కదలికలకు పేటెంట్ పొందిన అభినవ్
హాలీవుడ్ టాయ్‌స్టిక్ స్టార్టజీలో భాగంగా యానిమేటెడ్ షార్ట్‌ఫిల్‌్మ
దాదాసాహెబ్ ఫాల్కే మొదలు ఐదు నేషనల్ అవార్డులు
‘క్యాపిబరో’ స్టార్టప్‌తో ‘కల్కి’ ప్రభాస్, బుజ్జీలకు 3డీ డిజైన్‌లు
కొండపల్లి కళతో ఇండియన్ డిస్నీల్యాండ్ థీమ్ పార్క్ లక్ష్యం
సినిమాల్లోనూ రాణించాలనుంది: అభినవ్ సాయి
ఈ తరం యువతకు అధునాతన ఆవిష్కరణల పై ఉన్న ఆసక్తి.. మన మూలాలను అన్వేషించడంపై ఉండదని తరచూ వింటుంటాం. కానీ నగరానికి చెందిన అభినవ్ సాయి అనే 23 ఏళ్ల యువకుడు తన సృజనాత్మకతతో సాంస్కృతిక వైభవానికి అధునాతన హంగులను అద్దుతూ రెండు తరాలకూ మధ్య వారధిలా నిలుస్తున్నాడు. కళ పరంగా ఎంతో విశిష్టత ఉన్నప్పటికీ ఆదరణకు దూరమవుతున్న కొండపల్లి బొమ్మలకు అధునాతన హంగులతో మళ్లీ ప్రాణం పోస్తున్నాడు. వోక్సన్ యూనివర్సిటీ వేదికగా తను చదువుకున్న విజ్ఞానాన్ని సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆద్యం పోస్తున్నాడు.
ఇలా కొండపల్లి బొమ్మకు తాను రూపొందించిన మోడ్రన్ జాయింట్ టెక్నాలజీకి పేటెంట్ సైతం లభించింది. తాను అందించిన ప్రొడక్ట్ డిజైన్ నేపథ్యంతో స్వయంగా రూపొందించిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు ఐదు నేషనల్ అవార్డులను పొందింది. అంతేకాకుండా తన స్టార్టప్ ‘క్యాపిబరో’ ఆధ్వర్యంలో హాలీవుడ్ లెగో టాయ్స్ తరహాలో రూపొందించిన కల్కి మూవీ టాయ్స్ వినూత్న ఆవిష్కరణను తలపిస్తున్నాయి. ఇలా కొండపల్లి బొమ్మలు మొదలు తన సినిమా ప్రయాణం ఈ తరానికి స్ఫూర్తి దాయకమే. ఆ విశేషాలు అభినవ్ మాటల్లోనే తెలుసుకుందాం...!!
చిన్నప్పటి నుంచి క్రియేటివ్ పెయింటింగ్, రాక్ స్కల్ప్చరింగ్, మినియేచర్ స్కల్ప్చర్ వంటి సృజనాత్మకత కళలు అంటే ఇష్టం. ఇలా కళాత్మక ప్రయోగాల్లో భాగంగానే నేను 7వ తరగతి (12 ఏళ్ల వయసులో..) చదువుతున్నప్పుడే ఫ్రెండ్స్‌తో నా మొదటి షార్ట్‌ఫిల్మ్ తీశాను. అప్పటికీ నాకు ఎడిటింగ్ అంటే కూడా సరిగా తెలీదు. ఐ మూవీస్ యాప్ సహాయంతో దానిని పూర్తిచేశాను. అలా బ్లాక్ అండ్ వైట్ సినిమా, థ్రిల్లర్, యానిమేషన్, ఫ్యాషన్ తదితర వేరియేషన్స్‌తో 50 షార్ట్‌ఫిల్‌్మ్స చేశాను. ఈ క్రియేటివిటీ, ఐడియాలజీతోనే నగరంలోని వోక్సెన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ ఆండ్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్‌లో చేరాను. వోక్సెన్ వేదికగా తెలుగు సంస్కృతిలో విశిష్టత కలిగిన కొండపల్లి బొమ్మలపైన పరిశోధనలు చేశాను. నా క్రియేటివిటీలో భాగంగా కొండపల్లి బొమ్మకు యాక్షన్ మూమెంట్ ఉండేలా మార్పు చేశాను.
డెమోక్రసీ డెత్ ఆఫ్ ఆర్ట్స్..
నా గ్రూప్ ప్రాజెక్ట్‌లో భాగంగా టాయ్‌కథాన్ అనే కాంపిటీషన్‌లో పలు ఆసక్తికర విషయాలను తెలుసుకున్నాను. ముఖ్యంగా 95 శాతం ట్రెడిషనల్ బొమ్మల విషయంలో ప్రచారం వేరు, వాస్తవికత వేరు. ఆన్‌లైన్‌లో కూడా ఔట్‌డేటెడ్ సమాచారం ఉంటుంది. కొండపల్లి బొమ్మలకు ఎంతో విశిష్టత ఉంది. 400 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి రాజుల కళాభిరుచిలో భాగంగా తెలుగు నేలకు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయింది. తేలికైన తెల్లపొనిక చెక్కతో చేస్తారు. కానీ వాటికి ప్రస్తుతం అంతగా మార్కెట్ లేదు. ఒకప్పుడు 6 అడుగుల వరకూ ఉంటే ఇప్పుడు 4, 5 ఇంచులకు మారిపోయాయి. సహజసిద్ధమైన రంగులు వినియోగించేవారు. ప్రస్తుతం అవి వాడట్లేదు. ఎయిర్ పోర్ట్‌లు, పెద్ద షాపింగ్ మాల్స్‌లో అమ్మే బుట్ట బొమ్మలు కూడా కొండపల్లి బొమ్మలు అనుకుంటారు చాలమంది. ఇలాంటి అంశాల వెనుకున్న కారణాలను నా పరిశోధనలో తెలుసుకున్నారు.
యూనివర్సిటీ ప్రోత్సాహంతో పేటెంట్
ఒక స్పైడర్ మ్యాన్ బొమ్మలా మన కొండపల్లి చెక్క బొమ్మలు కూడా కదిలేలా డిజైన్ చేశాను. ప్రయోగంలో మా యూనివర్సిటీ అందించిన ప్రోత్సాహంతో నాకు పేటెంట్ రైట్స్ లభించాయి. హాలీవుడ్‌లో టాయ్‌స్టిక్ స్టార్టజీ బాగా ఆదరణ పొందింది. బార్బీ వంటి బొమ్మలను రూపొందించి వాటి మార్కెట్ కోసం భారీ సినిమాలను సైతం నిర్మిస్తారు. ఈ కోణంలోనే నా ప్రొడక్ట్ డిజైన్ నేపథ్యంలో తీసిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు మరో ఐదు నేషనల్ అవార్డులు పొందింది. మరో 10 నేషనల్ అవార్డులకు ఎంపికైంది. ఈ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది.
3డీ డిజైన్.. గ్లిమ్స్‌తో యానిమేషన్..
హాలీవుడ్ లెగో టాయ్స్‌లాగే.. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలుగు సినిమా ‘కలి్క’ సినిమాలోని బుజ్జీ కారు, ప్రభాస్ తదితర పాత్రధారులను నా స్టార్టప్ ‘క్యాపిబరో’ ఆధ్వర్యంలో స్కెచ్ వేసి, 3డీ డిజైన్‌తో కొండపల్లి క్రాఫ్ట్ మెన్‌తో బొమ్మలు చేయించాను. అంతేకాకుండా కల్కి గ్లిమ్స్ ఆధారంగా యానిమేటెడ్ వీడియో చేశాను. ఈ విషయం తెలుసుకుని కల్కి నిర్మాత స్వప్న, దర్శకులు నాగ్ అశ్విన్ నా క్రియేటివిటీని అభినందించారు. వారితో కలిసి ఒక ప్రాజెక్టులా ఈ బొమ్మలను తయారు చేయాలని ప్లాన్ చేశాం. కానీ సినిమా విడుదల బిజీ నేపథ్యంలో కుదరలేదు. నా క్రియేటివిటీతో దర్శకునిగా సినిమాలు చేయాలని ఉంది. ఇప్పటి వరకూ తొమ్మిది కమర్షియల్ సినిమా స్క్రిప్‌్టలు రెడీ చేశాను. ఇందులో ఒక కథ ప్రముఖ దర్శకులు సుకుమార్‌కు నచ్చి చర్చలు జరుగుతున్నాయి. తన సుకుమార్ రైటింగ్స్ ఆధ్వర్యంలో నా సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment