Krishna Goud
-
ఆ అధికారిని జైలుకు పంపడమే కరెక్ట్
సాక్షి, హైదరాబాద్: కోర్టుధిక్కరణ పిటిషన్లపై అప్పీల్ దాఖలు చేసే కేసుల్లో సంబంధిత అధికారులు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని గతంలో తాము ఆదేశించినా.. వరంగల్ సౌత్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) టి.కృష్ణాగౌడ్ ఎందుకు హాజరు కాలేదని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయని ఇటువంటి అధికారులను జైలుకు పంపడమే సమంజసమని వ్యాఖ్యానించింది. ఇప్పటికే సింగిల్ జడ్జి విధించిన శిక్ష అమలును నిలిపివేస్తూ 2018లో ఇచ్చిన ఉత్తర్వులు ఆరు నెలలపాటు మాత్రమే అమల్లో ఉంటాయని, గతంలో ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమల్లో లేనందున కృష్ణాగౌడ్‌ను జైలుకు పంపాల్సిన అవసరముందని స్పష్టంచేసింది. కాగా, తదుపరి విచారణకు కృష్ణాగౌడ్ తప్పనిసరిగా హాజరవుతారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ విజ్ఞప్తిచేయగా ధర్మాసనం అందుకు అనుమతించింది. జూన్ 15న హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను వాయిదావేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వరంగల్ జిల్లా కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చింతగూడ ప్రాంతంలోని కంపార్ట్మెంట్ 851లోని 30 ఎకరాలను గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నామని, అటవీ భూమి అనే పేరుతో అటవీ అధికారులు అడ్డుకుంటున్నారంటూ అదే ప్రాంతానికి చెందిన వజ్జా రాజబాబు 2014లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి.. పిటిషనర్ల భూముల జోలికి పోరాదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. అయినా వినని అటవీ అధికారులు పిటిషనర్లను అడ్డుకోవడంతోపాటు ట్రాక్టర్‌ను సీజ్‌చేశారు. అంతేగాక వారు వంట చెరుకు, ఇతర అటవీ ఉత్పత్తులు తరలిస్తున్నారంటూ అక్రమంగా కేసు నమోదుచేశారు. దీన్ని సవాల్‌చేస్తూ పిటిషనర్లు కోర్టుధిక్కరణ కింద దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి.. బాధ్యులైన అటవీశాఖ అధికారులకు రెండు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అటవీ అధికారులు దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ 2018లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ అప్పీల్ మంగళవారం మరోసారి విచారణకు రాగా కృష్ణాగౌడ్ ప్రత్యక్షంగా హాజరుకాకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. -
పుష్కరాలకెళ్లి వచ్చేసరికి.. ఇల్లు గుల్ల
హైదరాబాద్ సిటీ: కరీంనగర్ జిల్లా ధర్మపురి గోదావరి పుష్కరాలకెళ్లి వచ్చేసరికి దొంగలు తమ ప్రదర్శన చూయించారు. నాచారం పరిధిలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన కృష్ణా గౌడ్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడ్డారు. కృష్ణా గౌడ్ తన కుటుంబసభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో ఉలిక్కిపడ్డారు. ఇల్లు తెరిస్తే చూస్తే ఇంటిలో విలువైన ఆభరణాలు తస్కరించినట్లు అర్ధమయింది. ఇల్లంతా చిందరవందర చేయడంతో పాటు 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు దోచుకెళ్లినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘హెరిటేజ్’ను మూసివేయాలి
జోగిపేట: హెరిటేజ్ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేస్తూ జోగిపేటలో టీజీవీపీ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ నాయకులు విద్యార్థులతో ఊరేగింపుగా వచ్చి హెరిటేజ్ పరిశ్రమను మూసివేయాలంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకు ముందు వారు స్థానిక తహశీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి, అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ టీజీబీవీ నాయకులు కృష్ణాగౌడ్, సురేష్ మాట్లాడుతూ హెరిటేజ్ పాల కారణంగా చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నందున ప్రభుత్వం వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హెరిటేజ్ పాలను నిషేధించాలి సంగారెడ్డి క్రైం: తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కొత్తబస్టాండ్ ఎదుట ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ పాలలో డిటర్టెంట్ కలిపి కల్తీ చేస్తున్నందున ఆ పాలను తెలంగాణ రాష్ట్రంలో నిషేధించాలన్నారు. కల్తీ పాల విక్రయాలకు మద్దతు పలుకుతున్న తెలంగాణ టీడీపీ నేతలు తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. హెరిటేజ్ పాలు విక్రయించి ఎక్కువ లాభాలు పొందాలనే దురాలోచనతో ఆవులకు, గేదెలకు ఇంజెక్షన్లు ఇవ్వడంతో పసిపిల్లలు, విద్యార్థులు కిడ్నీ, కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ పాలను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల వేణు, మండల అధ్యక్షుడు శివరామకృష్ణ, మచ్చేందర్, రాజు, శ్రీనివాస్, నర్సిములు, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.