బెంగళూరు : ఆడుకోవాల్సిన పసిప్రాయంలో జన్మనిచ్చిన తల్లిని కాపాడుకునేందుకు ఓ చిన్నారి భిక్షగత్తెగా మారింది. మద్యానికి బానిసైన తల్లిని బతికించుకునేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తోంది. కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాకు చెందిన ఆ చిన్నారి పేరు భాగ్యశ్రీ. ఆమె వయస్సు ఆరు సంవత్సరాలు. కొంతకాలం క్రితం తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి హాయిగా జీవించేది. అయితే దుర్గమ్మ మద్యానికి బానిసవడం తట్టుకోలేని ఆమె భర్త..కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. అనంతరం వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ దుర్గమ్మలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో అనారోగ్యం పాలై వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరింది.
ఈ నేపథ్యంలో దుర్గమ్మ బంధువులెవరూ ఆమెను పట్టించుకోకపోవడంతో కూతురే ఆమెకు దిక్కయింది. తల్లికి అన్నం తినిపించడం, స్నానం చేయించడం వంటి సపర్యలు చేస్తూ ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. అయితే తల్లి దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో.. ఆస్పత్రికి వచ్చిన వారికి తన దీన స్థితి గురించి చెబుతూ యాచించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో చిన్నారిని గమనించిన ఆస్పత్రి యాజమాన్యం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లింది. భాగ్యశ్రీ, ఆమె తల్లి దుర్గమ్మ గురించి పూర్తి వివరాలు సంపాదించి, వారికి సహాయం చేయాల్సిందిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో దుర్గమ్మకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు భాగ్యశ్రీని బడిలో చేర్పిస్తామని అధికారులు పేర్కొన్నారు.
కాగా ఈ విషయం గురించి భాగ్యశ్రీ విలేకరులతో మాట్లాడుతూ..’ మా నాన్న మమ్మల్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు. మా అమ్మకేమో ఆరోగ్యం బాగాలేదు. తినడానికి కూడా మా దగ్గర ఏమీ లేదు. అందుకే అందరినీ అడుక్కుంటూ అమ్మకి కావాల్సివని కొనుక్కొస్తున్నా. అమ్మ ఆస్పత్రి నుంచి వచ్చాక.. నేను కూడా అన్నయ్య లాగే బడికి వెళ్తాను అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment