కోయాల్సిందే
ఎస్పీ కోయ ప్రవీణ్ను బదిలీ చేయాలని పట్టు
ముదురుతున్న పొలిటీషియన్, పోలీస్ వివాదం
హోం మంత్రి చిన రాజప్పను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు
జిల్లాకు వచ్చి మాట్లాడతానన్న హోం మంత్రి
విశాఖపట్నం: పాలకులకు పోలీసు ఉన్నతాధికారులకు మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఎవరికి వారు పంతం నెగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒక ఐపీఎస్ అధికారిని టార్గెట్ చేసి ఇంత మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు సాక్షాత్తూ ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేయడం సంచలనమైంది. తమ మాట వినని రూరల్ ఎస్పీని ఎలాగైనా ఇక్కడ నుంచి బదిలీచేయాలనే పంతంతో ఎమ్మెల్యేలుంటే..ఎస్పీ కోయ ప్రవీణ్ని బదిలీ చేస్తే డిపార్టుమెంట్లో నైతికస్థయిర్యం దెబ్బ తింటుందని పోలీసులు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ పంచాయితీ ప్రస్తుతం డీజీపీ, సీఎం వద్దకు చేరడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది.దానికి మరింత తీవ్రత పెంచేందుకు ఎమ్మెల్యేల బృందం పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, టిఎస్ఎన్ రాజు, వెలగపూడి రామకృష్ణ, గణబాబులు డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పను మంగళవారం కలిశారు.
మా మాట నెగ్గాల్సిందే: హోంమంత్రికి జిల్లా ఎమ్మెల్యేలు పోలీసులపై ఘాటుగానే ఫిర్యాదు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..జిల్లాలో ఎమ్మెల్యేలంటే కనీస గౌరవం పోలీసు వర్గాల్లో లేదని, తమ మాటకు కనీస విలువ ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. ఓ ఎసై స్థాయి ఉద్యోగి తమపై ఆరోపణలు చేయడం ఒకెత్తయితే, మిగతా విషయాల్లోనూ తమ మాటను ఏ అధికారి లెక్క చేయడం లేదని వారు వివరించారు. ముఖ్యంగా ఎస్పీ వైఖరిని వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఓ వర్గం వారికి ఎస్పీ కొమ్ముకాస్తున్నారని, దాని వల్ల తాము నష్టపోతున్నామని వారు ఆరోపించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము మరింత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని, వెంటనే తాము కోరుతున్నట్లు ఎస్పీని బదిలీ చేయాలని వారు హోం మంత్రికి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు చెప్పిందంతా విన్న హోంమంత్రి తాను విశాఖ వచ్చి ఇరు వర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. త్వరలోనే సీఎంతో మాట్లాడి ఆయన సూచనమేరకు జిల్లాకు వస్తానని, అంతవరకూ ఓర్పుగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
ఎందుకంత పట్టు:
ఎస్పీని బదిలీ చేయించేందుకు ఎమ్మెల్యేలు ఇంతగా పట్టుబట్టడం సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీలకు ఫిర్యాదు చేయడం వెనుక తమ మాట వినడం లేదనే ఆరోపణతో పాటు అంత కంటే పెద్ద కారణాలే ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ కూడా ఇంత మంది ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వెనక్కు తగ్గకుండా పిలబడటం చూస్తుంటే ఆయన వెనుక పెద్దల అండ ఉందని తెలుస్తోంది. ఈ వివాదం ఏ ఫలితాలను ఆశించి రగులుకుందో తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.