచుకున్నారు. తన ప్రవృత్తిలో భాగంగా గొల్లభామ చీరలు, బొబ్బిలి నేత, ఇకత్ లక్ష వత్తుల చీర వంటి తెలుగు వారి సిగ్నేచర్ వీవింగ్‌కు సహజ రంగులను మేళవిస్తున్నారు. కొండపల్లి బొమ్మల కళాకారులు వృత్తిని వదిలి ఇతర ఉపాధి మార్గాల వైపు మరలుతున్న పరిస్థితిని గమనించి ఆ కళను పరిరక్షించే పనిలో పడ్డారామె. ఆ వివరాలతోపాటు తాను ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రభావితం చేసిన పరిస్థితులను సాక్షితో పంచుకున్నారు చిత్రాసూద్. తమిళనాడు నుంచి తెలంగాణకు ‘‘మా పూర్వికులది పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి. అమ్మవైపు విశాఖపట్నం. ఇరువైపుల కుటుంబాలూ తమిళనాడులో స్థిరపడ్డాయి. నాన్న కుటుంబం చెన్నైలో, అమ్మ వాళ్లు మధురైలో. అలా నేను పుట్టిన ప్రదేశం మధురై, పెరిగింది చెన్నై. నా చిన్నప్పుడే నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కి వచ్చేశాం. ఆ తర్వాత స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్థిరపడ్డారు. అలా నా చదువు సింగరేణిలో, పాల్వంచలో సాగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... నేను నా బాల్యంలోనే నాగరక భారతాన్ని, గ్రామీణ భారతాన్ని దగ్గరగా చూడగలిగాను. అప్పట్లో తలెత్తిన అనేక సందేహాలే ఇప్పుడు నేను చేస్తున్న పనుల కారకాలు. గ్రామీణ మహిళలు, పిల్లల్లో చైతన్యం లేకపోవడం, చదువు లేకపోవడం, అవకాశాలు లేకపోవడం అప్పట్లో నాలో ఆలోచనను రేకెత్తించేవి, కానీ వాటిని ఎలా పరిష్కరించాలో తెలియదు. అలాగే నా తొలి ఉద్యోగంలో నేను చూసిన పరిస్థితులు కూడా ఆందోళనకరమైనవే. అది హైదరాబాద్ శివారులో ఉన్న కెమికల్ ఇండస్ట్రీ. ఆ జిలెటిన్ తయారీ పరిశ్రమలో ఏడెనిమిదేళ్ల పిల్లలు పని చేసేవాళ్లు. పొడులను జల్లెడ పట్టడం వంటి పనిని ఆటలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్లు. తామెంత విపత్కరమైన పని చేస్తున్నారనేది తెలియని అమాయకత్వం వారిది. నా చదువు నా ఉన్నతికి మాత్రమే పరిమితం కాకూడదు, ఇంకా ఏదైనా చేయాలని గట్టిగా అనిపించిన సందర్భం కూడా అదే. నాలో అస్పష్టంగా ఉన్న ఆలోచనలకు ఒక రూపాన్ని ఇవ్వడం పదేళ్ల కిందట మొదలైంది. చదువులో రాణిస్తూ ఉన్నత చదువులకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించని విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడంతో సమాజానికి మా వంతు చారిటీ మొదలు పెట్టాం. ఆ టాస్క్‌లో మా హస్బెండ్ అనిల్ సూద్ సహకరిస్తున్నారు. చేనేతల్లో నాచురల్ కలర్స్ వాడకం, కొండపల్లి బొమ్మల కళ పరిరక్షణలో ‘అభిహార’ సంస్థ నిర్వాహకురాలు చిత్ర అనుభవాన్ని కలుపుకుని ముందుకుపోతున్నాను. కళలో సామాజిక మార్పు! ఏ కళలనైనా దాతల సహకారంతో ఎంతకాలమని పరిరక్షించగలం? కళ తనకు తానుగా స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే కళకు, కళాకారులకు గౌరవం. అందుకే మహిళలకు శిక్షణ ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇవ్వడంతోపాటు మార్కెట్ సౌలభ్యత కోసం పని చేస్తున్నాను. కొండపల్లిలో ఉండే మహిళలను తీసుకువచ్చి హైదరాబాద్‌లోని సప్తపర్ణిలో ఎగ్జిబిషన్ పెట్టించడంలో నా ఉద్దేశాలు రెండు నెరవేరాయి. ఒకటి గ్రామీణ మహిళలకు తమ బొమ్మలకు ప్రపంచంలో ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలియాలి, అలాగే కొనేవాళ్లు ఏం కోరుకుంటున్నారో అర్థం కావాలి. అలాగే ఒక అద్భుతమైన కళను సంపన్నుల లోగిళ్లను చేరగలిగితే ఆ కళకు రాజపోషణకు దారి వేసినట్లే. ఈ రెండూ సాధ్యమయ్యాయి. ఎప్పుడూ చేసే దశావతారాలు, ఎడ్లబండ్ల నుంచి కళాకారుల నైపుణ్యాన్ని టేబుల్ టాప్స్, మొబైల్ ఫోన్ స్టాండ్ వంటి రోజువారీ వాడుక వస్తువుల తయారీకి విస్తరించగలిగాం. అలాగే ఒక కళ ఆవిర్భవించినప్పుడు అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఒక రూపం సంతరించుకుని ఉంటుంది. ఆ రూపాలను కాలానుగుణంగా మార్చుకోవాలి. అందుకే కళను ధార్మికత పరిధి నుంచి సామాజిక పరిధికి విస్తరించాల్సిన అవసరాన్ని నేర్పిస్తున్నాం. ఈ బొమ్మలను లాంకో కంపెనీ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ హస్తకళాకృతుల సంస్థలు లేపాక్షి, గోల్కొండలు పెద్ద ఆర్డర్లతో ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ నేను నమ్మే సిద్ధాంతం ఏమిటంటే... కళను పరిరక్షించడం అనేది పెద్దమాట. కళ ద్వారా ఉపాధి పొందడం ప్రధానం. అప్పుడే కళ కలకాలం నిలుస్తుంది, కళాకారులు తమ ఉనికిని గర్వంగా చాటుకోగలుగుతారు. నా సర్వీస్‌తో ఎన్ని కుటుంబాలు, ఎన్ని కళారూపాలు స్వయంసమృద్ధి సాధించాయనేది నాకు మిగిలే సంతృప్తి’’ అన్నారు చిత్రాసూద్. వృత్తులకు, కళలకు ఇల్లే యూనివర్సిటీగా ఉండేది. పుస్తకం–కలం లేకుండానే విస్తృతమైన జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయ్యేది. కాలం మారింది, ప్రపంచీకరణ మన సంప్రదాయ వృత్తులను కాలగర్భంలో కలిపేస్తున్న తరుణంలో మన కళల జ్ఞానాన్ని గ్రంథస్థం చేయాల్సిన అవసరం ఉంది. దానికి శాస్త్రబద్ధత కల్పించాల్సిన అవసరం వచ్చింది. ఈ సైన్స్ ఏ పుస్తకంలోనూ లేదు! కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రానికి అనుబంధంగా సహజ రంగుల తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సొరకాయ ఆకులతో చెక్కకు రంగు అద్దవచ్చని ఇంతవరకు ఏ పుస్తకమూ చెప్పలేదు. కొండపల్లి బొమ్మల కళాకారులకు మాత్రమే తెలిసిన సైన్స్ అది. ఇక చేనేతల్లో గొల్లభామ, బొబ్బిలి, ఇకత్ చీరల్లలోనూ నేచురల్ కలర్స్ ప్రయోగం మొదలైంది. ఈ రంగాల్లో ఉన్న జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడం కూడా మా తదుపరి ప్రాజెక్టుల్లో ఒకటి. భూమండలాన్ని ప్రమాదం అంచుల్లోకి నెట్టివేస్తున్న కారకాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ కాలుష్యం ప్రధానమైనది. అందుకే మనవంతుగా కొన్ని అడుగులు వేయగలిగితే, మరికొందరి చేత వేయించగలిగితే... ఆ తర్వాత ఈ నేచర్ మూవ్మెంట్ దానంతట అదే ముందుకు సాగుతుంది. – చిత్రాసూద్, యాక్టివిస్ట్, రివైవల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కో – ఫౌండర్, అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ చాయిసెస్ ‘మహిళ’ శ్రమ చర్చకే రాదు! మహిళ స్థితిగతులు మారాలంటే ఆర్థిక స్వావలంబన సాధించాలనేది జగమెరిగిన సత్యం. మన వ్యవస్థలన్నింటిలోనూ మహిళలను సహాయక పనులకే పరిమితం చేయడంతో వారి శ్రమ గుర్తింపునకు నోచుకోవడం లేదు. మహిళలకు కూడా ఆర్టిజన్ కార్డ్ ఇప్పించడానికి పని చేస్తున్నాను. అలాగే వేతనపెంపు విషయంలో మహిళల పని గురించి చర్చ కూడా ఉండడం లేదు. ఎంతగా శ్రమించినప్పటికీ మహిళకు గుర్తింపు ఉండదు, ఆదాయం తక్కువ. ఈ పరిస్థితిని మార్చడానికి ‘అభిహార’ అనే వేదిక ద్వారా పని చేస్తున్నాను. కొండపల్లి బొమ్మలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి సహకారం అందిస్తోంది. ఏపీ ప్రాథమిక పాఠశాలల్లో బోధన పరికరాలు కొండపల్లి కళాకృతులే. నేను హార్టికల్చర్ విద్యార్థిని కావడంతో నాకు తెలిసిన సైన్స్‌ని హస్తకళల రంగానికి మేళవిస్తున్నాను. హస్తకళల రంగంలో విశేషమైన కృషి చేస్తున్న ఉజ్రమ్మ, సురయ్యా హసన్బోస్, జగదరాజప్పలు నాకు గురువులు. నా ఆకాంక్షలు, చిత్ర ఆలోచనలు ఒకే తీరుగా సాగడంతో మా ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. – సుధారాణి ముళ్లపూడి, సీఈవో, అభిహార సోషల్ ఎంటర్ప్రైజ్ – వాకా మంజులారెడ్డి -
కొండపల్లి బొమ్మకు ‘టాటా’ బ్రాండింగ్
సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన కొండపల్లి బొమ్మల అమ్మకాలను ప్రోత్సహించేందుకు దేశీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థ టాటా గ్రూపు ముందుకొచ్చింది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయంగా బ్రాండింగ్ కల్పించేందుకు టాటా కన్స్యూమర్ ప్రోడక్స్ట్ విభాగానికి చెందిన టాటా చక్రాగోల్డ్ టీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాస్టిక్ బొమ్మల రాకతో చేతివృత్తి కళాకారులు దెబ్బతింటున్నారని, వీరిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో సహజసిద్ధమైన కలప, రంగులతో తయారుచేసే కొండపల్లి బొమ్మలకు ప్రాచుర్యం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ (దక్షిణాసియా) పునీత్ దాస్ తెలిపారు. ఇందుకోసం దక్షిణాది రాష్ట్రాల్లో నవరాత్రులకు బొమ్మల కొలువులు పెట్టడం సంప్రదాయం కావడంతో ‘నవరాత్రులు.. మన కొండపల్లి బొమ్మలతో..’ అంటూ టాటా చక్రాగోల్డ్ ప్రచారం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా.. కొండపల్లి బొమ్మలతో కూడిన చక్రాగోల్డ్ టీ ప్యాకెట్లను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ బొమ్మల్లో విశేషాదరణ పొందిన 20 రకాలను ఎంపికచేసి వాటిని టాటా చక్రాగోల్డ్ వెబ్సైట్ ద్వారా విక్రయిస్తున్నారని, ప్రతీ కొనుగోలుపై ఈ బొమ్మలు చేసిన కళాకారులకు రూ.100 ఆర్థిక సాయాన్ని చక్రాగోల్డ్ ఇవ్వనుంది. షాపింగ్ మాల్స్‌లో ప్రత్యేక కౌంటర్లు ఇక ప్రత్యేక టీ ప్యాకెట్లను విడుదల చేయడమే కాకుండా వివిధ నగరాల్లోని షాపింగ్ మాల్స్‌లో కొండపల్లి బొమ్మలతో చక్రాగోల్డ్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేసినట్లు పునీత్ దాస్ తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఇన్ఆర్బిట్ మాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్‌కు విశేష స్పందన వచ్చిందన్నారు. మరోవైపు.. ఏపీలోని గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే కొండపల్లి బొమ్మలు ఏ కలప నుంచి చేస్తారు, వాటికి వినియోగించే రంగులు, అతికించడానికి వినియోగించే జిగురు వంటి అన్ని వివరాలను టాటా గ్రూపు ప్రచారం చేస్తోంది. ఇందుకోసం పత్రికా ప్రకటనలతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తోంది. ఇలా కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడానికి టాటా గ్రూపు ముందుకు రావడంపై లేపాక్షి ఎండీ బాలసుబ్రమణ్యంరెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. టాటా ప్రచారం మొదలు పెట్టిన తర్వాత ఆన్లైన్ అమ్మకాలు పెరిగాయన్నారు. ప్రస్తుతం ఈ ప్రచారం కేవలం దేవీనవరాత్రుల వరకు మాత్రమే ఉందని, రానున్న కాలంలో రాష్ట్రంలోని హస్తకళలను ప్రోత్సహించే విధంగా మరిన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. చదవండి: ఏపీలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ -
కళల కాణాచి.. జీవమై మెరిసి
సాక్షి, అమరావతి: కొండపల్లి అడవిలో లభించే తెల్ల పొనుకు చెట్ల నుంచి సేకరించిన చెక్కతో కొండపల్లి హస్త కళాకారులు తయారు చేసే ఎడ్లబండి, కల్లుగీత తాటి చెట్టు, ఏనుగు అంబారీ, దశావతారాలు, అర్జునుడి రథం, దేవతామూర్తుల బొమ్మలు దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందాయి. టేకు చెక్కతో అత్యంత నైపుణ్యంతో చేసే కలంకారీ అచ్చులకు ఉన్న ప్రత్యేకత అంతాఇంతా కాదు. చీరలు, దుప్పట్లు, లుంగీలు, చొక్కాలు, బ్లౌజులపై ఈ అచ్చుల సాయంతో అద్దే డిజైన్లకు మంచి క్రేజ్ ఉంది. విదేశాల నుంచి సైతం ప్రత్యేకంగా ఆర్డర్‌పై కలంకారీ అచ్చులను తయారు చేయించుకుని వెళ్తుండటంతో వీటికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. కొండపల్లి బొమ్మ.. అనంతపురం తోలుబొమ్మ.. గుంటూరు రాతి శిల్పాలు.. పెడన కలంకారీ.. చిలకలపూడి రోల్డ్ గోల్డ్ నగలు.. నరసాపురం లేసు అల్లికలు వంటి ఎన్నో హస్త కళలు మన సొంతం. జగమంతా మోగిన బొబ్బిలి వీణ.. కొండపల్లి కొయ్య బొమ్మ.. ఏటికొప్పాక లక్క బొమ్మలు.. గోదావరి తీరంలో అల్లే లేసులు.. ఏలూరు ఎర్ర తివాచీలు.. పుత్తడిని తలదన్నే బుడితి ఇత్తడి సామానులు.. ఆళ్లగడ్డ, దుర్గి శిల్పాలు.. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో చెక్కలపై చెక్కే అందాలు మన ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన వార సత్వ హస్త కళా సంపద. వీటిలో ఏ కళ వైపు చూసినా వాటికి పురుడు పోసే హస్తకళాకారుల చేతులు చమత్కారం చేస్తుంటాయి. భళా.. హస్తకళ అనిపించుకుంటాయి. 2 లక్షల కుటుంబాలకు హస్తకళలే ఆధారం రాష్ట్రంలో హస్త కళలపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో ఒక్కో హస్తకళ ప్రత్యేకతను సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షలకు పైగా కుటుంబాలు హస్తకళలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంత మహిళలు సూది, దారాలతో అలవోకగా అల్లే లేసులు, ఏలూరులో తివాచీల తయారీపై ఆధారపడి అత్యధికంగా లక్ష మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఆ తరువాత కృష్ణా జిల్లాలోని పెడన కలంకారీ అచ్చుల తయారీ, బం దరులోని చిలకలపూడి బంగారం, కొండపల్లి కొయ్య బొమ్మల తయారీపై ఉపాధి పొందుతున్న వారి సంఖ్య రెండో స్థానంలో ఉంది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రాంతంలో లేసు అల్లికలు, రామచంద్రపురం తాటి ఆకుల కళాఖండాలు, చిత్తూరులో చెక్క కళాకృతులను బతికిస్తున్న హస్త కళాకారుల సంఖ్య మూడో స్థానంలో ఉంది. కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన ఇతడి పేరు కె.వెంకటాచారి. 35ఏళ్లుగా కొయ్య బొమ్మల తయారీలో నిమగ్నమయ్యాడు. ఈ కళనే జీవనోపాధిగా మలుచుకున్న వెంకటాచారి తన ఇద్దరు కొడుకుల్ని బాగా చదివించి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేశాడు. ఇటీవల ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డును ఇచ్చి గౌరవించింది. ఇటీవల ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ సైతం కొండపల్లి బొమ్మల తయారీని ప్రస్తావించడంతో వెంకటాచారి పులకించిపోతున్నాడు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన పెడన కలంకారీ అచ్చుల తయారీలో 40ఏళ్లుగా సేవలందిస్తున్నఈయన పేరు కొండ్రు గంగాధర్. కృష్ణా జిల్లా పెడనకు చెందిన గంగాధర్ కుటుంబం మొత్తం ఇదే కళపై ఆధారపడి జీవిస్తోంది. ఎంతో మందికి కలంకారీ అచ్చుల తయారీలో శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించిన గంగాధర్‌ను కేంద్ర ప్రభుత్వం 2002లో రాష్ట్రపతి పురస్కారంతో సత్కరించింది. గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘శిల్పగురు’ అవార్డు ఇంకా అందుకోవాల్సి ఉందని గంగాధర్ గర్వంగా చెబుతున్నాడు. కళల కాణాచిగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో ఎందరో కళాకారులు హస్త కళలనే నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు. తాము బతుకుతూ హస్త కళలను బతికిస్తున్నారు. తాతల కాలం నుంచీ చేస్తున్నాం మా తాతల కాలం నుంచి చిలకలపూడిలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలు (ఇమిటేషన్ నగలు) తయారు చేస్తున్నాం. నేను మా నాన్న దగ్గర రోల్డ్‌గోల్డ్ నగల తయారీ నేర్చుకుని ఇదే పనిలో స్థిరపడ్డాను. మా ఇద్దరు పిల్లల చదువులు పూర్తయ్యాక వారితో రోల్డ్ గోల్డ్ నగల వ్యాపారం పెట్టించాను. ఈ వృత్తిని నమ్ముకున్న మాకు ఎలాంటి కష్టం లేదు. మచిలీపట్నంలో దాదాపు 3 వేల కుటుంబాలు రోల్డ్ గోల్డ్ నగల తయారీపై ఆధారపడి బతుకుతున్నాయి. – పెద్దేటి పాండురంగారావు, రోల్డ్ గోల్డ్ ఆభరణాల తయారీదారు, మచిలీపట్నం అమ్మ నుంచి నేర్చుకున్నా మా అమ్మ చంద్రమ్మ నుంచి లేసులు అల్లడం నేర్చుకున్నాను. ఈ కళే నాకు ఉపాధిగా మారింది. పెళ్లయి అత్తారింటికి వచ్చినా అదే వ్యాపకాన్ని కొనసాగిస్తున్నాను. లేసు అల్లికల ద్వారా నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వస్తాయి. వేడి నీళ్లకు చన్నీళ్ల సాయం మాదిరిగా నా కుటుంబానికి ఉపయోగపడుతున్నాయి. మా ప్రాంతంలో లేసు అల్లికలపై దాదాపు 15 వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. – పులపర్తి మహాలక్ష్మి, అధ్యక్షురాలు, నరసాపురం లేసు పార్కు, పశ్చిమగోదావరి జిల్లా -
కొండపల్లి బొమ్మల పరిశ్రమకు రూ.1.75 కోట్లు
ఇబ్రహీంపట్నం : కొండపల్లి బొమ్మల తయారీ పరిశ్రమ కళాకారుల అభ్యున్నతి కోసం కేంద్రం ప్రభుత్వం రూ.1.75కోట్లు విడుదల చేసిందని డీఆర్డీఏ పీడీ డి.చంద్రశేఖర్‌రాజు తెలిపారు. కొండపల్లి గ్రామంలో బొమ్మలు తయారు చేసే కళాకారులతో డీఆర్డీఏ ఆధ్వర్యాన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపల్లి బొమ్మల తయారీదారులను ఒక సొసైటీగా ఏర్పాటు చేసి డీఆర్డీఏ, లేపాక్షి, టాటా ట్రస్ట్ ద్వారా ముడిసరుకు అందజేస్తామన్నారు. బొమ్మల నాణ్యత, ఆన్లైన్ మార్కెటింగ్‌లో అమ్మకాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టాటా ట్రస్ట్ ప్రతినిధి సోహిని, మండల ఏపీఎం కృష్ణంరాజు, క్లస్టర్ కో–ఆర్డినేటర్ రుక్మిణి పాల్గొన్నారు.