ఇద్దరు సీఏ విద్యార్థుల దుర్మరణం
విద్యానగర్/ గుంటూరు రూరల్: రోడ్డుప్రమాదంలో ఇద్దరు సీఏ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన గుంటూరు నగరంలోని కొరిటెపాడు గాంధీబొమ్మ సెంటర్లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. చేతికి అందివచ్చిన కుమారులు అకాలమృతి చెందడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
సేకరించిన వివరాలు, వెస్ట్ ట్రాఫిక్ సీఐ పి.బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం.. గురజాల రాయుడుబావి వీధి సెంటర్‌కు చెందిన ఇరుగుల ఈశ్వర్‌రెడ్డి, కళావతి దంపతుల రెండో కుమారుడు బ్రహ్మారెడ్డి (21), నాదెండ్ల మండలం రామాపురం కాలనీకి చెందిన కుందుర్తి విజయకుమార్, లక్ష్మి దంపతుల పెద్దకుమారుడు రాజశేఖర్ (21)లు విజయవాడలోని సెంట్రల్ అకాడమీలో సీఏ ఐపీసీసీ చదువుతున్నారు. వీరిద్దరూ కళాశాల వసతిగృహంలో ఒకేరూమ్‌లో ఉంటున్నారు.
బ్రహ్మారెడ్డి సెమిస్టర్ పరీక్షలు ఆదివారంతో పూర్తవడంతో తమ బంధువుల ఇంటికి వెళదామనుకుని ఇద్దరూ ద్విచక్ర వాహనంపై సోమవారం ఉదయం గుంటూరు చేరుకున్నారు. కొరిటెపాడు గాంధీ బొమ్మ సెంటర్ వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు యువకులు కిందపడిపోయారు. రక్తపుమడుగులో ఉన్న క్షతగాత్రులను స్థానికులు వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్రహ్మరెడ్డి, రాజశేఖర్‌లు మృతిచెందారు.
వ్యవసాయం జీవనాధారంగా ఉన్న రెండు కుటుంబాల వారు తమ బిడ్డలు ఆకస్మికంగా మృతిచెందడంతో షాక్‌కు గురయ్యారు. ఈశ్వరరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్దకుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. విజయకుమార్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చదువు పూర్తిచేసుకుని తనకు చేదోడువాదోడుగా ఉంటాడనుకుంటే అర్ధంతరంగా తనువు చాలించావా అంటూ బ్రహ్మారెడ్డి తల్లి కళావతి భోరున విలపించింది.
చదువుకుంటున్నావమ్మా అంటు చెప్పి నెలరోజుల క్రితం కళాశాలకు వెళ్లిన పెద్దకుమారుడి మాటలు చివరిసారి వినలేకపోయానంటూ రాజశేఖర్ తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతుల స్నేహితులు కూడా ఆస్పత్రికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ సీఐ బాలాజీ, సిబ్బంది ఘటనాప్రదేశానికి చేరుకుని చుట్టుపక్కలవారిని విచారించి ప్రమాద తీరును పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.