హైదరాబాద్ ఇన్‌ఆర్బిట్ మాల్‌లో ఏర్పాటు చేసిన కొండపల్లి బొమ్మలతో చక్రాగోల్డ్ ప్రత్యేక కౌంటర్
సాక్షి, అమరావతి: పర్యావరణ హితమైన కొండపల్లి బొమ్మల అమ్మకాలను ప్రోత్సహించేందుకు దేశీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థ టాటా గ్రూపు ముందుకొచ్చింది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయంగా బ్రాండింగ్ కల్పించేందుకు టాటా కన్స్యూమర్ ప్రోడక్స్ట్ విభాగానికి చెందిన టాటా చక్రాగోల్డ్ టీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాస్టిక్ బొమ్మల రాకతో చేతివృత్తి కళాకారులు దెబ్బతింటున్నారని, వీరిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో సహజసిద్ధమైన కలప, రంగులతో తయారుచేసే కొండపల్లి బొమ్మలకు ప్రాచుర్యం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ (దక్షిణాసియా) పునీత్ దాస్ తెలిపారు.
ఇందుకోసం దక్షిణాది రాష్ట్రాల్లో నవరాత్రులకు బొమ్మల కొలువులు పెట్టడం సంప్రదాయం కావడంతో ‘నవరాత్రులు.. మన కొండపల్లి బొమ్మలతో..’ అంటూ టాటా చక్రాగోల్డ్ ప్రచారం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా.. కొండపల్లి బొమ్మలతో కూడిన చక్రాగోల్డ్ టీ ప్యాకెట్లను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ బొమ్మల్లో విశేషాదరణ పొందిన 20 రకాలను ఎంపికచేసి వాటిని టాటా చక్రాగోల్డ్ వెబ్‌సైట్ ద్వారా విక్రయిస్తున్నారని, ప్రతీ కొనుగోలుపై ఈ బొమ్మలు చేసిన కళాకారులకు రూ.100 ఆర్థిక సాయాన్ని చక్రాగోల్డ్ ఇవ్వనుంది.
షాపింగ్ మాల్స్‌లో ప్రత్యేక కౌంటర్లు
ఇక ప్రత్యేక టీ ప్యాకెట్లను విడుదల చేయడమే కాకుండా వివిధ నగరాల్లోని షాపింగ్ మాల్స్‌లో కొండపల్లి బొమ్మలతో చక్రాగోల్డ్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేసినట్లు పునీత్ దాస్ తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఇన్‌ఆర్బిట్ మాల్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్‌కు విశేష స్పందన వచ్చిందన్నారు. మరోవైపు.. ఏపీలోని గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే కొండపల్లి బొమ్మలు ఏ కలప నుంచి చేస్తారు, వాటికి వినియోగించే రంగులు, అతికించడానికి వినియోగించే జిగురు వంటి అన్ని వివరాలను టాటా గ్రూపు ప్రచారం చేస్తోంది. ఇందుకోసం పత్రికా ప్రకటనలతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తోంది.
ఇలా కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడానికి టాటా గ్రూపు ముందుకు రావడంపై లేపాక్షి ఎండీ బాలసుబ్రమణ్యంరెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. టాటా ప్రచారం మొదలు పెట్టిన తర్వాత ఆన్‌లైన్ అమ్మకాలు పెరిగాయన్నారు. ప్రస్తుతం ఈ ప్రచారం కేవలం దేవీనవరాత్రుల వరకు మాత్రమే ఉందని, రానున్న కాలంలో రాష్ట్రంలోని హస్తకళలను ప్రోత్సహించే విధంగా మరిన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
చదవండి: ఏపీలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
Comments
Please login to add a commentAdd a comment