'చెల్లిని నచ్చిన కోర్సు చదవనివ్వండి'
'చెల్లిని నేనెప్పుడూ కూతురిలాగే ప్రేమించాను. చాలాబాగా చూసుకున్నాను. తననైనా తను నచ్చిన కోర్సును చదవనివ్వండి'.. ఇది కృతి త్రిపాఠి తన ఆత్మహత్య లేఖలో తల్లిదండ్రులకు చేసిన విజ్ఞప్తి. మంచి మార్కులతో ఐఐటీ-జేఈఈలో పాసైనప్పటికీ ఐదు అంతస్తుల భవనం మీద నుంచి దూకి కృతి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.తన ఆత్మహత్యకు ముందు కృతి ఎంతో భావోద్వేగంతో తల్లిదండ్రులను ఉద్దేశించి ఐదుపేజీల లేఖ రాసింది. తనకు బీఎస్సీ చదువాలని ఉందని, కానీ తన తల్లిదండ్రులు ఇంజినీరింగ్ చదువుమని బలవంతపెట్టారని ఆ లేఖలో తెలిపింది. తన తల్లిదండ్రుల అంచనాలు అందుకోలేక తనెంతగా మథనపడిందో ఆమె లేఖలో తెలిపింది.
ప్రస్తుతం జూనియర్ ఇంటర్ చదువుతున్న తన చెల్లి భవిష్యత్తైనా బాగుండాలని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలా అర్ధంతరంగా తనువు చాలిస్తున్నందుకు క్షమాపణలు చెప్పింది. తన చెల్లి ఏది చదువుతానంటే అదే చదివించమని తల్లిదండ్రులను ఆమె కోరింది.తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని తల్లికి విజ్ఞప్తి చేసింది. తల్లిదండ్రుల అంచనాలు నిలబెట్టలేకపోతున్నానని క్షమాపణలు కోరింది. రాజస్థాన్ లోని కోటా పట్టణంలో గురువారం కృతి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కోటా పట్టణం ఎస్పీ ఎస్ఎస్ గోదారా శనివారం ఆమె ఆత్మహత్య లేఖలోని వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఐఐటీ-జేఈఈ 2016 ఫలితాలలో కృతి త్రిపాఠికి 144 మార్కులు వచ్చాయని, కటాఫ్ మార్కుల కన్నా ఆమె 44 మార్కులు అధికంగా సాధించిందని ఆయన వెల్లడించారు. తమకు నచ్చిన కోర్సును చదువుకోవాలని కృతి మీద తల్లిదండ్రులు ఒత్తిడి తేవడం, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఇంజినీరింగ్ చేయించడానికి పూనుకోవడం, ఈ పరిస్థితుల నడుమ తల్లిదండ్రుల అంచనాలు అందుకోలేమన్న ఒత్తిడితో కృతి ప్రాణాలు తీసుకొని ఉంటుందని ఎస్పీ గోదార చెప్పారు. రాజస్థాన్ లోని కోటా కోచింగ్ సెంటర్లకు పేరుగాంచింది. ఈసారి ఐఐటీ ఫలితాల్లోనూ కోటా తన సత్తా చాటింది. అదే సమయంలో ఈ పట్టణం విద్యార్థుల ఆత్మహత్యలకు పేరుపడింది. కోచింగ్ సెంటర్లు, తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక ఈ ఏడాదే ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.