Koppal
-
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..
-
పెద్దలకు తెలియజేయడమే శాపమైందో ఏమో! ఆ ప్రేమ జంట..
సాక్షి, గంగావతి రూరల్: ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన శనివారం కొప్పళ జిల్లా కుక్కనూరు తాలూకా బలిగేరి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రకాష్ (20) కుక్కనూరు ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన సుమ సుమ (17) కుక్కనూరులో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూ గ్రామం నుంచి ఆటో, బస్సుల్లో కుక్కనూరుకు వెళ్లివచ్చే క్రమంలో వీరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమకు దారితీసింది. వీరిద్దరివి వేర్వేరు కులాలు. తమ ప్రేమను కుటుంబ పెద్దలకు తెలియజేయగా చదువుకునే వయస్సులో ప్రేమ ఏంటని మందలించారు. వీరి ప్రేమ వ్యవహారంపై గ్రామస్తులు కూడా తప్పు బట్టారు. ఈక్రమంలో ఏం జరిగిందో ఏమో కాని శనివారం సుమ ఇంట్లో ప్రేమికులిద్దరూ రక్తపుమడుగులో విగతజీవులుగా కనిపించారు. కుక్కనూరు పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. గొంతుల వద్ద గాట్లు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను కుక్కనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కొత్త బట్టలు కొని వస్తుండగా ఘోరం) -
కరెంట్ షాక్తో ఐదుగురు విద్యార్థులు మృతి
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని కొప్పళ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ప్రభుత్వ బీసీ విద్యార్థుల హాస్టల్లో విద్యుత్ షాక్తో అయిదుగురు విద్యార్థులు ఆదివారం మృతి చెందారు. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేళ జెండా ఎగురవేసేందుకు దేవరాజ్ ఉర్స్ రెసిడెన్షియల్ స్కూల్ వసతిగృహంపై ఇనుప పైపును అమర్చారు. ఆదివారం ఉదయం దానిని విద్యార్థులు తొలగిస్తుండగా చేతికందేంత ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లకు పైప్ తాకింది. దీంతో ఒక విద్యార్థికి షాక్ కొట్టింది, అతడిని రక్షించేందుకు మిగతా వాళ్లు ప్రయత్నించడంతో అయిదుగురూ అక్కడికక్కడే మరణించారు.మృతులను మల్లికార్జున్, కుమార్, గణేష్, బసవరాజ్, దేవరాజ్గా గుర్తించారు. సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్, ఎస్పీతో పాటు పలువురు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు దుర్ఘటనపై ముఖ్యమంత్రి యడియూరప్ప విచారణకు ఆదేశిస్తూ, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా వసతి గృహం నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డలను కోల్పోయామని మృతుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ వసతి గృహాన్ని ఓ ప్రయివేట్ భవనంలో నిర్వహిస్తున్నట్లు సమాచారం. -
తల్లిని బతికించుకునేందుకు ఆరేళ్ల చిన్నారి..
బెంగళూరు : ఆడుకోవాల్సిన పసిప్రాయంలో జన్మనిచ్చిన తల్లిని కాపాడుకునేందుకు ఓ చిన్నారి భిక్షగత్తెగా మారింది. మద్యానికి బానిసైన తల్లిని బతికించుకునేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తోంది. కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాకు చెందిన ఆ చిన్నారి పేరు భాగ్యశ్రీ. ఆమె వయస్సు ఆరు సంవత్సరాలు. కొంతకాలం క్రితం తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి హాయిగా జీవించేది. అయితే దుర్గమ్మ మద్యానికి బానిసవడం తట్టుకోలేని ఆమె భర్త..కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. అనంతరం వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ దుర్గమ్మలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో అనారోగ్యం పాలై వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరింది. ఈ నేపథ్యంలో దుర్గమ్మ బంధువులెవరూ ఆమెను పట్టించుకోకపోవడంతో కూతురే ఆమెకు దిక్కయింది. తల్లికి అన్నం తినిపించడం, స్నానం చేయించడం వంటి సపర్యలు చేస్తూ ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. అయితే తల్లి దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో.. ఆస్పత్రికి వచ్చిన వారికి తన దీన స్థితి గురించి చెబుతూ యాచించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో చిన్నారిని గమనించిన ఆస్పత్రి యాజమాన్యం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లింది. భాగ్యశ్రీ, ఆమె తల్లి దుర్గమ్మ గురించి పూర్తి వివరాలు సంపాదించి, వారికి సహాయం చేయాల్సిందిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో దుర్గమ్మకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు భాగ్యశ్రీని బడిలో చేర్పిస్తామని అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ విషయం గురించి భాగ్యశ్రీ విలేకరులతో మాట్లాడుతూ..’ మా నాన్న మమ్మల్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు. మా అమ్మకేమో ఆరోగ్యం బాగాలేదు. తినడానికి కూడా మా దగ్గర ఏమీ లేదు. అందుకే అందరినీ అడుక్కుంటూ అమ్మకి కావాల్సివని కొనుక్కొస్తున్నా. అమ్మ ఆస్పత్రి నుంచి వచ్చాక.. నేను కూడా అన్నయ్య లాగే బడికి వెళ్తాను అని చెప్పుకొచ్చింది. -
సివిల్ ఇంజినీర్లను బురద గుంటలో పడేసి..
బెంగళూరు: అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామస్తులకు ఆగ్రహం తెప్పించింది. రోడ్డుపై కందకాలు పడినా పట్టించుకోకపోవడంతోపాటు అలా మన్నిక లేకుండా రోడ్లను వేసిన ఇద్దరు ఇంజినీర్ల బుద్ధి చెప్పారు. ఆ నీటి గుంటలో వారిద్దరిన పడేసి సామాన్యుల ఇబ్బంది అర్థమైందా అంటూ నిలదీశారు. ఈ ఘటన కర్ణాటకలోని కొప్పాల్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మల్లప్ప అనే మాజీ సైనికుడు తన స్కూటర్ పై వెళుతూ కోటే రోడ్డులో ఏర్పడిన బురద గుంటలో పడ్డాడు. ఆ గుంత ఏర్పడి చాలా రోజులయినా ఆ ప్రాంత సివిల్ ఇంజినీర్లు పట్టించుకోలేదు. ఈ ఘటన జరిగిన అనంతరం అక్కడికి సంబంధిత ఇంజినీర్లు రాగా.. వారితో ఘర్షణపడిన గ్రామస్తులు వారిద్దరిని అదే బురద గుంటలో పడేశారు. వారు లేచే ప్రయత్నం చేస్తుండగా మరోసారి అలాగే తోశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేస్తుండగా ఈ గుంత ఏర్పడి స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటికే పలువురు గాయపడ్డారు.