సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని కొప్పళ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ప్రభుత్వ బీసీ విద్యార్థుల హాస్టల్‌లో విద్యుత్ షాక్‌తో అయిదుగురు విద్యార్థులు ఆదివారం మృతి చెందారు. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేళ జెండా ఎగురవేసేందుకు దేవరాజ్ ఉర్స్ రెసిడెన్షియల్ స్కూల్ వసతిగృహంపై ఇనుప పైపును అమర్చారు. ఆదివారం ఉదయం దానిని విద్యార్థులు తొలగిస్తుండగా చేతికందేంత ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లకు పైప్ తాకింది. దీంతో ఒక విద్యార్థికి షాక్ కొట్టింది, అతడిని రక్షించేందుకు మిగతా వాళ్లు ప్రయత్నించడంతో అయిదుగురూ అక్కడికక్కడే మరణించారు.మృతులను మల్లికార్జున్, కుమార్, గణేష్, బసవరాజ్, దేవరాజ్‌గా గుర్తించారు.
సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్, ఎస్పీతో పాటు పలువురు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు దుర్ఘటనపై ముఖ్యమంత్రి యడియూరప్ప విచారణకు ఆదేశిస్తూ, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా వసతి గృహం నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డలను కోల్పోయామని మృతుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ వసతి గృహాన్ని ఓ ప్రయివేట్ భవనంలో నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment